తమిళ స్టార్ సూర్య (Suriya) హీరోగా శివ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నటుడు సూర్యతో పాటు ‘కంగువా’ టీమ్ చురుగ్గా మూవీ ప్రమోషన్స్ చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ప్రస్తుతం కంగువా టీమ్ కేరళలో పర్యటిస్తోంది. అక్కడ ఓ మాల్‌కు వెళ్లిన సూర్య & టీమ్‌కు ఊహించని స్థాయిలో అభిమానులు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూర్య ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన మాల్
కంగువా (Kanguva) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా కేరళకు వెళ్లిన మూవీ టీమ్ కొచ్చి నగరంలో పర్యటించింది. వినూత్నంగా అక్కడి ‘లులు మాల్’ (Lulu International Shopping Mall, Kochi)లో ప్రమోషన్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సూర్య అభిమానులు పెద్ద ఎత్తున మాల్‌కు చేరుకున్నారు. తమ అభిమాన నటుడ్ని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో మాల్ మెుత్తం సూర్య అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం మాల్‌లో కనిపించింది. గతంలో ఎప్పుడు ఈ స్థాయి క్రౌడ్‌ను చూడలేదని మాల్ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఫ్యాన్స్‌కు సూర్య అభివాదం
ప్రమోషన్ ఈవెంట్‌లో భాగంగా కొచ్చిలోని లులు మాల్‌కు వచ్చిన సూర్య (Kanguva) అక్కడి క్రౌడ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. తమిళ నటుడైన తనపై కేరళ ప్రజలు ఈ స్థాయిలో అభిమానాన్ని చూపించడం చూసి ఫిదా అయ్యాడు. ఈ సందర్భంగా 15 నిమిషాల పాటు క్రౌడ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తామిచ్చిన ఒక చిన్న ప్రకటన చూసి ఇంతమంది మాల్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మీ విలువైన సమయాన్ని తన కోసం వెచ్చించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఆపై మోకాళ్లపై కూర్చొని మాల్‌లోని వారందరికీ అభివాదం తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది.
10 వేల స్క్రీన్స్‌లో విడుదల
‘కంగువా’ (Kanguva) చిత్రం గురించి నిర్మాత ధనుంజయ్ రీసెంట్‌గా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్లు చెప్పారు. ఓవరాల్‌గా 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకురానుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు.
ఏఐతో డబ్బింగ్
‘కంగువా’ (Kanguva) చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేసినట్లు సమాచారం. డబ్బింగ్ పనుల కోసం ఏఐని ఉపయోగించడం కోలీవుడ్‌లో ఇదే తొలిసారని నిర్మాత ధనుంజయ్ రీసెంట్‌గా పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్ చేయించినట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం