‘కేజీఎఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సక్సెస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూ.ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ ప్రొడక్షన్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా గప్‌చుప్‌గా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా అందరినీ షాక్‌కి గురిచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు వాటిని ట్రెండింగ్ చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో..
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), హీరో ఎన్టీఆర్‌ల సినిమా (NTR31) మొదలైంది. నేడు (ఆగస్టు 9) పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా సోషల్ మీడియాలో ‘#NTRNeel’ హ్యష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది.
విభిన్నమైన కథాంశంతో..
ప్రశాంత్ నీల్ సినిమా అనగానే భారీ ఎత్తున యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే హీరోయిజం గుర్తుకువస్తాయి. కేజీఎఫ్, సలార్ చిత్రాల్లో యష్, ప్రభాస్‌లను చూపించినట్లుగానే తారక్‌ను కూడా చాలా పవర్‌ఫుల్‌గా ప్రశాంత్ నీల్ చూపిస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ ‘NTR 31’ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘దీన్ని అందరూ ఓ యాక్షన్ సినిమాలా భావిస్తారని నాకు తెలుసు. కానీ నేను నా జానర్‌లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్త కథ అని చెప్పగలను’ అని పేర్కొన్నారు. దీంతో తారక్‌ను కేజీఎఫ్, సలార్‌కు మంచి సరికొత్తగా నీల్ మామా చూపిస్తారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
డ్యూయల్ రోల్‌లో తారక్?
తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త ఇటీవల హల్‌చల్ చేసింది. ఆ బజ్ ప్రకారం ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరిగింది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.
పవర్‌ఫుల్ టైటిల్!
NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్ పేరు అయినందువల్లే డ్రాగన్ టైటిల్‌ను ప్రశాంత్ నీల్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్ అయితేనే సరిగ్గా మ్యాచ్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
భారీ బడ్టెట్..
తారక్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్ చేస్తారని సమాచారం.