దేశంలోని హిందూ పండగలలో సంక్రాంతి అతి పెద్దది. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులు జరుపుకుంటారు. ముఖ్యంగా పిల్లలు సంక్రాంతి పండుగను చాలా ఇష్టపడతారు. అయితే మన సంప్రదాయాలకు దూరమవుతున్న ఈ జనరేషన్ పిల్లలను తిరిగి మన సంస్కృతి వైపు మళ్లించేందుకు సంక్రాంతి చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. మన బాల్యం ఎంత అద్భుతంగా గడిచిందే వారికి తెలియజేప్పేందుకు ఇదే మంచి అవకాశం. సంక్రాంతి సందర్భంగా వారిచేత ఈ కింది పనులు చేయించండి.
సంక్రాంతి కుండ
సంక్రాంతి రోజున కొత్త కుండలో పొంగలి చేసి దానిని కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ కుండను వివిధ రకాలైన రంగులతో ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. కాబట్టి ఈ కుండ తయారీలో మీ పిల్లల సాయం తీసుకోండి. మట్టి కుండకు ఏ విధంగా రంగులు అద్దాలో వారి చేత చేయించండి. ఇది వారికి చక్కటి వినోదాన్ని ఇవ్వడంతో పాటు వారిలో సృజనాత్మకతను పెంచుతుంది.
ముగ్గుల డిజైన్
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ముగ్గుకు ఉన్న ప్రాధాన్యత క్రమంగా తగ్గుతోంది. కాబట్టి ఈ తరం పిల్లలకు దాని గొప్పతనాన్ని తెలియజేయండి. ఈ సంక్రాంతి కోసం మీ పిల్లలను అందమైన ముగ్గులను డిజైన్ చేయమని చెప్పండి. మీ పిల్లలతో ముగ్గులపై పూలు, ఆకర్షణీయమైన రంగులను అద్దించండి. ఇలా చేయడం ద్వారా పిల్లలకు మన సంప్రదాయ కళలను నేర్పినవారమవుతాము.
వంటల్లో భాగస్వామ్యం
సంక్రాంతికి చేసే పిండి వంటల్లో మీ చిన్నారులను సైతం భాగస్వామ్యులను చేయండి. మన ట్రెడిషినల్ ఫుడ్‌కు సంబంధించిన సమాచారాన్ని వారితో పంచుకోండి. ఇలా చేయడం వల్ల మన పిండివంటలపై వారికి అవగాహన వస్తుంది. తద్వారా మన సంప్రదాయ వంటలను భవిష్యత్ తరాల వారికి అందించినట్లు అవుతుంది.
కళాకృతుల తయారీ
మన సంప్రదాయ కళాకృతులను పిల్లల చేత తయారు చేయించడానికి ప్రయత్నించండి. న్యూస్ పేపర్లతో అందమైన గాలిపటాలను ఎలా రూపొందించాలో వారికి చెప్పండి. పేపర్లు, కాటన్, రంగు పెన్సిళ్లు, అట్టపెట్టెలను ఉపయోగించి అందమైన బొమ్మలను తయారు చేయించండి. దీని వల్ల పిల్లలో ఊహాశక్తి పెరుగుతుంది.
గేమ్స్ & మ్యూజిక్
సంక్రాంతికి చుట్టాల పిల్లలు అందరూ ఒక చోటకు చేరుతారు. వారి చేత కనుమరగవుతున్న ఆటలు ఆడించండి. కళ్లకు గంతలు, ఉట్టి కొట్టడం, సంక్రాంతి పాటలు పాడించడం, సంప్రదాయ ఫోక్ సాంగ్స్‌కు డ్యాన్స్ వంటివి చేయించండి.