తమిళంలో నయనతార, సమంత, విజయ్ సేతుపతి కలిసి నటించిన సినిమా ‘కాతు వాక్కుల రెండు కాదల్’. తెలుగులో ‘కన్మణి రాంబో ఖతిజా(KRK)’ పేరుతో రిలీజ్ చేశారు. విగ్నేశ్ శివన్ సినిమాకు దర్శకత్వం వహించాడు. లలిత్ కుమార్ ప్రొడ్యూసర్. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా గురించి తెలుగులో అంత ఎక్కువగా ప్రచారం చేయలేదు. మరి నేడు థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇంతకీ కథేంటి? తెలుసుకుందాం..
కథ
రాంబోకి (విజయ్ సేతుపతి) చిన్నప్పటినుంచే దురదృష్టం వెంటాడుతుంది. అతడు ఏది ముట్టుకున్నా నాశనమవుతుంది. దీంతో ఇంట్లో నుంచి పారిపోతాడు. సిటీకి వెళ్లి వేర్వేరు ఉద్యోగాలు చేస్తుంటాడు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే సమయంలో కన్మణీ(నయనతార)తో ప్రేమలో పడతాడు. మరోవైపు రాత్రి పూట పబ్‌లో బౌన్సర్‌గా పనిచేసే సమయంలో ఖతిజాను(సమంత) చూసి ఇష్టపడతాడు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎక్కడికి దారితీస్తుంది? రాంబో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? కథ సుఖాంతమవుతుందా? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
మూవీ ఎలా ఉంది?
ఈ సినిమాకు ముగ్గురు టాప్ స్టార్స్ సమంత, నయనతార, విజయ్ సేతుపతి ఒకే స్క్రీన్ మీద కనిపించడం పెద్ద బలం అని చెప్పవచ్చు. కానీ కథ మైనస్‌గా మరింది. ఇలాంటి ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు ఇప్పటివరకు చాలా సినిమాల్లో చూశాం. ఈ సినిమా చూస్తుంటే అవే గుర్తొస్తుంటాయి. ఎమోషన్స్‌ను అనవసరంగా ఇరికించేందుకు ప్రయత్నించినా అవి అతకలేదు. కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంటుంది. అక్కడక్కడ ముగ్గురి మద్య వచ్చే కామెడీ సన్నివేశాలు తప్ప ఇంకేమీ రుచించవు. దర్శకుడు మొత్తం ముగ్గురు స్టార్స్‌ను నమ్ముకునే సినిమాను తీసినట్లుగా అనిపిస్తుంటుంది. కథ, స్క్రీన్‌ప్లేపై దృష్టి సారించలేదు.
ఎవరెలా చేశారంటే..
సమంత గ్లామరస్, ఓపెన్ మైండెడ్ అమ్మాయిగా కనిపించి మెప్పించింది. నయనతార తన పాత్రకు తగినట్లుగా సెటిల్డ్‌గా కనిపించింది. విజయ్ సేతుపతి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మంచి నటులు ఉన్నప్పటికీ సరైన కథ లేకపోవడంతో మైనస్‌గా మారింది. మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు.
సాంకేతిక విషయాలు
అనిరుద్ మరోసారి తన మ్యూజిక్‌తో అలరించాడు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కత్తెరకు మరి కాస్త పదును పెట్టాల్సింది. తక్కువ బడ్జెట్‌తో భారీ తారాగాణంతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాట్రోగ్రఫీ ఫర్వాలేదు. దర్శకుడు విగ్నేశ్ శివన్ చాలా ఫన్నీగా వీరి ప్రేమ కథను చెప్పాలనుకున్నాడు. కానీ అది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు.
ప్లస్ పాయింట్స్
నయనతార, సమంత, విజయ్ సేతుపతి
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
కథ, కథనం
నిడివి
చివరిగా..
నయనతార, సమంత, విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ముగ్గురిని ఒకేసారి తెరపై చూసి ఎంజాయ్ చేయవచ్చు. కథలో కొత్తదనం ఆశిస్తే నిరాశ తప్పదు.
రేటింగ్ 2.25/5