క్రికెట్ ప్రపంచానికి పెళ్లి భోజనం లాంటి అద్భుతమైన విందును అందించేందుకు దాయాదుల సమరానికి సర్వం సిద్ధమైంది. ఆఫీసులకు సెలవు పెట్టీ మరీ చూసే ఈ మ్యాచ్‌కు ఆ అవసరం లేకుండా ఆదివారం కూడా కలిసొచ్చింది. ఈ రెండు దేశాల మధ్య పోరు ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన జట్టుపై ప్రతికారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. కానీ ఈ సారి ఈ ప్రత్యేక వ్యక్తిగత పోటీలు ఉన్నాయి. అందరూ వారి ఆటను చూసేందుకు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. వారే విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ పరుగుల రారాజు, ఫామ్‌తో సంబంధం లేని క్లాస్ ప్లేయర్. ఆటలో దూకుడు, క్రీడాస్ఫూర్తి, మైదానం ఆవల ఓ మంచి మనిషి. ఎన్నో రికార్డులు, మరెన్నో ఘనతలు. ఇప్పటికే వన్డే ,టెస్టుల్లో 100 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఆదివారం టీ20ల్లోనూ 100వ మ్యాచ్ ఆడి, మూడు ఫార్మాట్లలోనూ వంద మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా నిలవబోతున్నాడు. కానీ కొంతకాలంగా తన స్థాయికి తగ్గ ఆటతీరు కనిపించడం లేదు. నిజానికి పరుగుల పరంగా విరాట్ మరీ అంత వెనకబడిపోలేదు. అతడు చివరి సెంచరీ చేసి 1000 రోజులు గడిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా భారత్‌కు అత్యధిక పరుగులు సాధించిన వారిలో విరాట్ 2554 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే స్థానంలో వేరే ఏ ఆటగాడు ఉన్నా అతడిని మంచి ఫాంలో ఉన్న ప్లేయర్‌గా చూసేవారు. కానీ విరాట్ అందుకు అతీతం. అలవోకగా, నీళ్లు తాగినంత సులభంగా సెంచరీలు బాదే కోహ్లీ అభిమానులకు మజాను పంచే ఇన్నింగ్స్ ఆడటం లేదు. సెంచరీలు చేయడం లేదు అదే వారిని కలవరపెడుతోంది. ఆదివారం పాక్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ తన సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ప్లేయర్లో డానిష్ కనేరియా లాంటి కొందరు విరాట్‌ను జట్టుకు భారమంటూ విమర్శించారు. అలాంటి వారి నోర్లు మూయించాలని కోరుకుంటున్నారు. కెరీర్ పరంగానూ విరాట్‌కు ఈ మ్యాచ్ పెద్ద సవాల్ కానుంది. ఈ మ్యాచ్‌లో గనక విరాట్ తన పూర్వ వైభవాన్ని తీసుకురాగలిగితే ఇక అతడికి తిరుగుండదు.
బాబర్ అజామ్
ప్రపంచ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీ రికార్డులతో పోటీ పడుతున్న పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్. ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌తో చితక్కొడుతున్నాడు. టీ20ల్లో విరాట్ బాబర్ కన్నా మెరుగ్గానే ఉన్నాడు. కానీ టీ20 వరల్డ్‌కప్‌లో బాబర్ అజాం ఇన్నింగ్స్ ఎవరూ మర్చిపోలేరు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. వీరిద్దరి పోరులో రేపు విరాట్ పైచేయి సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
టీ20ల్లో విరాట్ vs బాబర్
ఎలా చూసుకున్నా విరాట్ ఆధిపత్యమే కనిపిస్తున్నా సెంచరీల విషయంలో మాత్రం బాబర్ కాస్త ముందున్నాడు.
ప్లేయర్ | మ్యాచ్‌లు | పరుగులు | సగటు | స్ట్రయిక్ రేట్ | 100లు | 50లు |
విరాట్ కోహ్లీ | 99 | 3308 | 50.12 | 137.66 | 0 | 30 |
బాబర్ అజామ్ | 74 | 2686 | 45.52 | 129.44 | 1 | 26 |
ఇండియా వర్సెస్ పాక్ మ్యాచుల్లోనూ కోహ్లీ రికార్డు అద్భుతం
ఆటగాడు | మ్యాచ్‌లు | ఇన్నింగ్స్ | పరుగులు | అత్యధిక స్కోర్ | యావరేజ్ | స్ట్రైక్ రేట్ | 100లు | 50లు |
విరాట్ కోహ్లీ | 7 | 7 | 311 | 78* | 77.75 | 118.25 | 0 | 3 |
షోయల్ మాలిక్ | 9 | 8 | 164 | 57* | 27.33 | 103.79 | 0 | 1 |
మహ్మద్ హఫీజ్ | 8 | 7 | 156 | 61 | 26.00 | 118.18 | 0 | 2 |
యువరాజ్ సింగ్ | 8 | 8 | 155 | 72 | 25.83 | 109.22 | 0 | 1 |
ఆదివారం మ్యాచ్‌లో మరోసారి విరాట్ తన సత్తా చాటుతాడని రవిశాస్త్రి లాంటి దిగ్గజాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ విరాట్‌ను పూర్తిగా నమ్ముతున్నాడు, పూర్తి మద్దతునిస్తున్నాడు. విరాట్ ఆటపై ఎవరికీ అనుమానాలు లేవు. పాకిస్తాన్ ఆటగాళ్లు సైతం అతడిని మేం తేలిగ్గా తీసుకోబోమని విరాట్ క్రీజులో ఉంటే ఎలాంటి జట్టుకైనా ప్రమాదమేనని అంటున్నారు. కానీ అందరూ తనను నమ్ముతున్నంతగా విరాట్ తనను తాను నమ్మాలి. తన ఆటను ఆస్వాదించాలి. అభిమానులకు ఆట మజాను పంచాలి.
ఇండియా vs పాకిస్తాన్
ఆదివారం జరిగే మ్యాచ్‌లో రెండూ బలమైన జట్లే. టీమిండియా బలం టాప్ ఆర్డర్‌లోనే ఉందు. రోహిత్, రాహుల్, కోహ్లీ తమ స్థాయికి తగ్గట్టు ఆడి, స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లు మెరుపులు మెరిపిస్తే తిరుగుండదు. బుమ్రా లేకపోవడం లోటు.
ఇండియా జట్టు
రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కే.ఎల్. రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దీపక్ హూడా, రవిచంద్రన్ అశ్విన్,రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, భునేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయి.
పాకిస్తాన్ టాప్ ఆర్డర్ కూడా చాలా బలంగా ఉంది. అలాగే వారి స్టార్ బౌలర్, వరల్డ్ కప్‌లో భారత్ టాప్ ఆర్డర్‌ను కూల్చిన షాహీన్ అఫ్రీది లేకపోవడం వారికి కూడా పెద్ద లోటే
పాకిస్తాన్ జట్టు
బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్, హైదర్ అలీ, ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, నజీమ్ షా, షాన్వాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్, మహమ్మద్ హస్నైన్
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది