నటీనటులు: ధనుష్, శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుళ్‌మోహన్, నాజర్, మార్క్ బెన్నింగ్‌టన్, డానియల్ బాలాజీ తదితరులు
దర్శకుడు: అరుణ్ మాథేశ్వరన్
సంగీతం: జి.వి. ప్రకాష్
సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ క్రిష్ణ, సిద్దార్థ నుని
నిర్మాతలు: అర్జున్ త్యాగరాజన్, సెంథిల్ త్యాగరాజన్
విడుదల తేదీ: 26-1-2024
ధనుష్ (Dhanush) హీరోగా దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). శివ రాజ్‌కుమార్, ప్రియాంక అరుణ్ మోహన్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళంలో ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు వెర్షన్‌లో జనవరి 26న రాబోతుంది. అయితే ఒక రోజు ముందే ఈ సినిమా పెయిడ్ షోలను ప్రదర్శించారు. మరి తెలుగులోనూ ఈ సినిమా విజయాన్ని అందుకుందా? ధనుష్ నటన మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధనుష్) నిమ్న కులానికి చెందిన యువకుడు. ఊరిలోని కుల వివక్షను భరించలేక గౌరవ మర్యాదల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్లర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే?
కెప్టెన్ మిల్లర్‌గా ధనుష్ (Captain Miller Review) వన్‌మెన్ షోతో అదరగొట్టాడు. కులవివక్ష ఎదుర్కొనే యువకుడిగా, పోరాటయోధుడిగా భిన్న కోణాల్లో సాగే పాత్రలో జీవించాడు. శివరాజ్‌కుమార్, సందీప్‌కిషన్ గెస్ట్ పాత్రల్లో మెప్పించారు. క్లైమాక్స్‌లో ధనుష్, శివరాజ్‌కుమార్, సందీప్‌కిషన్ ముగ్గురు ఒకే సారి కనిపించే సీన్ బాగా వర్కవుట్ అయ్యింది. ప్రియాంక అరుణ్ మోహన్, మాళవికా సతీషన్ డీగ్లామర్ పాత్రల్లో చేసినప్పటికీ నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
సోషల్ మెసేజ్‌ను కమర్షియల్ కోణంలో చెప్పడంలో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ (Captain Miller Review) సక్సెస్ అయ్యాడు. ఓ అంటరాని యువకుడైన హీరో జర్నీని ఐదు చాఫ్టర్స్‌గా విడగొట్టి చెప్పడం ఆకట్టుకుంటుంది. బ్రిటీష్ వారి నుంచి గుడికి సంబంధించిన పెట్టెను ధనుష్ కొట్టేసే యాక్షన్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్‌లోని ఎలివేషన్స్ అభిమానులను మెప్పిస్తాయి. నిమ్నవర్గాల వివక్షపై ప్రీ క్లైమాక్స్‌లో ధనుష్ చెప్పే డైలాగ్ ఆలోచనను రేకెత్తిస్తుంది. అయితే కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా ఉంటాయి. 1930 నాటి కథలో హీరో స్టైలిష్ బైక్స్, గాగూల్స్, ప్రజెంట్ గన్స్ వాడటం లాజిక్‌గా అనిపించదు. ధనుష్, ప్రియాంక అరుళ్ మోహన్ మధ్య సాగే లవ్ ట్రాక్ పెద్దగా వర్కవుట్ కాలేదు. తమిళ నేటివిటిగా సినిమా బాగా దగ్గరగా ఉండటం తెలుగు వారిని ఇబ్బంది పెట్టవచ్చు.
సాంకేతికంగా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. జి.వి ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకు (Captain Miller Review) బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. శ్రేయాస్ క్రిష్ణ, సిద్దార్థ నుని కెమెరా పనితనం మెప్పిస్తుంది. 1930నాటి పరిస్థితులను విజువల్ రూపంలో వారు చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- ధనుష్ నటన
- యాక్షన్ సన్నివేశాలు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- లాజిక్స్‌కు అందని సీన్లు
- హీరో లవ్‌ట్రాక్
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!