నటీనటులు: రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్ తదితరులు..
దర్శకత్వం: విరించి వర్మ
సంగీతం: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: వి.ఎస్. జ్ఞాన శేఖర్
ఎడిటర్: రామకృష్ణ అర్రం
నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి
విడుదల తేదీ: నవంబర్ 7, 2024
రాకేశ్ వర్రే కథానాయకుడిగా చేసిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ చిత్రం ‘జితేందర్‌రెడ్డి’ (Jithender Reddy). ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ దర్శకుడు విరించి వర్మ ఈ సినిమాను రూపొందించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకుడిగా పనిచేసిన వ్యక్తుల జీవిత కథను బేస్ చేసుకొని రూపొందించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) ఫ్యామిలీ మెుదటి నుంచి RSS స్వయంసేవకులు. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన జితేందర్ రెడ్డి చిన్నపుడే RSS సిద్దాంతాలకు ఆకర్షితుడు అవుతాడు. దేశం, ధర్మం, ప్రజలు కోసం ఏదైనా చేయాలని తపన పడుతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు 18 ఏళ్లు కూడా నిండని ఓ కుర్రాడిని నక్సలైట్లు అన్యాయంగా చంపేస్తారు. ఈ ఘటనతో కాలేజ్ స్టూడెంట్ అయిన జితేందర్ రెడ్డి కామ్రేడ్స్‌పై రగిలిపోతాడు. ప్రజల శ్రేయస్సు కోసం గన్ను పట్టుకున్నామని చెప్పుకునే నక్సలైట్స్ దారి తప్పారని గ్రహిస్తాడు. ఆ తర్వాత నక్సలైట్స్‌పై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? విద్యా వ్యవస్థల్లో బలంగా నాటుకుపోయిన PDSUకి ధీటుగా ABVB ఎలా ఎదురొడ్డి నిలిచింది? కాలేజ్ స్టూడెంట్ లీడర్‌గా, ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే నాయకుడిగా జితేందర్ రెడ్డి చేసిన సేవలు ఏంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే చక్కగా ఒదిగిపోయాడు. RSS భావజాలం కలిగిన వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. ప్రజల్లో చైతన్యం కల్పించే సీన్స్‌లో మంచి నటన కనబరిచాడు. ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే నటన పరంగా ఎంతో మెచ్యూరిటీ ప్రదర్శించాడు. మొత్తంగా రాకేష్ వర్రే ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడని చెప్పవచ్చు. రాకేష్ తర్వాత PDSU నేతగా చేసిన నటుడి యాక్టింగ్ బాగుంది. స్వయం సేవకుడిగా సుబ్బరాజు నటన, నక్సలైట్ లీడర్‌గా ఛత్రపతి శేఖర్ యాక్టింగ్ మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తెలుగు తెరపై ఇప్పటి వరకు నక్సలైట్స్‌పై పాజిటివ్ యాంగిల్లోనే సినిమాలు తెరకెక్కాయి. కానీ తొలిసారి నక్సలిజం వెనకున్న చీకటి కోణాన్ని దర్శకుడు విరించి వర్మ ధైర్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రగతికారక పనులకు వారు ఏ విధంగా అడ్డుగా నిలుస్తున్నారో కళ్లకు కట్టారు. అప్పట్లో అట్టడగు వర్గాల కోసం పాటుపడిన స్వయంసేవకులను నక్సలైట్స్ ఏ విధంగా కాల్చి చంపారో చూపించారు. కామ్రేడ్స్ ఆగడాలను చూసి చలించిపోయిన హీరో వారిపై చేసే పోరాటాన్ని ఎంతో ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించారు. ఇంటర్వెల్ వరకూ కాలేజీ రాజకీయాలు చూపించిన దర్శకుడు ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ యాంగిల్‌ను టచ్ చేశాడు. నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో కూడా జితేందర్ రెడ్డి పాత్ర ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా తను చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా, స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, కమర్షియల్ హంగులు లేకపోవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా..
టెక్నికల్ విషయాలకు వస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కాస్త ఇబ్బంది పెట్టినా క్లైమాక్స్‌లో వచ్చే ఓ సాంగ్ గుండెలను హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- కథ, కథనం
- రాకేష్ వర్రే నటన
- సంగీతం
మైనస్ పాయింట్స్
- ఫస్టాఫ్ స్లోగా ఉండటం
- కమర్షియల్ హంగులు లేకపోవడం
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం