తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ కథాంశంతో వరుసగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇటీవలే ఆర్య హీరోగా నటించిన సార్పట్ట మూవీ ప్రేక్షకులను అలరించగా త్వరలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని, విజయ్ దేవరకొండ లైగర్ మూవీ రిలీజ్‌కానున్నాయి.
గని మూవీ కోసం ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌లా అభిమానులను అలరించడానికి వరుణ్ తేజ్ ఇంగ్లాడ్ మాజీ బాక్సర్ దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడట. ఆకట్టుకునే లుక్ కోసం జిమ్‌లో తెగ కష్టపడిన వీడియోలు కూడ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు బాక్సింగ్ కథాంశంపై ఇంతగా డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపడానికి కారణమేంటో తెలుసా..?
క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలను అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తుండటం, బాక్సింగ్ అయితే హీరోలను కూడ బాగా ఎలివేట్ చేయోచ్చనే ఉద్దేశంతో డైరెక్టర్లు ఈ క్రీడపై సినిమాలు తీస్తున్నట్లు సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీలో బాక్సింగ్ ట్రెండ్ కొనసాగుతుండటంతో ఇప్పటి వరకు తెలుగులో బాక్సింగ్ కథాంశంగా ఎన్ని సినిమాలు వచ్చాయి..? అవి హిట్టా, ఫట్టా అనే అంశంపై చిన్న కథనం మీకోసం..
అసలు కథలు ఇవి
తమ్ముడు
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాక్సింగ్ కథాంశంతో తెరకెక్కిన తొలి చిత్రంగా దీనిని భావిస్తారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, ప్రీతి జింగానియా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ 1999లో రిలీజ్ అయ్యి బాక్సాపీస్ బద్ధలు కొట్టింది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాంగ్స్ కూడ మంచి హిట్ కొట్టాయి. పవన్ కల్యాణ్‌లోని మార్షల్ ఆర్ట్స్ ప్రతిభకు తార్కాణంగా ఈ మూవీని తెరకెక్కించారు. చాలా సన్నివేశాలు రియలిస్టిక్‌గా చిత్రీకరించారు. ఈ సినిమా అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా 9.46 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.
భద్రాచలం
రియల్ స్టార్ శ్రీహరి స్టంట్‌లకు నిదర్శనంగా ఈ సినిమా 2001లో రిలీజ్ అయ్యింది. ఒక పల్లెటూరి వ్యక్తి బాక్సింగ్ ఛాంపియన్‌గా అవతరించిన తీరు ఎలా ఉంటుందో డైరెక్టర్ శంకర్ చక్కగా వివరించారు. సింధు మీనన్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలోని కొన్ని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడ చాలా భావోద్వేగపూరితంగా సాగాయి. ఈ సినిమా నంది అవార్డును కూడ అందుకుంది. ఈ మూవీతో శ్రీహరి కెరీర్ జోరందుకుందనే చెప్పొచ్చు.
గురు
సుధ కొంగర దర్శకత్వంలో 2017లో ఈ మూవీ ప్రేక్షకులముందుకొచ్చింది. విక్టరీ వెంకటేశ్ బాక్సింగ్ కోచ్‌గా అవతారమెత్తి రూపుదిద్దుకున్న ఈ మూవీ అభిమానుల మనసులు దోచుకుంది. స్ఫూర్తివంతమైన కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కించారు. ఓ కూరగాయలు అమ్మే అమ్మాయిని అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌గా కోచ్ ఆదిత్య(వెంకటేశ్) ఎలా మలుస్తాడనేదే కథాంశం. ఈ సినిమాలో ఓ సక్కనోడ, జింగిడి..జింగిడి లాంటి పాటలు పర్వాలేదనిపించాయి. రూ.22 కోట్లతో సినిమా నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా రూ.82.40 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
ఇతర సినిమాలు
నవదీప్ హీరోగా నటించిన జై, రవితేజ- పూరీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలను కూడ ప్రేక్షకులు ఆదరించారు. అలాగే 2021లో రిలీజ్ అయిన సార్పట్ట మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహించారు.
రానున్న సినిమాలు
గని
వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంతో వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ పేర్కొంది. గని మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే మూవీపై ఆసక్తిని మరింత పెంచింది.
లైగర్
ఆకట్టుకునే లుక్‌తో విజయ్ దేవరకొండ- పూరీ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడ ఫస్ట్ టైం వెండితెరపై కనిపిస్తుండటం గమనార్హం. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషాల్లో ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం