• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2024: టాప్‌ 4లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. ఆ ఒక్కటి అదిగమిస్తే కప్‌ మనదే!

    ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌’ (Sunrisers Hyderabad) జట్టు అదరగొడుతోంది. గత కొన్ని సీజన్ల నుంచి పాయింట్ల పట్టికలో చివరి స్థానాలకే పరిమితమైన SRH.. కొత్త కెప్టెన్‌ ప్యాట్ కమ్మిన్స్‌ (Pat Cummins) రాకతో సత్తా చాటుతోంది. తన బలహీనతలను బలాలుగా మార్చుకొని ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌.. మూడు విజయలతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది. 2022 ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత SRH ఇలా టాప్‌-4లో నిలవడం ఇదే తొలిసారి. ఆ సీజన్‌లో వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచింది. ఇవాళ బెంగళూరు (RCB)తో జరిగే మ్యాచ్‌లో ఘన విజయం సాధిస్తే.. చెన్నై (CSK)ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది.

    కప్‌పై ఆశలు రేపుతున్న సన్‌రైజర్స్!

    గత సీజన్లతో పోలిస్తే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈసారి బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌ విభాగంలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. హైదరాబాద్‌ హీరోలు ట్రావిస్‌ హెడ్‌ (Travis Head), అభిషేక్‌ శర్మ (Abhishek Sharma), ఎయిడెన్‌ మర్‌క్రమ్‌ (Aiden Markram), హెన్రీచ్‌ క్లాసెన్‌ (Heinrich Klaasen) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బౌలర్లను ఉతికారేస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ఇటీవల ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 277 పరుగులు బాదిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. బెంగళూరు పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు(263-5)ను తుడిచిపెట్టేశారు. హైదరాబాద్‌ బ్యాటర్ల ఫామ్‌ ఇలాగే తర్వాతి మ్యాచుల్లోనూ కొనసాగితే.. ట్రోఫీని గెలుచుకోవడం పెద్ద కష్టమేమి కాదని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

    బౌలింగ్‌లో లోపాలు!

    ఒకప్పుడు సన్‌రైజర్స్‌ జట్టు అనగానే ముందుగా పటిష్టమైన బౌలింగ్‌ వ్యవస్థనే గుర్తుకు వచ్చేది. బ్యాటర్లు ఎంత తక్కువ స్కోరు చేసినా.. SRH బౌలర్లు ఆ పరుగులను కాపాడుకొని జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించేవారు. కానీ ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ చురుకైన కెప్టెన్సీతో అదరగొడుతున్నప్పటికీ వికెట్ల వేటలో మాత్రం కాస్త వెనకిపడి ఉన్నాడు. ఐదు మ్యాచుల్లో ఆరు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అటు సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కూడా దారళంగా పరుగులు ఇవ్వడం సన్‌రైజర్స్‌ను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 120 బంతులేసిన భువీ 9.55 ఎకానమీతో 191 పరుగులు ఇచ్చాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. మరో కీలక బౌలర్‌ టి. నటరాజన్‌ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ కీలక సమయాల్లో దారళంగా పరుగులు సమర్పిస్తున్నాడు. స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే గత సీజన్‌లో కనబరిచిన ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. ఓవరాల్‌గా రాబోయే మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ బౌలర్లు మునుపటి ఫామ్‌ను అందుకుంటే ఈ సీజన్‌లో ఆ జట్టుకు తిరుగుండదని చెప్పవచ్చు.

    నేడు ఆర్సీబీకి డూ ఆర్‌ డై!

    ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 15) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఆర్సీబీ తమ హోం గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొట్టబోతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. అయితే సన్‌రైజర్స్‌తో పోలిస్తే ఆర్సీబీ చాలా బలహీనంగా కనిపిస్తోంది. జట్టులో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) తప్ప ఎవరూ చెప్పుకోతగ్గ స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటివరకూ ఆరు మ్యాచులు ఆడిన ఆర్సీబీ ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోమ్‌ గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుండటం ఆర్సీబీకి అనుకూలించే అంశం. భీకర ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ను ఆర్సీబీ ఏమేరకు కట్టడి చేస్తుందో చూడాలి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv