టెస్లా, స్పెస్ ఎక్స్, ట్విటర్ వంటి దిగ్గజ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) స్థాపించిన ‘న్యూరాలింక్’ (Neuralink) చరిత్రలో కనివినీ ఎరుగని అద్భుతాన్ని చేసి చూపించింది. డైవింగ్ చేస్తూ గాయపడి చేతుల్లో చలనం కోల్పోయిన 29 ఏళ్ల నోలాండ్ అర్బాగ్ (Noland Arbaugh) అనే వ్యక్తి.. తన స్వహస్తాలతో చెస్ ఆడేలా చేసింది. ఇందుకోసం ‘న్యూరాలింక్’ సంస్థ అతడి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చింది. దాని సాయంతో నోలాండ్.. ఎవరి సాయం లేకుండానే తన చేతులతో మౌస్‌ను ఆపరేట్ చేస్తూ కంప్యూటర్‌లో చెస్ గేమ్ ఆడాడు. ఇందుకు సంబంధించిన 9 నిమిషాల నిడివి గల వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.
‘న్యూరాలింక్’ సంస్థ చేసిన చిప్ ఇంప్లిమెంటేషన్ చికిత్స చాలా ఈజీగా జరిగిపోయిందని పేషెంట్ నోలాండ్ అర్బాగ్ తెలిపాడు. ప్రమాదం తర్వాత ఇక అసాధ్యం అనుకున్న పనులన్నీ ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ చిప్ సాయంతో చేయగల్గుతున్నట్లు చెప్పాడు. మెదడుకు ఈ చిప్ అమర్చిన దగ్గర నుంచి వీడియో గేమ్స్ కూడా ఆడగల్గుతున్నట్లు నోలాండ్ తెలిపాడు.
డైవింగ్ ప్రమాదం జరగకముందు తాను సివిలైజేషన్ 6 (Civilization VI) గేమ్‌ను ఎక్కువగా ఆడేవాడినని నోలాండ్ అర్బాగ్ (Noland Arbaugh) తెలిపాడు. ప్రమాదం తర్వాత తాను ఈ వీడియో గేమ్‌కు దూరమైనట్లు చెప్పాడు. అయితే ‘న్యూరాలింక్’ సాయంతో ఈ గేమ్ మళ్లీ ఆడగల సామర్థ్యం తనకు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.
అయితే ఈ ఎలక్ట్రానిక్ చిప్ ద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లు నోలాండ్ తెలిపాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లదలుచుకోవడం లేదని అన్నాడు. చిప్ పనితీరుకు పరిమితులు ఉన్నాయని, ఇంకా పూర్తిగా ఇది పనిచేయాల్సి ఉందన్నాడు. ఇంకాస్త మెరుగులు ఈ చిప్ వ్యవస్థకు అవసరమన్నాడు. ఏది ఏమైనా ఈ ఆధునాతన చికిత్స విధానం తన జీవితాన్ని మార్చివేసిందని నోలాండ్ ఆనందం వ్యక్తం చేశాడు.
న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్‌మస్క్ తాజా వీడియోపై స్పందించాడు. ‘దీర్ఘకాలం ప్రజలు మళ్లీ నడవడానికి.. వారి చేతులను సాధారణంగా ఉపయోగించేలా చేయడానికి.. దెబ్బతిన్న వెన్నెముక భాగాన్ని తిరిగి మెదడుతో అనుసంధానం చేయడం.. ఇకపై ఆచరణ సాధ్యమే’ అని కామెంట్ పెట్టాడు.
మెదడుకు ఎలక్ట్రానికి చిప్ అమర్చే చికిత్స విధానానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గతేడాదిలో మే అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత తొలిసారి తాము ఓ మనిషికి చిప్ అమర్చినట్లు న్యూరాలింక్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఈ ప్రయోగం తర్వాత ఆ సంస్థ షేర్ చేసిన తొలి వీడియో ఇదే కావడం గమనార్హం. అంతకుముందు ఈ చిప్‌ను కోతులపై ప్రయోగించి ‘న్యూరాలింక్’ మంచి ఫలితాలను పొందింది.