నేడు(జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా శరీరాన్ని, మనస్సును సమతాస్థితిలో ఉంచుతుంది. యోగా సాధన ఆయుర్దాయాన్ని మెరుగు పరుస్తుంది. ప్రతి నిత్యం యోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. చాలా మంది యోగా చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. కానీ, ఎలా? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే విషయంపై సరైన అవగాహన ఉండదు. దీంతో చిక్కులు కొని తెచ్చుకుంటారు. యోగా చేయడానికి కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక, కొత్తగా యోగా నేర్చుకోవాలని భావించే వారు పలు సూచనలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూద్దాం.
లక్ష్యం తప్పనిసరి..
యోగాతో ఎన్నో లాభాలుంటాయి. అయితే, కొత్తగా యోగా నేర్చుకోవాలని అనుకునే వారు ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. ఏ మేరకు ప్రయోజనం పొందాలని భావిస్తున్నారో ముందుగా నిర్దేశించుకోవాలి. క్రీడాకారులు కావాలనుకునే వారికి ఒక విధంగా, సాధారణ జీవితం గడిపే వారికి మరొక రకమైన యోగా సాధన ఉంటుంది. అందుకే ఏ ఉద్దేశంతో యోగా సాధన ప్రారంభించాలని భావిస్తున్నారో ముందుగానే డిసైడ్ అవ్వండి. ఆ తర్వాతే ప్రారంభించండి.
శరీరాన్ని బట్టి యోగా..
యోగా ప్రారంభానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీ శరీర ధారుడ్యాన్ని వారు అంచనా వేసి ఏ రకమైన ఆసనాలు సరితూగుతాయో సలహా ఇస్తారు. కొందరి శరీరం కఠినమైన యోగాసనాలను తట్టుకుంటుంది. మరికొందరికి కాస్త సున్నితంగా ఉంటుంది. ఉదాహరణకు గర్భిణులు చేయాల్సిన ఆసనాలు ప్రత్యేకంగా ఉంటాయి. కొన్నింటిని మాత్రమే సాధన చేసేందుకు వీలుంటుంది. అలా మీ బాడీని బట్టి యోగా సాధన ఆధారపడి ఉంటుంది. శరీరంపై ఏమైనా గాయాలు ఉన్నా, ఇదివరకు సర్జరీలు జరిగినా.. వాటిని వైద్యుడికి తెలియజేయడం మంచిది. యోగా టీచర్లకు కూడా వీటి గురించి చెప్పి ఉంచాలి. ఏదైనా సమస్య ఉంటే, కఠినమైన యోగాసనాలకు కాస్త దూరంగా ఉండాలి.
బలవంత పెట్టొద్దు..
యోగా చేస్తున్నప్పుడు అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే మానేయండి. బలవంతంగా యోగా చేయడమూ మంచిది కాదట. శరీరం వద్దని చెబితే యోగాను ఆపేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, ఔషధాలు వేసుకున్న సమయంలో యోగా చేయకూడదు. యోగా సాధనలో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాన్నైనా తీసుకోవచ్చు. ప్రత్యేకించి ఆహార నియమాలు పాటించనక్కర్లేదు. వండిన ఆహారంతో పోలిస్తే ఉడకబెట్టిన ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.
ఇవి పాటించాలి..
యోగా చేయడానికి అనువైన సమయం చూసుకోవాలి. సూర్యోదయం, సూర్యస్తమయంలో ఎక్కువగా యోగా చేసేందుకు అనువుగా ఉంటుంది. అలాగే, యోగా చేయడానికి ముందు కనీసం ఒక గంట ముందు వరకు ఆహార పదార్థాలు అతిగా తీసుకోకూడదు. అవసరమైతే కాస్త నీటిని మాత్రమే తాగాలి. యోగా సాధన చేసే ప్రదేశం కూడా ముఖ్యమే. బాగా గాలి వీచే ప్రాంతంలో యోగా చేయాలి. బాగా చల్లని, వేడిమి ప్రాంతాల్లో యోగా చేయకపోవడం మంచిది. యోగా సమయంలో ఒత్తిడిని కలిగించే బిగుతైన దుస్తులు వేసుకోవద్దు. శరీరానికి అనుగుణమైన వాటిని ఎంచుకోవాలి.
వెంటనే స్టార్ట్ చేయొద్దు..
యోగాను మొదలు పెట్టడానికి ఓ పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. ఆసనాలు వేసే ముందు శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. ప్రాణాయామం వంటివి చేయాలి. లేదంటే శరీరంలో గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. యోగా టీచర్ సూచనల మేరకు ప్రాక్టీస్ చేస్తుండాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని యోగాను ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్