• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పైలట్ కావాలంటే ఏం చేయాలి..?

    లైఫ్‌లో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలని చాలామంది అనుకుంటారు. కాని కొందరు మాత్రం ఆ ఫ్లైట్‌నే నడిపే పైలట్ కావాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. విపరీతమైన అవకాశాలు ఉన్న భారత పౌర విమానయాన రంగంలో అసలు పైలట్ కావాలంటే అర్హతలు ఏంటి..? ఏ కోర్సులు చదవాలి..? ఎక్కడ చదవాలి..? ఫీజు ఎంత..? ఉద్యోగం వచ్చిన తర్వాత జీతభత్యాలు ఎంత..? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ ఆర్టికల్. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి మరి.

    రెండు మార్గాల్లో పైలట్ అవ్వొచ్చు

    పైలట్ అవ్వాలనుకుంటే ప్రధానంగా రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి సివిల్ ఏవియేషన్ పైలట్, రెండు ఎయిర్ ఫోర్స్ లేదా ఫైటర్ పైలట్. 

    1.సివిల్ ఏవియేషన్ పైలట్

    ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేరవేసే పౌర విమానాలను నడిపేవారిని సివిల్ ఏవియేషన్ పైలట్ అంటాం. ఉదాహరణకు:ఇండిగో, ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్‌లాంటి సంస్థలు ఈ పైలట్‌లను నియమించుకొని జీతభత్యాలు ఇస్తుంటాయి. ఈ రంగంలో పైలట్‌గా రాణించాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ సబ్జెక్ట్ పాస్ అయ్యి ఉండాలి. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇందిరాగాంధీ ఉడాన్ అకాడమీలో చేరాలంటే ప్రవేశ పరీక్ష రాసి అర్హత పొందాల్సి ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులు 18 నెలలు లేదా రెండు సంవత్సరాలలో సంబంధిత కోర్సును పూర్తి చేయోచ్చు. ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కాలర్‌షిప్ అందదు. రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు కోర్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డీజీసీఏ ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల్లో కూడా పైలట్ శిక్షణ కోర్సు పూర్తి చేయవచ్చు.

    2. ఎయిర్ ఫోర్స్ లేదా  ఫైటర్ పైలట్

    దేశానికి సేవ చేయడంతో పాటు గౌరవప్రదమైన జీతభత్యాలు పొందాలనుకునే వారికి ఎయిర్ ఫోర్స్ చక్కని అవకాశం కల్పిస్తుంది. ఎయిర్ ఫోర్స్‌లో పైలట్‌గా చేరాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ సబ్జెక్ట్ పాస్ అయి ఉండాలి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA), కంబైండ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్(CDSE), ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(AFCAT) లేదా ఎన్‌సీసీ(NCC) స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నిర్వహించే పరీక్షలు రాసి జాయిన్ అవ్వొచ్చు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు యుద్ధ విమానాలు నడిపే అవకాశం దక్కించుకోవచ్చు.

    లైసెన్స్ పొందడం ఎలా ?

    సివిల్ ఏవియేషన్ పైలట్ లేదా ఫైటర్ పైలట్‌గా రాణించాలంటే కచ్చితంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ పొందినప్పటికీ అందరూ డీజీసీఏ పరీక్షల్లో నెగ్గితేనే విమానం నడిపేందుకు లైసెన్స్ పొందుతారు.

    లైసెన్స్ రకాలు: 

    స్టూడెంట్ పైలట్ లైసెన్స్(SPL): ఇంటర్‌లో మ్యాథ్స్ పూర్తి చేసి 16 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. DGCA గుర్తింపు పొందిన ఏదైనా పైలట్ శిక్షణ సంస్థ నుంచి సర్టిఫికెట్ సాధించిన వారికి ఈ లైసెన్స్ అందిస్తారు. ఫ్లైట్ నడిపిన అనుభవం అవసరం లేనప్పటికీ మెడికల్ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది. 

    ప్రైవేట్ పైలట్ లైసెన్స్(PPL): పౌర విమానాలను లేదా కార్గో విమానాలను నడపాలనుకునే వారు ఈ లైసెన్స్ కలిగి ఉండాలి. 17 సంవత్సరాల వయస్సు కలిగి డీజీసీఏ నిర్వహించే రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఎయిర్ రెగ్యూలేషన్, ఎయిర్ నావిగేషన్, ఏవియేషన్ మెటియోరాలజీ, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఇంజిన్ లాంటి సబ్జెక్ట్‌లపై పట్టు సాధించాలి. అలాగే ఫ్లైయింగ్ టెస్టులో పాస్ కావాల్సి ఉంటుంది.

    కమర్షియల్ పైలట్ లైసెన్స్(CPL): ప్రొపెషనల్ పైలట్‌గా గుర్తింపు పొందాలంటే కచ్చితంగా ఈ లైసెన్స్ అవసరం. 18 సంవత్సరాల వయస్సుతో పాటు మెడికల్ టెస్టు పాస్ అవ్వాలి. అలాగే కొన్ని గంటల పాటు నిర్వహించే ఫ్లయింగ్ టెస్ట్, రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ లైసెన్స్ ఉంటే స్వతహాగా ప్లైట్ నడిపేయోచ్చు.

    ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్(ATPL): పైలట్‌గా రాణించాలంటే ఈ లైసెన్స్ అత్యున్నతమైనదిగా భావించొచ్చు. 21 సంవత్సరాలు నిండి, DGCA నిర్వహించే అర్హత పరీక్షను క్లియర్ చేసిన వారికి ఈ లైసెన్స్ దక్కుతుంది. సీనియర్ CPL లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఈ ATPL లైసెన్స్ పొందడానికి అర్హులు. 

     జీతభత్యాలు

    అనుభవం, అర్హతను బట్టి ఆయా సంస్థలు సాధారణంగా భారత్‌లో సగటున ఒక ఫైలట్‌కి నెలకు రూ.1,50,000 నుంచి రూ.3,00,000 వరకు చెల్లిస్తున్నాయి. అలాగే ఎక్స్ ట్రా బోనస్‌లు, అలవెన్స్ అందిస్తుంటాయి. కోర్సు నేర్చుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో అందుకు తగినట్టుగానే జీతభత్యాలు కూడ ఉంటాయి. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైలట్‌లో జీతాలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటాయి.

    నేర్చుకోవాల్సిన అంశాలు

    పైలట్ అవ్వాలనుకునే ప్రతిఒక్కరు కచ్చితంగా కొన్ని అంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఎలాంటి సంస్థలో శిక్షణ పొందాలో తెలుసుకోవాలి. అలాగే గ్లోబల్ లాంగ్వేజీ అయిన ఇంగ్లీష్‌పై పట్టు సాధించాలి. ఎంత ఒత్తిడిని అయినా జయించేతత్వాన్ని అలవాటు చేసుకోవాలి. మ్యాథ్స్‌పై మంచి గ్రిప్ పెంచుకోవాలి.

    పైలట్ శిక్షణ అందించే ప్రధాన సంస్థలు

    • ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ(ఉత్తరప్రదేశ్)
    • మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్(మధ్యప్రదేశ్)
    • కార్వర్ ఏవియేషన్ అకాడమీ(మహారాష్ట్ర)
    • గవర్నమెంట్ ట్రైనింగ్ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్(ఒడిశా)
    • ఓరియంట్ ఫ్లైట్ స్కూల్(పుదుచ్చేరి)
    • అహ్మదాబాద్ ఏవియేషన్ అండ్ ఏరోనాటిక్స్(గుజరాత్)
    • రాజీవ్‌గాంధీ ఏవియేషన్ (తెలంగాణ)
    • ఏపీ ఏవియేషన్ అకాడమీ(హైదరాబాద్)
    • ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ(హైదరాబాద్)
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv