భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతూ వస్తోంది ‘ఓలా’ (Ola). బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ తాజాగా భారత్‌లో రెండు వెహికల్స్‌ని లాంఛ్ చేసింది. ఓలా ఎస్1 ఎక్స్(Ola S1 X), ఓలా ఎస్1 ప్రో జనరేషన్ 2(Ola S1 Pro Gen 2)లను విడుదల చేసింది. ఇటీవలే ఓలా ఎస్1 ఎయిర్ (Ola S1 Air)ని లాంఛ్ చేయగా, ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరో రెండు ఈవీ మోడళ్లను తీసుకొచ్చింది. ప్రారంభ ధర కింద వాస్తవ ధరపై రూ.10 వేల డిస్కౌంట్ కల్పిస్తోంది. మరి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెసిఫికేషన్లు, ధర, డెలివరీ, తదితర వివరాలు తెలుసుకుందామా.
Ola S1 Pro Gen 2
ఓలా ఎస్1 ప్రోలో మరికొన్ని మార్పులు చేస్తూ సెకండ్ జనరేషన్ వెహికల్‌ని తీసుకొచ్చింది ఓలా. మొదటి వేరియంట్‌తో పోలిస్తే మరింత పవర్, రేంజ్ దీని సొంతం. పాత స్కూటర్‌తో పోలిస్తే ప్రతి విషయంలోనూ దీనిని అప్‌డేట్ చేసినట్లు కంపెనీ చెబుతోంది. మరింత ఎఫిషియంట్‌గా పనిచేసేలా బ్యాటరీ ప్యాక్‌ని రీడిజైన్ చేసింది. పవర్‌ట్రైన్‌లోనూ మార్పులు చేసింది.
స్పెసిఫికేషన్లు
సెకండ్ జనరేషన్ వేరియంట్‌లో 11 కిలో వాట్ మోటార్‌ని వాడారు. 2.6 సెకన్లలోనే గంటకు సున్నా నుంచి 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 120 కిలో మీటర్ల టాప్ స్పీడ్‌తో వెళ్లగలదు. రేంజ్ కూడా మెరుగు పడింది. తాజా వేరియంట్ రేంజ్ 195 కిలో మీటర్ల దాకా ఉంది. స్కూటర్ ఆకారంలోనూ మార్పులు జరిగాయి. టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, వెనకాల మోనో షాక్‌ని ఎన్‌హ్యాన్స్ చేశారు. దీంతో స్కూటర్ బరువు 6 కిలోలు తగ్గింది.
ధర
Ola S1 Pro Gen 2 ప్రారంభ ధర రూ.1.47 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. ఆగస్టు 21 వరకు ఈ ధరలు అందుబాటులో ఉంటాయి. తర్వాత పెరిగే అవకాశం ఉంది. ప్రీ రిజర్వేషన్ ప్రారంభమైంది. స్కూటర్ డెలివరీలు సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభమౌతాయి.
Ola S1 X Series
ఎస్1 రేంజ్‌లో ఓలా ఎస్1 ఎక్స్ సిరీస్‌ని ఎంట్రీ పాయింట్‌గా మార్చింది. ఈ సిరీస్‌ని మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. S1 X+, S1 X(2kWh బ్యాటరీ), S1 X(3kWh బ్యాటరీ) వేరియంట్లు ఇందులో ఉన్నాయి. S1 X+ స్కూటర్‌ని టాప్ వేరియంట్‌గా ఓలా ఇంట్రడ్యూస్ చేసింది. ఖర్చు తగ్గించేందుకు ఎస్1 ఎక్స్ రేంజ్ స్కూటర్లను నల్లటి ప్లాస్టిక్‌తో తాపడం(Cladding) చేశారు.
Ola S1 X+
ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ మోడల్ సరికొత్త డిస్‌ప్లేతో వస్తోంది. 5.0 అంగుళాల ఎల్‌సీడీ(LCD) డిస్‌ప్లేని ఇది కలిగి ఉంది. మిగతా వేరియంట్లతో పోలిస్తే డిస్‌ప్లే విషయంలో ఈ వేరియంట్ టాప్‌గా ఉంది. మిగతా మెకానికల్ స్పెసిఫికేషన్లు అంతా ఒకే విధంగా ఉన్నాయి. ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్‌కి 6 కిలో వాట్ల(8.15bhp) మోటార్‌ని అమర్చారు. 3 కిలో వాట్ హవర్స్(3kWh) బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. ఈ బ్యాటరీతో 151 కిలో మీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుంది. 3.3 సెకన్లలో గంటకు సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 90 కిలోమీటర్ల టాప్ స్పీడుతో ప్రయాణించగలదు. దీని ప్రారంభ ధర రూ.99,999గా ఉంది. ఆగస్టు 21 నాటికి ఈ ధర ఉంటుంది. సెప్టెంబర్‌లో వాహనం డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Ola X3(3kWh)
ఓలా ఎక్స్3 వేరియంట్‌లో 3.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది కూడా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ మాదిరి 6 కిలో వాట్ల(8.15bhp) మోటార్‌తో రానుంది. 3 కిలో వాట్ హవర్స్(3kWh) బ్యాటరీ ప్యాక్ దీని సొంతం. 151 కిలో మీటర్ల దూరం రేంజ్‌తో వస్తోంది. 3.3 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 90 కిలోమీటర్ల టాప్ స్పీడుతో ప్రయాణించగలదు. దీని ప్రారంభ ధర రూ.89,999గా ఉంది. రూ.999తో ప్రీ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉంది.
Ola X2(2kWh)
ఓలా ఎక్స్ సిరీస్‌లో ఇది బేస్ వేరియంట్‌గా వస్తోంది. 2కిలో వాట్ హవర్స్ బ్యాటరీ ప్యాక్ కలదు. 6కిలో వాట్ మోటార్‌ని దీనికి అమర్చారు. దీని రేంజ్ చాలా తక్కువ. 91 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణిస్తుంది. గంటకు 85 కిలోమీటర్ల టాప్ స్పీడుతో వెళ్లగలదు. దీని ప్రారంభ ధర రూ.79,999గా ఉంది. రూ.999తో ప్రీ రిజర్వేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్‌లో వాహనాన్ని డెలివరీ చేయనుంది.