• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Chandramukhi 2 Review: చంద్రముఖిగా కంగనా భయపెట్టిందా?

    నటీనటులు : రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, రాధికా శరత్ కుమార్, మహిమా   నంబియార్, లక్ష్మి మీనన్ తదితరులు

    సినిమాటోగ్రఫీ: ఆర్డీ రాజశేఖర్

    సంగీతం : ఎం.ఎం.కీరవాణి

    నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్

    నిర్మాత : సుబాస్కరన్

    రచయిత, దర్శకుడు : పి.వాసు

    విడుదల తేదీ: సెప్టెంబర్ 28, 2023

    రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా పి.వాసు (P.Vasu) దర్శకత్వంలో తెరకెక్కిన హార్రర్ కామెడీ చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). 2004లో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ చంద్రముఖి (Chandramukhi) సినిమాకు సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. మెుదటి పార్ట్‌లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించగా సీక్వెల్‌లో రాఘవ లారెన్స్‌ నటించడం గమనార్హం. బాలీవుడ్‌ నటి  కంగనా రనౌత్ (Kangana Ranaut) చంద్రముఖి 2లో టైటిల్ రోల్ పోషించింది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌, ట్రైలర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ క్రమంలో ఇవాళ (సెప్టెంబర్‌ 28) ‘చంద్రముఖి 2’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్‌ను భయపెట్టిందా? తొలి పార్ట్‌కు దీనికి మధ్య తేడా ఏంటి? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

    కథ 

    రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబం చాలా పెద్దది. ఆ ఫ్యామిలీని అనుకోని సమస్యలు వరుసగా చుట్టుముడతాయి. కుల దైవం గుడిలో పూజ చేస్తే కష్టాలు తీరిపోతాయని స్వామీజీ (రావు రమేష్) చెప్తారు. దీంతో లేచిపోయిన కూతురి పిల్లలను కూడా తీసుకురావాల్సి వస్తుంది. వారితో పాటు మదన్ (రాఘవ లారెన్స్) కూడా వస్తాడు. వారి కులదైవం గుడికి దగ్గరలోనే చంద్రముఖి ప్యాలెస్ (2005లో మొదటి చంద్రముఖి సినిమా కథ జరిగిన ఇల్లు) ఉంటుంది. కైలాష్ (మొదటి చంద్రముఖిలో ప్రభు) కుటుంబం అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఇంటి మొత్తానికి ఓనర్‌గా బసవయ్య (వడివేలు) ఉంటాడు. పూజలో భాగంగా ఆ ఇంట్లోకి రంగనాయకి కుటుంబం దిగుతుంది. అయితే ఇంట్లో దక్షిణం వైపు వెళ్లవద్దని బసవయ్య వారిస్తాడు. కానీ కొందరు వినకుండా వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కథలో కంగనా రనౌత్‌, వేటయ్య రాజు/సెంగోటయ్య (ఇంకో రాఘవ లారెన్స్) పాత్ర ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

    ఎలా ఉందంటే?

    ప్రథమార్థంలో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. వడివేలు కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇంటర్వెల్ వైపు సాగే కొద్దీ కథనంలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా వర్కవుట్ అయింది. అక్కడ వచ్చే ట్విస్ట్‌ని ముందే గెస్ చేయగలిగినా ఆ పాత్రలోని నటి తన పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుంది. సెకండాఫ్ ప్రారంభంలో మళ్లీ గ్రాఫ్ కిందకి వచ్చేస్తుంది. రాఘవ లారెన్స్, మహిమా నంబియార్‌ల లవ్ ట్రాక్, పాటలు విసిగిస్తాయి. మొదటి భాగంలో రజనీకాంత్, నయనతారల ట్రాక్ తరహాలో నడిపిద్దాం అనుకున్నా అది వర్కవుట్ అవ్వలేదు. ఎప్పుడైతే వేటయ్య రాజు ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుందో అక్కడ నుంచి కథ మళ్లీ వేగం పుంజుకుంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో పెద్దగా పస లేకపోయినా రాఘవ లారెన్స్, కంగనా రనౌత్‌ల పెర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. ఇక క్లైమ్యాక్స్‌ను మళ్లీ మొదటి భాగం తరహాలోనే ముగించారు.

    ఎవరేలా చేశారంటే:

    హారర్‌ సినిమాల్లో నటించడం రాఘవ లారెన్స్‌కు కొత్తేమీ కాదు. 2007లో వచ్చిన ‘ముని’ దగ్గర నుంచి లారెన్స్ ఇలాంటి పాత్రలు చేస్తూనే ఉన్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. కానీ పీరియాడిక్ పోర్షన్‌లో వచ్చిన వేటయ్య రాజు/సెంగోటయ్య పాత్ర తనకు పూర్తిగా కొత్త. అయినప్పటికీ లారెన్స్‌ తన అద్భుత నటనతో మెప్పించాడు. పాత్రలో లీనమై నటించాడు. ఇక కంగనా రనౌత్ విషయానికి వస్తే సినిమాలో ఆమె నటనే హైలెట్‌. చంద్రముఖి పాత్రలో అలరించింది. చంద్రముఖి ఆత్మ పట్టిన పాత్రలో  ఆమె మెప్పించింది. అయితే మెుదటి పార్ట్‌లోని జ్యోతికతో పోలిస్తే మాత్రం ఆమె నటన అంతగా ఎఫెక్టివ్‌గా అనిపించదు. ఇక రావురమేష్‌, శరత్‌కుమార్‌, వడివేలు మిగతా పాత్రదారులందరూ తమ పరిధి మేరకు న్యాయం చేశారు.

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    స్క్రీన్‌ప్లే, పాత్రలు సహా చాలా అంశాల్లో ‘చంద్రముఖి’ని యాజిటీజ్‌గా డైరెక్టర్‌ వాసు ఫాలో అయినట్లు అనిపిస్తుంది. సీక్వెల్ అంటే మొదటి భాగాన్ని కొనసాగించాలి కానీ దాన్నే వేరే నటులతో తీయడం కాదు కదా అనే ఆలోచన కూడా వస్తుంది. హీరో ఇంట్రడక్షన్‌ ఫైట్‌, వెంటనే మహల్‌కు రావడం, కుటుంబం దగ్గర అవమానాలు ఎదుర్కోవడం, ప్యాలెస్‌ పక్కన ఉండే పేదింట్లో అమ్మాయిని ప్రేమించడం మెుత్తం మెుదటి పార్ట్‌ను గుర్తు చేస్తాయి. చాలా రోటిన్‌గా, బోరింగ్‌ అనిపిస్తాయి. మెుదటి పార్ట్‌ స్క్రిప్ట్‌ను పక్కన పెట్టుకొని డైరెక్టర్‌ పాత్రలను రీప్లేస్‌ చేశారేమో అన్న భావన కలుగుతుంది. పి. వాసు డైరెక్షన్‌ స్కిల్స్‌ను బట్టి మెుదటి పార్ట్‌తో పోలిస్తే సెకండ్‌ పార్ట్‌ తేలిపోయిందని చెప్పవచ్చు. అయితే కొన్ని సీన్లలో మాత్రం ఆయన తన మార్క్‌ను చూపించడం గమనార్హం.

    టెక్నికల్‌గా

    ఆస్కార్ అవార్డు విన్నర్ ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలోని పాటలు, నేపథ్య సంగీతం ఆయన స్థాయికి తగ్గట్లు లేవని చెప్పవచ్చు. అయితే  సెకండాఫ్‌లో వచ్చే కంగనా రనౌత్ ఇంట్రడక్షన్ సాంగ్ మెప్పిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వార్ సీన్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాహుబలిని గుర్తు చేస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది.

    ప్లస్‌ పాయింట్స్‌
    • లారెన్స్‌, కంగనా నటన
    • హారర్‌ సన్నివేశాలు
    • సినిమాటోగ్రఫీ
    మైనస్‌ పాయింట్స్‌
    • కొత్తదనం లేకపోవడం
    • రోటీన్‌ సీన్స్‌
    • పాటలు
    రేటింగ్‌ : 2.5/5
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv