తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో వివిధ ఈవెంట్లను నిర్వహిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమాపై మరింతగా ఆకర్షిస్తున్నారు.
ఈ ప్రమోషనల్ కార్యక్రమాల మధ్య, చిత్ర బృందానికి ఓ ఆందోళనకరమైన వార్త ఎదురైంది. ఈ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్ అనుమానాస్పదంగా కన్నుమూయడం చిత్రబృందాన్ని తీవ్రంగా కలచివేసింది. కొచ్చిలోని తన అపార్ట్మెంట్లో ఆయన మరణించడం సినీలోకాన్ని విస్మయపరుస్తోంది. సినిమా ఎడిటింగ్‌లో చురుకుగా పాల్గొన్న నిషాద్ ఆకస్మాత్తుగా తనువు చాలించడం పట్ల సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున రెండుగంటలకు నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆయన కొచ్చి- పనంపిల్లి నగర్‌లోని తన అపార్ట్మెంట్లో విగత జీవై కనిపించాడు. ఆయన మృతిపై పలు అనుమానాలు రెకెత్తడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్మెంట్ నివాసం ఉంటున్న వారితో పాటు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్‌ను కూడా విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలపై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత బాధలు ఏమి లేవని ఆయన ఆత్మీయులు చెబుతున్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. నిషాద్ మరణ వార్త తమిళ్, మలయాళ పరిశ్రమను శోక సంద్రంలో ముంచి వేసింది. ఆయనకు కడసారి వీడ్కోలు తెలిపేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు తరలివస్తున్నారు.
నిషాద్ యూసుఫ్ తెలుగు, తమిళ్ తో పాటు మలయాళ సినిమాలకు కూడా పనిచేశారు. అడియోస్ అమిగోస్, ఉండా, వన్, పెటారాప్, సౌదీ వెళ్లక్క వంటి ఎన్నో ఆసక్తికరమైన చిత్రాలకు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఆయన ఆకస్మిక మరణం సినిమా రంగానికి భారీ నష్టం అని చెప్పాలి. ఇక ఆయన చివరగా పనిచేసిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు 15 రోజుల ముందు ఇలా జరగడం చిత్ర యూనిట్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.
నిషాద్ యూసుఫ్ మరణం పట్ల కంగువా చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హీరో సూర్య నిషాద్ మరణవార్త తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు కంగువా మూవీ ప్రమోషన్స్ తమిళ్‌తో తెలుగులోనూ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏకంగా హీరో సూర్యనే తెలుగులో ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా గడుపుతున్నారు. ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి నాగార్జునతో కలిసి కంటెస్టెంట్స్‌ను పలకరించారు. ప్రస్తుతం హిందీ బెల్ట్‌లోనూ సూర్య ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు . హీరోయిన్ దిశా పటాని, ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్‌తో కలిసి చిత్ర ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాడు. కాగా ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్, జపనీస్ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.
రూ.1000 కోట్ల లక్ష్యం!
రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించడమే లక్ష్యంగా ‘కంగువా’ను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్ చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.