మనిషి మెదడులో చిప్ అమర్చిన న్యూరాలింక్ ప్రాజెక్ట్ విజయవంతమైనట్లు స్పెస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మాస్క్ తెలిపారు. ఆ చిప్ కలిగిన మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. అతని ఆలోచనల ప్రకారం కంప్యూటర్ మౌస్‌ను కంట్రోల్ చేయగల్గినట్లు వెల్లడించారు.
గతేడాది సెప్టెంబరులో మానవులపై క్లీనికల్ ట్రయల్స్ కోసం ఆయన ఆమోదం సాధించారు. USFDA ఆమోదం తర్వాత మనిషి మెదడులో చిప్‌ను అతని స్టార్టప్ విజయవంతంగా అమర్చింది. ప్రయోగం చేయదల్చుకున్న వాలంటీర్ మెదడులోని భాగానికి ఆపరేషన్ చేసి చిప్‌ను అమర్చారు.
అయితే మనిషి మెదడులో చిప్ అమర్చడం వెనుక బహుముఖ ప్రయోజనాలు దాగి ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే నాడీ సంబంధ వ్యాధుల నివారణకు ఇదొక చక్కని మార్గం కాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం, కాళ్లు, చేతులు వంకర్లు తిరగడం, శారీరక స్పర్శలేని రోగుల్లో స్పర్శ తీసుకుని రావడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వ్యక్తి ఆలోచనలను ఉపయోగించి కంప్యూటర్ కర్సర్ ఎలా అయితే నియంత్రించారో భవిష్యత్‌లో మనిషి ఆలోచనలకు తగిన విధంగా ఇతర శరీర భాగాలు పనిచేసేలా అభివృద్ధి చేయనున్నారు. తద్వారా దీర్ఘకాలిక వ్యాధులైన డిమెన్షియా, అల్జీమర్స్, పార్కిన్‌సన్స్ వ్యాధి, మానసిక వ్యాధుల నయానికి ఇది ఉపయోగపడుతుంది.