మెుబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series) మోడళ్లు లాంచ్ అయ్యాయి. మంగళవారం (సెప్టెంబర్ 12) రాత్రి జరిగిన లాంచ్ ఈవెంట్‌లో లేటెస్ట్ ఐఫోన్లతో పాటు ఇతర ప్రొడక్ట్స్‌ను యాపిల్ రిలీజ్ చేసింది. అయితే ముందు నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, కొత్త ఐఫోన్లను యాపిల్ సరికొత్త స్పెసిఫికేషన్లతో రూపొందించింది. iPhone 15 Proలో కొత్త ‘యాక్షన్ బటన్’, అడ్వాన్స్‌డ్ కెమెరా స్పెసిఫికేషన్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14తో పోలిస్తే 15 సిరీస్‌లో కొత్తగా చేసిన మార్పులు, ప్రత్యేకతల గురించి ఈ కథనంలో చూద్దాం.
యూఎస్‌బీ టైప్-సి (USB- C)
2012 నుంచి యాపిల్ తమ ఉత్పత్తులకు లైటెనింగ్ పోర్ట్‌తో ప్రత్యేక ఛార్జింగ్ బ్రిక్, కేబుల్‌ను ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆ సంప్రదాయానికి యాపిల్ స్వస్థి పలికింది. ఐరోపా సమాఖ్య నిబంధనల ప్రకారం యూఎస్‌బీ- సి పోర్ట్‌ను ఇచ్చింది. దీంతో ఇకపై ఐఫోన్‌లో చార్జింగ్ అయిపోతే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. పక్కవాళ్ల దగ్గరి నుంచి USB- C పోర్ట్ చార్జర్ తీసుకొని వాడుకోవచ్చు. ప్రస్తుతం వస్తోన్న అన్ని మెుబైల్స్ టైప్-సి పోర్టుతోనే రావడం గమనార్హం.
యాక్షన్ బటన్ (Action Button)
ఆపిల్ 15 సిరీస్‌లో తీసుకొచ్చిన మరో సరికొత్త ఫీచర్ యాక్షన్ బటన్ (Action Button). ఇప్పటివరకూ ఐఫోన్ పక్కభాగంలో వాల్యూమ్ రాకర్‌పైన మ్యూట్ లేదా వైబ్రేట్ బటన్‌ను ఇచ్చేవారు. ఐఫోన్ 15 ప్రో మోడల్స్ (iPhone 15 pro)లో దాన్ని యాక్షన్ బటన్‌తో రీప్లేస్ చేశారు. కెమెరాను యాక్టివేట్ చేయడం, ఫ్లాష్‌లైట్ ఆన్ చేయడం, ఫోకస్ మోడ్‌లను మార్చడం వంటి ఫంక్షన్లను ఈ బటన్ ద్వారా చేయవచ్చు. రింగ్, వైబ్రేట్ ఆప్షన్స్‌ను కూడా ఈ బటన్ సాయంతో మార్చుకోవచ్చు. ప్రత్యేకంగా కొన్ని ఫంక్షన్లను ఈ బటన్‌కు అసైన్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు.
కెమెరా అప్‌గ్రేడ్
ఆపిల్ 15 సిరీస్ గురించి చెప్పుకోవాల్సిన మరో కీలక అంశం కెమెరా. ఐఫోన్ 15 బేస్ మోడల్స్‌ను గత సిరీస్‌లతో పోలిస్తే కెమెరా విషయంలో ప్రత్యేకంగా నిలిపారు. ఇప్పటి వరకు బేసిక్ మోడల్స్‌కు 12MP మెయిన్ సెన్సర్ కెమెరాను ఇస్తూ వచ్చిన యాపిల్.. ఈసారి ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లో 48MP కెమెరాను ఇవ్వడం విశేషం.
పవర్‌ఫుల్ ప్రాసెసర్..
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‌లో ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇది కొత్తదేమీ కాకపోయినప్పటికీ.. గతంలో దీన్ని ప్రో మోడల్స్‌కు మాత్రమే పరిమితం చేశారు. ఈసారి 15 సిరీస్‌లోని ప్రో మోడల్స్‌కు ఏ17 ప్రాసెసర్‌ను రిజర్వ్ చేశారు. ఐఫోన్ 14 బేస్ మోడల్స్‌తో పోలిస్తే ఐఫోన్ 15 బేస్ మోడల్స్ 7 రెట్లు వేగంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్
గత ఐఫోన్ సిరీస్‌లను పరిశీలిస్తే ప్రో మోడల్స్‌కు మాత్రమే ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ పరిమితమైంది. కానీ, ఈసారి ఈ స్టైలిష్ ప్యానెల్‌ను బేసిక్ మోడల్స్ అయిన ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లోనూ తీసుకొచ్చారు. దీనివల్ల ఫింగర్‌ప్రింట్లు సహా ఇతరత్రా మరకల నుంచి కెమెరా లెన్సెస్‌కు రక్షణ లభిస్తుంది. అంతేగాక ఈ ప్యానెల్ ఫోన్‌కు చాలా ప్రీమియం లుక్‌ను తీసుకొస్తుంది.
డైనమిక్ ఐలాండ్..
గత ఏడాది రిలీజైన ఐఫోన్ 14 సిరీస్‌లోని ప్రో మోడల్స్‌లో ఈ డైనమిక్ ఐలాండ్ అనే ఫీచర్‌ను యాపిల్ తొలిసారి తీసుకొచ్చింది. ఇది చాలా మంది టెక్ ప్రియులను ఆకట్టుకుంది. దీంతో ఈసారి 15 సిరీస్ (iPhone 15 Series)లో బేస్ మోడల్స్ అయిన ఐఫోన్ 15 (iPhone 15), ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus)లో కూడా దీన్ని జత చేసింది. భవిష్యత్‌లో రాబోయే అన్ని ఐఫోన్లలో దీన్ని ప్రామాణికం చేయనున్నట్లు తెలుస్తోంది.
టైటానియం డిజైన్
ఐఫోన్ సిరీస్‌లో ఆకట్టుకుంటున్న మరో ఫీచర్ టైటానియం డిజైన్. ఈ సిరీస్‌లోని iPhone 15 pro మోడల్స్‌ను టైటానియం డిజైన్‌తో తీసుకొచ్చారు. దీనివల్ల ఫోన్ బరువు చాలా వరకు తగ్గడమే కాకుండా చాలా స్లిమ్‌గా స్టైలిష్‌గా ఫోన్ కనిపిస్తుంది.
ధరలు ఎంతంటే?
ఐఫోన్ 15 సిరీస్ ధరలను నిన్న జరిగిన లాంచింగ్ ఈవెంట్‌లోనే యాపిల్ సంస్థ ఖరారు చేసింది. ఐఫోన్ 15 (128 GB) రూ.79,900, ఐ ఫోన్ 15 (256 GB) రూ. 89,900, ఐ ఫోన్ 15 (512GB) ధర రూ. 1,09,900గా యాపిల్ నిర్ణయించింది. అలాగే ఐఫోన్ 15 ప్లస్ (128 GB) రూ.89,900, ఐ ఫోన్ 15 Plus (512 GB) 1,19,900గా ఉంది. ఐఫోన్ 15 ప్రో రూ.1,34,900, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ.1,59,900గా యాపిల్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 15 నుంచి ప్రీ బుకింగ్స్ మెుదలవుతాయి. సెప్టెంబర్ 22 నుంచి విక్రయం ప్రారంభమవుతుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!