బతుకమ్మ పండుగ తెలంగాణ పల్లె సంస్కృతిలో ఓ భాగం. ప్రతి ఆడపడుచు ఉత్సాహంగా జరుపుకొనే సంబరం ఇది. ఈ సంబరాల్లో బతుకమ్మ పాటలది ప్రత్యేక స్థానం. మన అమ్మలు, అమ్మమ్మలు చాలా చక్కగా వీటిని పాడుతూ.. బతుకమ్మ ఆట ఆడుతుంటారు. కానీ నేటితరానికి ఈ పాటలపై పెద్దగా పట్టు లేదు. పెద్దవారితో కలిసి కాలు కదుపుతారు కానీ, పాటను అందుకోలేరు. పదాలు కూడా సరిగా పలకలేరు. ఎంతోమందికి ఈ పాటలు నేర్చుకోవాలనే కుతూహలం ఉన్నా.. వీలు కాకపోవచ్చు. ఈక్రమంలో తెలంగాణ పల్లెల్లో ప్రజాదారణ పొందిన బతుకమ్మ పాటలు మీకోసం.
Contents
- 1 ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
- 2 చిత్తూ చిత్తుల గుమ్మ ఉయ్యాల పాట
- 3 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
- 4 నాగమల్లేలో.. తీగమల్లేలో
- 5 ఇద్దరక్క చెల్లెళ్లు ఉయ్యాలో
- 6 నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ
- 7 కలవారి కోడలు.. ఉయ్యాలో
- 8 నేసెనే శాలోడు ఉయ్యాలో
- 9 ఒక్కేసి పువ్వేసి
- 10 ఊరికి ఉత్తరానా వలలో..
- 11 రామ రామా రామ ఉయ్యాలో
- 12 శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
- 13 బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్
- 14 కోసలాధీశుండు ఉయ్యాలో
- 15 బతుకమ్మను పేర్చే పాట
- 16 అప్పుడే వచ్చెను బతుకమ్మ
- 17 సాగనంపే పాట- తంగేడు పూవుల్ల
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
చిత్తూ చిత్తుల గుమ్మ ఉయ్యాల పాట
చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దులగుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
రాగి బిందె తీస్క రమణీ నీళ్లాకు బోతె
రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
వెండి బిందె తీస్క వెలదీ నీళ్లాకు బోతె
వెంకటేశుడెదురాయెనమ్మో ఈ వాడలోన
బంగారు బిందె తీస్క భామా నీళ్లాకు బోతె
భగవంతు డెదురాయెనమ్మో ఈ వాడలోన
పగడాల బిందె తీస్క పడతీ నీళ్లాకు బోతె
పరమేశు డెదురాయెనమ్మో ఈ వాడలోన
ముత్యాల బిందె తీస్క ముదితా నీళ్లాకు బోతె
ముద్దు కృష్ణుడెదురాయెనమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దులగుమ్మ ||
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ అనే పదం ఎలా వాడుకలోకి వచ్చింది? దాని వెనక ఉన్న చరిత్ర ఏమిటో ఈ పాట ద్వారా చూద్దాం.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
ఆనాటి కాలాన ఉయ్యాలో
ధర్మాంగుడను రాజు ఉయ్యాలో
ఆ రాజు భార్యయు ఉయ్యాలో..
అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో
నూరు నోములు నోమి ఉయ్యాలో
నూరు మందిని కాంచె ఉయ్యాలో
వారు శూరులై ఉయ్యాలో
వైరులచే హతమయిరి ఉయ్యాలో
తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో
తరగని శోకమున ఉయ్యాలో
ధన రాజ్యములను బాసి ఉయ్యాలో
దాయాదులను బాసి ఉయ్యాలో
వనితతో ఆ రాజు ఉయ్యాలో
వనమందు నివసించే ఉయ్యాలో
కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో
ఘన తపంబొనరించె ఉయ్యాలో
ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో
పలికె వరమడుగమని ఉయ్యాలో
వినిపించి వేడుచూ ఉయ్యాలో
వెలది తన గర్భమున ఉయ్యాలో..
పుట్టమని వేడగా ఉయ్యాలో
పూబోణి మది మెచ్చి ఉయ్యాలో
సత్యవతి గర్భమున ఉయ్యాలో
జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో
అంతలో మునులును ఉయ్యాలో
అక్కడికి వచ్చిరి ఉయ్యాలో..
కపిల గాలవూలు ఉయ్యాలో
కష్యపాంగ ఋషులు ఉయ్యాలో..
అత్రి వశిష్టులు ఉయ్యాలో
ఆకన్నియను చూచి ఉయ్యాలో..
బతుకనీయ తల్లి ఉయ్యాలో
బతుకమ్మ యనిరంత ఉయ్యాలో..
పిలువగా అతివలు ఉయ్యాలో
ప్రేమగా తల్లిదండ్రులు ఉయ్యాలో..
బతుకమ్మ యనుపేరు ఉయ్యాలో
ప్రజలంత అందురు ఉయ్యాలో
తాను ధన్యుడంటూ ఉయ్యాలో
తన బిడ్డతో రాజు ఉయ్యాలో
నిజ పట్నముకేగి ఉయ్యాలో
నేల పాలించగా ఉయ్యాలో
శ్రీ మహా విష్ణుండు ఉయ్యాలో
చక్రకుండను పేర ఉయ్యాలో
రాజు వేషమ్మున ఉయ్యాలో
రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో
ఈ ఇంట మునియుండి ఉయ్యాలో
అతిగా బతుకమ్మను ఉయ్యాలో
పెండ్లాడి కొడుకుల ఉయ్యాలో
పెక్కు మందిని కాంచె ఉయ్యాలో
ఆరు వేల మంది ఉయ్యాలో
అతి సుందరాంగులు ఉయ్యాలో
ధర్మాంగుడను రాజు ఉయ్యాలో
తన భార్య సత్యవతి ఉయ్యాలో
సిరిలేని సిరులతో ఉయ్యాలో
సంతోషమొందిరి ఉయ్యాలో..
జగతిపై బతుకమ్మ ఉయ్యాలో
శాశ్వతమ్ముగ వెలిసే ఉయ్యాలో
ఈ పాట పాడినను ఉయ్యాలో
ఈ పాట విన్నను ఉయ్యాలో
సౌభాగ్యములనిచ్చు ఉయ్యాలో
శ్రీ గౌరీ దేవి ఉయ్యాలో
సిరి సంపదలిచ్చు ఉయ్యాలో
శ్రీ లక్ష్మీ దేవి ఉయ్యాలో
ఘనమైన కీర్తిని ఉయ్యాలో
శ్రీ వాణి ఒసగును ఉయ్యాలో..
ఘనమైన కీర్తిని ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నాగమల్లేలో.. తీగమల్లేలో
పల్లెల్లో బతుకమ్మ నాగమల్లేలో
పువ్వయి పూసింది తీగమల్లేలో
పట్నంల బతుకమ్మ నాగమల్లేలో
పండూగ చేసింది తీగమల్లేలో
బాధల్ల బతుకమ్మ నాగమల్లేలో
బంధువై నిలిచింది తీగమల్లేలో
కష్టాల్లొ బతుకమ్మ నాగమల్లేలో
కన్నీరు తుడిచింది తీగమల్లేలో
తంగేడు పువ్వుల్లొ నాగమల్లేలో
తల్లి నిను కొలిచెదము తీగమల్లేలో
ఇద్దరక్క చెల్లెళ్లు ఉయ్యాలో
ఇద్దరక్క చెల్లెళ్లు ఉయ్యాలో
ఒక్కూరికిస్తె ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో
ఒచ్చెన పొయెన ఉయ్యాలో
ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో
ఏరడ్డమాయె ఉయ్యాలో
ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో
తలుపులడ్డమాయె ఉయ్యాలో
తలుపు తాళాలు ఉయ్యాలో
వెండివే సిలలూ ఉయ్యాలో
వెండి చీలకింది ఉయ్యాలో
వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో
ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో
ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో
తక్కెడెపత్తి ఉయ్యాలో
ఏడుగింజల పత్తి ఉయ్యాలో ఎళ్లెనా ఆపత్తి ఉయ్యాలో
ఆపత్తి తిసుకొని ఉయ్యాలో
ఏడికిపొయిరి ఉయ్యాలో
పాల పాలపత్తి ఉయ్యాలో
పావురాయి పత్తి ఉయ్యాలో
పాల పాలపత్తి ఉయ్యాలో బంగారు పత్తి ఉయ్యాలొ..!!
నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ
నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ
నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు
పాలిచ్చె తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు
నినుగన్న తల్లికి నిండునూరేండ్లు
రుద్రాక్షపూవుల్లు పూసేటివేళ
రుద్రుడూ మా దొడ్లొ సొచ్చేటివేళ
కట్టాయి పూవుల్లు పూసేటివేళ
కాముడు మా దొడ్లొ సొచ్చేటివేళ
గుమ్మాడి పూవుల్లు పూసేటివేళ
బుద్ధుడూ మా దొడ్లొ సొచ్చేటి వేళ
పిల్లిపెసరకాయ పిటపీట
అల్లం కొమ్మ జొజోట
అత్తల గరిటె చందప్ప
లేవె లేవె గౌరమ్మ
కలవారి కోడలు.. ఉయ్యాలో
కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో
కడవల్లోనబోసి ఉయ్యాలో
అప్పుడే వచ్చెను ఉయ్యాలో
ఆమె పెద్దన్న ఉయ్యాలో
కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో
కన్నీళ్లు తీసింది ఉయ్యాలో
ఎందుకు చెల్లెల్లా ఉయ్యాలో
ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో
తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో
ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో
వెళ్లి వద్దామమ్మ ఉయ్యాలో
చేరి నీవారితో ఉయ్యాలో
చెప్పిరాపోవమ్మ ఉయ్యాలో
పట్టెమంచం మీద ఉయ్యాలో
పవళించిన మామ ఉయ్యాలో
మాయన్నలొచ్చిరి ఉయ్యాలో
మమ్ముబంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ అత్తనడుగు ఉయ్యాలో
అరుగుల్ల గూసున్న ఉయ్యాలో
ఓ అత్తగారు ఉయ్యాలో
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో
మమ్ముబంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ బావనడుగు ఉయ్యాలో
భారతం సదివేటి ఉయ్యాలో
బావ పెద్ద బావ ఉయ్యాలో
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో
మమ్ముబంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ అక్కనడుగు ఉయ్యాలో
వంటశాలలో ఉన్న ఉయ్యాలో
ఓ అక్కగారు ఉయ్యాలో
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో
మమ్ముబంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ భర్తనే అడుగు ఉయ్యాలో
రచ్చలో గూర్చున్న ఉయ్యాలో
రాజేంద్ర భోగి ఉయ్యాలో
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో
మమ్ముబంపుతార ఉయ్యాలో
కట్టుకో చీరలు ఉయ్యాలో
పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో
వెళ్లిరా ఊరికి ఉయ్యాలో
పుట్టినింటికి నువ్వు ఉయ్యాలో
శుభముగా పోయిరా ఉయ్యాలో
మెట్టిటినింటికి నువ్వు ఉయ్యాలో
క్షేమంగా తిరిగిరా ఉయ్యాలో
నేసెనే శాలోడు ఉయ్యాలో
నేసెనే శాలోడు ఉయ్యాలో
నెలకొక్క పోగు ఉయ్యాలో
మొదటనా నేసిండు ఉయ్యాలో
మొగ్గలా తోని ఉయ్యాలో
అంచునా నేసిండు ఉయ్యాలో
ఆకులు కొమ్మలూ ఉయ్యాలో
నడుమనా నేసిండు ఉయ్యాలో
నాగాభరణము ఉయ్యాలో
చెంగునా నేసిండు ఉయ్యాలో
చామంతి వనము ఉయ్యాలో
చల్లదనమిచ్చే ఉయ్యాలో
చంద్రునీ నేసెను ఉయ్యాలో
ఆటపాటల రెండు ఉయ్యాలో
హంసలా నేసెను ఉయ్యాలో
భారియ్య మేడలది ఉయ్యాలో
భవనంబు నేసెను ఉయ్యాలో
కొంగునా నేసిండు ఉయ్యాలో
గోరింట వనము ఉయ్యాలో
మల్లెపువ్వుల్లోన ఉయ్యాలో
మడుతా పెట్టుకొని ఉయ్యాలో
జాజిపూలతోని ఉయ్యాలో
సంకనా పెట్టుకొని ఉయ్యాలో
దొరలున్న చోటన ఉయ్యాలో
దొరకకా పాయెను ఉయ్యాలో
రాజులున్నా చోట ఉయ్యాలో
రాకనే పాయెను ఉయ్యాలో
ముందు చూసినవారు ఉయ్యాలో
మూడు వేలనిరి ఉయ్యాలో
అంచు చూసినవారు ఉయ్యాలో
ఐదు వేలనిరి ఉయ్యాలో
ఈ చీరకు మీరు ఉయ్యాలో
వెలతీర్చి చెప్పండి ఉయ్యాలో
సాలె బోగము దానికి ఉయ్యాలో
సరసముతొ నేసెను
ఒక్కేసి పువ్వేసి
ఒక్కేసి పువ్వేసి చందమామా
ఒక్క జాము ఆయె చందమామా
పైన మఠం కట్టి చందమామా
కింద ఇల్లు కట్టి చందమామా
మఠంలో ఉన్న చందమామా
మాయదారి శివుడు చందమామా
శివపూజ వేళాయె చందమామ
శివుడు రాకపాయె చందమామా
గౌరి గద్దెల మీద చందమామా
జంగమయ్య ఉన్నాడె చందమామా
రెండేసి పూలేసి చందమామా
రెండు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడు రాకపాయె చందమామా
మూడేసి పూలేసి చందమామా
మూడు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడు రాకపాయె చందమామా
నాలుగేసి పూలేసి చందమామా
నాలుగు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడేల రాకపాయె చందమామా
ఐదేసి పూలేసి చందమామా
ఐదు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడు రాకపాయె చందమామా
ఆరేసి పూలేసి చందమామా
ఆరు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడు రాకపాయె చందమామా
ఏడేసి పూలేసి చందమామా
ఏడు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడేల రాకపాయె చందమామా
ఎనిమిదేసి పూలేసి చందమామా
ఎనిమిది జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడు రాకపాయె చందమామా
తొమ్మిదేసి పూలేసి చందమామా
తొమ్మిది జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా
శివుడు రాకపాయె చందమామా
తంగేడు వనములకు చందమామా
తాళ్ళు కట్టాబోయె చందమామా
గుమ్మాడి వనమునకు చందమామా
గుళ్ళు కట్టాబోయె చందమామా
రుద్రాక్ష వనములకు చందమామా
నిద్ర చేయబాయె చందమామా
ఊరికి ఉత్తరానా వలలో..
ఊరికి ఉత్తరానా.. వలలో
ఊరికి ఉత్తరానా … వలలో
ఊడాలా మర్రీ … వలలో
ఊడల మర్రి కిందా … వలలో
ఉత్తముడీ చవికే … వలలో
ఉత్తముని చవికేలో … వలలో
రత్నాల పందీరీ … వలలో
రత్తాల పందిట్లో … వలలో
ముత్యాలా కొలిమీ … వలలో
గిద్దెడు ముత్యాలా … వలలో
గిలకాలా కొలిమీ … వలలో
అరసోల ముత్యాలా … వలలో
అమరీనా కొలిమీ … వలలో
సోలెడు ముత్యాలా … వలలో
చోద్యంపూ కొలిమీ … వలలో
తూమెడు ముత్యాలా … వలలో
తూగేనే కొలిమీ … వలలో
చద్దన్నమూ తినీ … వలలో
సాగించూ కొలిమీ … వలలో
పాలన్నము దినీ … వలలో
పట్టేనే కొలిమీ … వలలో
రామ రామా రామ ఉయ్యాలో
రామ రామా రామ ఉయ్యాలో!
రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామా నంది ఉయ్యాలో!
రాగ మెత్తారాదు ఉయ్యాలో
చారెడు బియ్యంలో ఉయ్యాలో
చారెడూ పప్పు పోసి ఉయ్యాలో
చారెడు పప్పుపోసి ఉయ్యాలో
వన దేవుని తల్లి ఉయ్యాలో
అక్కమ్మ కేమొ ఉయ్యాలో
అన్నీ పెట్టింది ఉయ్యాలో
అప్పుడూ అక్కమ్మ ఉయ్యాలో
తిన్నట్టు తిని ఉయ్యాలో
తిన్నట్టు తినీ ఉయ్యాలో
పారేసినాది ఉయ్యాలో
పెద్దోడు రామన్న ఉయ్యాలో
బుద్ధిమంతుడాని ఉయ్యాలో
ఏడు రోజుల్ల ఉయ్యాలో
చెల్లెరో అక్కమ్మ ఉయ్యాలో
అక్కమ్మా కురులు ఉయ్యాలో
దురవాసినాయి ఉయ్యాలో
అందరానికాడ ఉయ్యాలో
ఆకు అందుకోని ఉయ్యాలో
ముట్టరాని కాడ ఉయ్యాలో
ముల్లు ముట్టుకోని ఉయ్యాలో
పెద్ద నేలు రాత ఉయ్యాలో
పేరువాడా రాసి ఉయ్యాలో
సిటికెనేలూ రాత ఉయ్యాలో
సిక్కువాడా రాసి ఉయ్యాలో
రాకి గొంట బొయ్యి ఉయ్యాలో
రామన్న కిచ్చె ఉయ్యాలో
కూసుండి రామన్న ఉయ్యాలో
రాకి గట్టుకోని ఉయ్యాలో
రాయనాసి నచ్చి ఉయ్యాలో
పోయెనాసి నచ్చి ఉయ్యాలో
బుడ్డెడూ నూనె ఉయ్యాలో
తీసుకా పోయింది ఉయ్యాలో
చారెడంత నూనె ఉయ్యాలో
చదిరి తలకంటి ఉయ్యాలో
కడివెడంత నూనె ఉయ్యాలో
కొట్టి తలకంటి ఉయ్యాలో
గిద్దెడంత నూనె ఉయ్యాలో
గిద్ది తలకంటి ఉయ్యాలో
అరసోలెడూ నూనె ఉయ్యాలో
అందంగ తలకంటి ఉయ్యాలో
సోలెడూ నూనే ఉయ్యాలో
సోకిచ్చే తలకూ ఉయ్యాలో…
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై
పార్వతీ దేవివై పరమేశు రాణివై
పరగ శ్రీలక్ష్మివైయ్యూ గౌరమ్మ
భార్య వైతివి హరికినీ గౌరమ్మ
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
ముక్కోటి దేవతలు సక్కనీ కాంతలు
ఎక్కువగ నిను గొల్చి పెక్కు నోములు నోచి
ఎక్కువా వారయ్యిరీ గౌరమ్మ
ఈలోకమున నుండియూ గౌరమ్మ
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్
బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్..
బిడ్డ పేరేమి కోల్
నాబిడ్డ నీలగౌరు కోల్..
నిచ్చెమల్లె చెట్టేసి కోల్
చెట్టూకు చెంబేడు కోల్..
నీళ్లనూ పోసి కోల్
కాయల్లు పిందేలు కోల్..
గనమై కాసెను కోల్
అందుట్ల ఒక పిందే కోల్.. ఢిల్లీకె పాయెనూ కోల్
ఢిల్లీలో తిప్పరాజు కోల్..
మేడా కట్టించె కోల్
మేడాలొ ఉన్నదమ్మా కోల్..
మేలిమ్మి గౌరి కోల్
మేలిమ్మి గౌరికి కోల్..
మీది బుగిడీలు కోల్
అనుపకాయ కొయ్యండ్రి కోల్..
అమరా గంటీలు కోల్
చిక్కుడు కాయ కొయ్యండ్రి కోల్..
చిత్రాల వడ్డాణం కోల్
నుగ్గాయ కొయ్యండ్రి కోల్..
నూటొక్కా సొమ్ము కోల్
అన్ని సొమ్ముల పెట్టి కోల్.. అద్దంలో చూసె కోల్
అద్దంలో గౌరమ్మ కోల్..
నీ మొగుడెవరమ్మా కోల్
దేవస్థానం బోయిండు కోల్..
దేవూడయ్యిండు కోల్
శివలోకం బోయిండు కోల్..
శివుడే అయ్యిండు కోల్
యమలోకం బోయిండు కోల్..
యముడే అయ్యిండు కోల్
కోసలాధీశుండు ఉయ్యాలో
కోసలాధీశుండు ఉయ్యాలో
దశరథ నాముండు ఉయ్యాలో
కొండ కోనలు దాటి ఉయ్యాలో
వేటకే బోయెను ఉయ్యాలో
అడవిలో దిరిగెను ఉయ్యాలో
అటు ఇటు జూచెను ఉయ్యాలో
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో
చెరువొకటి కనిపించె ఉయ్యాలో
శబ్దమేదొ వినెను ఉయ్యాలో
శరమును సంధించె ఉయ్యాలో
జంతువేదొ జచ్చె ఉయ్యాలో
అనుకొని సాగెను ఉయ్యాలో
చెంతకు చేరగా ఉయ్యాలో
చిత్తమే కుంగెను ఉయ్యాలో
కుండలో నీళ్ళను ఉయ్యాలో
కొనిపో వచ్చిన ఉయ్యాలో
బాలుని గుండెలో ఉయ్యాలో
బాణమే గుచ్చెను ఉయ్యాలో
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో
ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో
శ్రవణుడు నేననె ఉయ్యాలో
చచ్చేటి బాలుడు ఉయ్యాలో
తప్పు జరిగెనంచు ఉయ్యాలో
తపియించెను రాజు ఉయ్యాలో
చావు బతుకుల బాలుడుయ్యాలో
సాయమే కోరెను ఉయ్యాలో
నా తల్లిదండ్రులు ఉయ్యాలో
దాహంతో ఉండిరి ఉయ్యాలో
ఈ నీళ్ళు గొనిపోయి ఉయ్యాలో
ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో
అడవంతా వెదికె ఉయ్యాలో
ఒకచోట జూచెను ఉయ్యాలో
ఒణికేటి దంపతుల ఉయ్యాలో
కళ్లయిన లేవాయె ఉయ్యాలో
కాళ్లయినకదలవు ఉయ్యాలో
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో
వేదన చెందుతూ ఉయ్యాలో
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో
సంగతి జెప్పెను ఉయ్యాలో
పలుకు విన్నంతనే ఉయ్యాలో
పాపమా వృద్ధులు ఉయ్యాలో
శాపాలు బెట్టిరి ఉయ్యాలో
చాలించిరి తనువులు ఉయ్యాలో
శాపమే ఫలియించి ఉయ్యాలో
జరిగె రామాయణం ఉయ్యాలో
లోక కల్యాణమాయె ఉయ్యాలో లోకమే మెచ్చెను ఉయ్యాలో
బతుకమ్మను పేర్చే పాట
తొమ్మిదీ రోజులు ఉయ్యాలో
నమ్మికా తోడుత ఉయ్యాలో
అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో
అరుగులూ వేయించిరి ఉయ్యాలో
గోరంట పూలతో ఉయ్యాలో
గోడలు కట్టించి ఉయ్యాలో
తామరపూలతో ఉయ్యాలో
ద్వారాలు వేయించి ఉయ్యాలో
మొగిలి పూలతోని ఉయ్యాలో
మొగరాలు వేయించి ఉయ్యాలో
వాయిలీ పూలతో ఉయ్యాలో
వాసాలు వేయించి ఉయ్యాలో
పొన్నపూలతోటి ఉయ్యాలో యిల్లునూ కప్పించి ఉయ్యాలో
దోసపూలతోని ఉయ్యాలో
తోరణాలు కట్టించి ఉయ్యాలో
పసుపుముద్దను చేసి ఉయ్యాలో
గౌరమ్మను నిలిపిరి ఉయ్యాలో
చేమంతి పూలతోని ఉయ్యాలో
చెలియను పూజించిరి ఉయ్యాలో
సుందరాంగులెల్ల ఉయ్యాలో
సుట్టూత తిరిగిరి ఉయ్యాలో
ఆటలు ఆడిరి ఉయ్యాలో
పాటలు పాడిరి ఉయ్యాలో
గౌరమ్మ వరమిచ్చె ఉయ్యాలో
కాంతలందరికి ఉయ్యాలో
పాడిన వారికి ఉయ్యాలో
పాడి పంటలు కల్గు ఉయ్యాలో
ఆడిన వారికి ఉయ్యాలో
ఆరోగ్యము కల్గు ఉయ్యాలో
విన్నట్టి వారికి ఉయ్యాలో
విష్ణుపదము కల్గు ఉయ్యాలో
అప్పుడే వచ్చెను బతుకమ్మ
అప్పుడే వచ్చెను ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో
బంగారు నగలు ఉయ్యాలో
బంగారు గాజులు ఉయ్యాలో
గుమ్మడీ పూలు ఉయ్యాలో
గునుగూ పూలు ఉయ్యాలో
వరుస వరుసలతోటి ఉయ్యాలో
వరుసగా పేర్వగా ఉయ్యాలో
అప్పుడే వచ్చిరి ఉయ్యాలో
మా ఆడబిడ్డలు ఉయ్యాలో
ఆటలు ఆడంగ ఉయ్యాలో
పాటలు పాడంగ ఉయ్యాలో
పుసుపూ కుంకుమలు ఉయ్యాలో
సత్తూ సద్దులు ఉయ్యాలో
గౌరీ శంకరులు ఉయ్యాలో
గంగశివులతోటి ఉయ్యాలో
మెప్పులు పొందంగ ఉయ్యాలో
ఆటలు ఆడంగ ఉయ్యాలో
బతుకమ్మ పాటలు ఉయ్యాలో
కలకాలం పాడెదము ఉయ్యాలో
బతుకమ్మ ఆటలు ఉయ్యాలో
కలకాలం ఆడెదము ఉయ్యాలో
సాగనంపే పాట- తంగేడు పూవుల్ల
తంగేడు పూవుల్ల చందమామ
బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ
నువ్వొచ్చి పోవమ్మ చందమామ
బీరాయి పూవుల్ల చందమామ
బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ
నువ్వొచ్చి పోవమ్మ చందమామ
గునిగీయ పూవుల్ల చందమామ
బతుకమ్మ పోతుంది చందమామ
పోతే పోతివిగాని చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ
నువ్వొచ్చి పోవమ్మ చందమామ
కాకర పూవుల్ల చందమామ
బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ
నువ్వొచ్చి పోవమ్మ చందమామ
కట్లాయి పూవుల్ల చందమామ
బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ
నువ్వొచ్చి పోవమ్మ చందమామ
రుద్రాక్ష పూవుల్ల చందమామ
బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ
నువ్వొచ్చి పోవమ్మ చందమామ
గుమ్మడి పూవుల్ల చందమామ
బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
యాడాదికోసారి చందమామ
నువ్వొచ్చి పోవమ్మ చందమామ
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?