• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేసీఆర్ జాతీయ రాజకీయాల వెనుక అసలు కారణాలు ఇవేనా..?

    తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలు అనే నినాదం చేస్తున్నారు. భాజపా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి సమాయత్తమవుతున్నాడు. బంగారు తెలంగాణ మాదిరిగానే బంగారు భారతదేశాన్ని కూడా రూపొందించడానికి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని.. తెలంగాణ ప్రజలు దీవించాలని ఇటీవలే ఓ సభలో వ్యాఖ్యానించారు. అలాగే జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి విషయమై మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ని కూడా కలిశారు.

    ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలపై దృష్టిసారించిన కేసీఆర్ ఉన్నట్టుండి నేషనల్ పాలిటిక్స్‌ అనే పదం పఠించడానికి చాలా బలమైన కారణమే ఉండొచ్చు. అసలు కారణం ఏంటో కేసీఆర్‌కి తప్ప మరొకరికి తెలిసే అవకాశం ఉండదు. కానీ కేసీఆర్ జాతీయ రాజకీయాల అంశం వెనుక కారణాలు ఇవే ఉండొచ్చంటూ రాజకీయ విశ్లేషకులు కొన్ని అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

    అసలు కారణాలు ఇవేనా?

    కేటీఆర్‌కి పట్టాభిషేకం 

    తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొన్నాళ్ల నుంచి కేటీఆర్ సీఎం అవుతున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు కూడా కేసీఆర్ తప్పుకొని కొడుకుకి పట్టాభిషేకం చేయబోతున్నాడని విమర్శలు చేశాయి. ప్రస్తుతం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగుపెట్టడానికి అసలు కారణం ఇదే అంటూ చాలా వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేటీఆర్‌కి సీఎంగా రాష్ట్ర బాధ్యతలు అప్పజెప్పి కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఇదే సరైన సమయంగా కేసీఆర్ భావిస్తున్నాడట.

    ముందస్తు ఎన్నికలు- కార్యకర్తల్లో ఉత్సాహం

    గతంలో మాదిరిగానే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, కార్యకర్తలను ఉత్తేజపరచడానికి కేసీఆర్ జాతీయ రాజకీయ నినాదాలు చేస్తున్నాడని పలువురు భావిస్తున్నారు. తెలంగాణ బిడ్డ జాతీయ రాజకీయాలను శాసిస్తే తమకే గర్వకారణంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు భావించి ఓట్లు వేసే అవకాశం ఉంటుందనేది వారి అభిప్రాయం. కేసీఆర్ 2019లో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లి థ‌ర్డ్ ఫ్రంట్ అనే అంశాన్ని తెరపైకి తీసుకురావడం గమనార్హం.

    ప్రత్యామ్నాయ కూటమి

    దేశ రాజకీయాల్లో భాజపా, కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా మరో కూటమిని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నాడట. అందుకు అనుగుణంగా అడుగులు వేసేందుకు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తున్నాడని సమాచారం. అందుకే జాతీయ రాజకీయాలు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర‌ సీఎంలను కేసీఆర్ కలిసినట్లు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ లేకుండా భాజపాను ఢీకొట్టడం కష్టమని భావించి కాంగ్రెస్‌ని కూడా కూటమిలో భాగస్వామ్యం చేయనున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

     అధికారాన్ని కాపాడుకోవడం

    తెరాసని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికే  జాతీయ రాజకీయాలు అనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతకు తోడు ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీని కోరుకుంటున్నట్లు కేసీఆర్ సర్వేలో వెల్లడయిందట. అలాగే ఎంపీ ఎన్నికల్లో తెరాసకు ఆశించిన సీట్లు రాకపోవడం, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ గెలుపొందడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్ల సంఖ్య తగ్గి బీజేపీ బలంగా పుంజుకోవడం..తదితర కారణాలు కేసీఆర్‌ని కొంత విస్మయానికి గురి చేసినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో భాజపా నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే గ్రహించి కేసీఆర్ జాతీయ రాజకీయాల అంశం తీసుకొచ్చి ప్రజల్లో తెరాసను బలమైన పార్టీగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడట.

    ప్రశాంత్ కిశోర్‌తో జట్టు 

    రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ ఈ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో జత కట్టబోతున్నట్లు తెలుస్తుంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కన్నా ప్రశాంత్ కిశోర్‌కి మంచి సత్సంబంధాలు ఉండటమే అందుకు కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. పీకేకి ఉన్న పరిచయాలతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పరిచయాలు పెంచుకొని ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని చూస్తున్నాడట. అలాగే పీకే కూడ భాజపా, కాంగ్రెస్‌లకు దూరమై ప్రత్నామ్నాయం కావాలనే కేసీఆర్‌కి మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.

    ఇది ఒక కారణమే

    కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో తెరాసకు సుస్థిర అధికారాన్ని కట్టబెట్టి కేటీఆర్‌ని సీఎం చేయనున్నాడట. తదుపరి జాతీయ రాజకీయాలపై పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించి సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ నేతగా కేసీఆర్ ఎదగాలని చూస్తున్నాడని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా కేసీఆర్ జాతీయ రాజకీయం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ కేసీఆర్ జాతీయ నేతగా ఎదుగుతాడో, రాష్ట్ర సీఎంగానే కొనసాగుతాడో అతడి అంతరంగానికి మాత్రమే తెలుసు.

    ముఖ్యమంత్రులతో భేటీలు

    ఎన్డీఏకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ స్థానిక పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలవగా.. తాజాగా దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో భాజపాను ఓడించి.. జాతీయ  రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో జాతీయ నేతలతో తరచూ భేటీ అవుతున్నారు. అలాగే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ని కూడ రంగంలోకి దించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv