ఎన్టీఆర్(Sr. NTR) వర్ధంతి వేళ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat)లో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన బాలయ్య.. అక్కడ ఏర్పాటు చేసిన జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఫ్లెక్సీలను తొలగించడంపై తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ అంశంలోకి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) కలుగచేసుకోవడంతో ఇది రాజకీయ చర్చకు దారి తీసింది.
‘తీయించేయ్.. ఇప్పుడే’
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కల్యాణ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో తన తాతకు నివాళులర్పించారు. ఆ తర్వాత కాసేపటికి నందమూరి బాలకృష్ణ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికెళ్లారు. ఎన్టీఆర్ సమాధిపై పూలమాల వేసి అంజలి ఘటించారు. తర్వాత.. అక్కడ జూ. ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బాలయ్య చూపు పడింది. ఆ ప్లెక్సీలను తీసేయాలని బాలకృష్ణ ఆదేశించారు. ఇప్పుడే తీసేయాలి అంటూ కోపంగా బాలయ్య అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తారక్ ఫ్యాన్స్ మండిపాటు
ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. తన అల్లుడు నారా లోకేష్ కోసమే జూ.ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తారక్ రాజకీయాల్లోకి వస్తే లోకేష్ భవితవ్యం ప్రశ్నార్థకం అవతుందని పేర్కొంటున్నారు. తారక్‌కు ఉన్న క్రేజ్, మాట్లాడే తత్వం, నాయకత్వ లక్షణాలు లోకేష్‌ను పొలిటికల్‌గా ఇరకాటంలో పడేస్తాయని, అందుకే బాలయ్య తారక్‌ను దూరం పెడుతున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు
మరోవైపు ఈ అంశంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘అల్లుడు నారా లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారు. గతంలో పెద్ద ఎన్టీఆర్‌ను దించేసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారు. వెయ్యి మంది బాలకృష్ణలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రంగంలోకి వైసీపీ వర్గాలు!
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైన నేపథ్యంలో అధికార వైసీపీ.. ఈ ప్లెక్సీల అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. వైసీపీ సోషల్ మీడియా టీమ్.. తారక్‌కు మద్దతుగా పోస్టులు పెడుతూ ఎన్టీఆర్ అభిమానులను మద్దతును కూడగట్టేందుకు యత్నిస్తోంది. బాలయ్య అన్న మాటలను తమ సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా సర్క్యూలేట్ చేస్తూ టీడీపీకి చెక్ పెట్టేందుకు యత్నిస్తోంది. మెుత్తంగా తారక్ ప్లెక్సీల తొలగింపు వ్యవహారం ఏపీలో రాజకీయ రంగును పులుముకోవడం గమనార్హం.
గతంలోనూ ఇలాగే..
అయితే గతంలోనూ నందమూరి కుటుంబానికి, జూ.ఎన్టీఆర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తారక్ ఒక్క ప్రకటన చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రెస్‌మీట్‌లో ఈ అంశంపై బాలయ్యను ప్రశ్నించగా ‘ఐ డోంట్ కేర్’ అంటూ అప్పట్లోనే ఆయన బదులిచ్చారు. ఆ అసహనంతోనే ఇప్పుడు ప్లెక్సీలు తీయించమని ఉండొచ్చు. ఆ తర్వాత జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లోనూ తారక్ ఎక్కడా కనిపించలేదు. ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేసే కార్యక్రమంలో నందమూరి కుటుంబం మెుత్తం పాల్గొన్నప్పటికీ హరికృష్ణ కుటుంబం దూరంగా ఉంది.
తారక్ మౌనానికి కారణం అదేనా?
2009 ఎలక్షన్స్ ముందు వరకూ తారక్ టీడీపీ తరపున చాలా చురుగ్గా వ్యవహరించాడు. ఎన్నికల్లో పార్టీ తరపున సుడిగాలి పర్యటన చేసి తన ప్రచారంతో శ్రేణులను హోరెత్తించారు. అయితే ఆ ఎలక్షన్స్‌లో ఓడిపోవడంతో జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు పక్కనే పెట్టేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ దృష్ట్యా 2014 నుంచి పార్టీ వ్యవహారాలకు తారక్‌ను దూరంగా ఉంచారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటివరకూ పార్టీ అవసరాలకు వినియోగించుకొని ఒక్కసారిగా పక్కనపెట్టేయడం తారక్‌ను తీవ్రంగా బాధించిందని అతడి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి