ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు ప్రతీ ఒక్కరికీ సెల్‌ఫోన్ నిత్యవసరంగా మారిపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు. సెల్‌ఫోన్ లేకపోతే కనీసం భోజనం కూడా చేయని పరిస్థితికి వెళ్లారు. సెల్‌ఫోన్‌తోనే తమకు వినోదం అన్న స్థాయికి వెళ్లిపోయారు. చివరికీ నిద్రపోవాలన్నా కూడా ఫోన్ తప్పనిసరి అయిపోయింది. మెుబైల్ పిచ్చి నుంచి పిల్లలను బయటకు తీసుకురాలేక, ఈ అలవాటును మార్చలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికోసమే YouSay ఈ కథనం తీసుకొచ్చింది. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ పిల్లలు అసలు మెుబైల్‌ను ముట్టుకోరు. అవేంటో మీరే చూడండి.
ఔట్‌డోర్ గేమ్స్
చిన్నారులను సెల్‌ఫోన్‌కు దూరం చూసే ప్రధాన మార్గం ఔట్‌డోర్ గేమ్స్. ఫిజికల్ యాక్టివిటీ, అవుట్‌డోర్ స్పోర్ట్స్ పిల్లల్లో ఫిజికల్ ఫిట్‌నెస్‌ను ప్రోత్సహిస్తాయి. దీంతో వారు ఫోన్‌కు దూరంగా ఉంటారు. స్విమ్మింగ్, సైక్లింగ్ లేదా మార్షల్ ఆర్ట్స్ వంటి వ్యక్తిగత క్రీడలతో పాటు సాకర్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ వంటి గ్రూప్ గేమ్స్ ఆడేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. దీని వల్ల పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు సామాజిక అనుసంధాన్ని వారిలో పెంపొందించవచ్చు.
కళలపై ఆసక్తి పెంచడం
ప్రతీ చిన్నారినిలో సృజనాత్మక అభిరుచులు ఉంటాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి ఆ దిశగా వారు అడుగు వేసేలా చేయాలి. ఉదాహరణకు డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్, చిత్ర లేఖనం వంటి సృజనాత్మక కళలలను అభిరుచులుగా చేసుకునేందుకు మీ పిల్లలను ప్రోత్సహించాలి. వారికి ఇష్టమైన కళపై పట్టు సాధించేలా స్పెషల్ క్లాసులకు పంపించాలి. తద్వారా ఖాళీ సమయాన్ని సెల్‌ఫోన్‌పై కాకుండా ఇష్టమైన కళ కోసం చిన్నారులు వెచ్చించే అవకాశం ఏర్పడుతుంది.
పుస్తక పఠనం
మెుబైల్ అడిక్షన్ నుంచి పిల్లల్ని దూరం చేసే మరో మార్గం పుస్తక పఠనం. పిల్లల్లో బుక్స్‌పై ఆసక్తి పెంచే కార్యక్రమాలను తల్లిదండ్రులు చేపట్టాలి. వివిధ రకాల పుస్తక శైలులను బహిర్గతం చేస్తే మీ పిల్లలు చదవడాన్ని అలవాటు చేసుకుంటారు. అంతేకాకుండా చదివిన బుక్‌పై ఒక చిన్న చర్చ పెట్టండి. ఆ పుస్తకం నుంచి ఏం తెలుసుకున్నారో లేదా నేర్చుకున్నారో చిన్నారుల చేత చెప్పించండి. దాని వల్ల కొత్త విషయాన్ని నేర్చుకున్నామన్న సంతోషంతో పాటు.. మరో అంశం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పిల్లల్లో పెరుగుతుంది.
సామాజిక సేవ
పిల్లలకు చిన్నప్పటి నుంచే సానుభూతి, కరుణ గురించి నేర్పించాలి. కమ్యూనిటీ సేవా కార్యక్రమాలు లేదా స్వచ్ఛంద సేవల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న భావనను వారిలో ప్రేరేపించాలి. ఇందులో భాగంగా వీధిలోని పిల్లలతో కలిసి మీ చిన్నారి క్లీన్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సహించండి. మీరు ఉంటున్న వీధిని వారం లేదా నెలలో ఒకసారి శుభ్రం చేసేలా ప్రేరేపించండి. అలా చేయడం ద్వారా వారికి సామాజిక బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది. ఇలాంటి చర్యలు స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడటాన్ని తగ్గించడమే గాక చిన్నారిలో వికాసానికి, పరోపకార భావనను పెంపొందిస్తాయి.
సెలవుల్లో ఇలా చేయండి..!
పాఠశాలకు సెలవు ఇచ్చిన రోజున చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను ఇంటికే పరిమితం చేస్తుంటారు. దీంతో ఖాళీగా ఏం చేయాలో తెలియక చిన్నారులు సెల్‌ఫోన్ ఇవ్వమని మారం చేస్తారు. కాబట్టి సెలవు రోజుల్లో పిల్లలను సాధ్యమైనంత వరకూ బయటకు తీసుకెళ్లి ఆడించాలి. పార్కుల్లో ఇతర పిల్లలతో సంతోషంగా ఆడుకునేలా ప్రోత్సాహం అందించాలి. జూపార్క్స్, స్విమ్మింగ్ తదితర పర్యాటక ప్రాంతాలకు వారిని తిప్పాలి. దీని వల్ల అసలైన వినోదం ఏంటో చిన్నారులు తెలుసుకుంటారు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!