తమిళ్ సూపర్ స్టార్లతో దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్‌కు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు బాగుందంటే? కొందరు అర్థంకాలేదన్నారు. అయితే..
ఆ చిత్రంలో ఎన్నో ప్రశ్నలు విడిచిపెట్టారు దర్శకుడు. వాటన్నింటికి సమాధానం చెప్పేందుకు పొన్నియన్ సెల్వన్ 2ని తీర్చిదిద్దారు. గత నెల రోజుల నుంచి భారీగా ప్రమోషన్లు చేసిన ఈ చిత్రం విడుదలయ్యింది. మరీ, సినిమా విజయం సాధించిందా? మణిరత్నం మ్యాజిక్ పనిచేసిందా? అనేది సమీక్షిద్దాం.
దర్శకుడు: మణిరత్నం
నటీ నటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ, త్రిష, శోభితా, ఐశ్వర్య లక్ష్మి
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
కథేంటి?
చోళ రాజ్య రాకుమారుడు అరుణ్మొళి ( జయం రవి ) ని అంతమెుందించడానికి జరిగిన కుట్రతో మెుదటి భాగం పూర్తవుతుంది. అతడు నిజంగానే చనిపోయాడా? లేదా సామంతరాజుల కుట్రలు తెలుసుకోవాలని వెళ్లిన వల్లవరాయుడు ( కార్తీ ) కాపాడాడా? తమ్ముడి మరణించినట్లు వస్తున్న వార్తలతో ఆదిత్య కరికాలుడు( విక్రమ్ ) ఏం చేశాడు ? చోళుల అంతం చూడాలని నందినీ( ఐశ్వర్య రాయ్ ) ఎందుకు అనుకుంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానమే పొన్నియన్ సెల్వన్ 2 కథ.
ఎలా ఉంది
మెగాస్టార్ వాయిస్ ఓవర్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అరుణ్మోళిని వల్లవరాయుడు, నందినీ, బుద్దిస్టులు కాపాడటంతో కథ మెుదలవుతుంది. కుట్ర విషయాన్ని తెలుసుకున్న ఆదిత్య కరికాలుడి ఎత్తుగడలతో చకచకా ముందుకు కదులుతుంది.
ఆదిత్య కరికాలుడు- నందినీ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఇద్దరూ ఎదురుపడిన సంఘటన మరో లెవల్‌లో ఉంటుంది. చోళులను అంతం చేయాలని నందినీ ఎందుకు అనుకుంటుందనే సన్నివేశాలతో పాటు రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనుకునే పళవెట్టురాయర్ ఎత్తుగడలతో ఎక్కడా బోర్ కొట్టదు.
త్రిష, ఐశ్వర్య రాయ్ ఇద్దరూ కలిసి కనిపించిన ఫ్రేమ్ చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నంత అందంగా మెరిశారు. సినిమా ప్రారంభమైన తర్వాత డీసెంట్ స్క్రీన్‌ప్లే వెళ్లినప్పటికీ కాస్త స్లో నరేషన్ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ఇది మణిరత్నం స్టైల్ అయినప్పటికీ మరికొంత మెరుగ్గా ఉంటే బాగుండేదనే ఫీలింగ్ వస్తుంది.
క్లైమాక్స్‌ను త్వరగా ముగించాలని చేసినట్లు అనిపిస్తుంది. మరింత ఫోకస్ పెట్టి ఉంటే ప్రేక్షకులకు సినిమా ఎక్కువగా కనెక్ట్ అయ్యేది.
ఎవరెలా చేశారు ?
పొన్నియన్ సెల్వన్ 2లో విక్రమ్ తన విశ్వరూపం చూపించాడు. మెుదటిపార్ట్‌లో తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ ఇందులోనూ ఆయనదే హవా. మరో గుర్తుండిపోయే క్యారెక్టర్ అంటే ఐశ్వర్య రాయ్ అనే చెప్పాలి. నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ నటించి మెప్పించింది.
జయం రవి, కార్తీ తమ క్యారెక్టర్లకు ప్రాణం పోశారు. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ మెుదటి భాగంలో చాలామంది కనెక్ట్ అయ్యేది వల్లవరాయన్ కార్తీ పాత్రతోనే. ప్రేక్షకులు ఈ సినిమాలోనూ ఆ క్యారెక్టర్‌తో ప్రయాణం చేస్తారు. త్రిష, శోభితా దూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి పాత్రల పరిధి మేరకు నటించారు.
దర్శకుడు మణిరత్నం మెుదటి భాగంతో పోలిస్తే రెండో పార్ట్‌ను కాస్త మెరుగ్గా తీశారని చెప్పవచ్చు. సినిమాను నీట్‌గా హ్యాండిల్ చేశారు. స్లో నెరేషన్ చేసినప్పటికీ ప్రేక్షకులు విజయాన్ని కట్టబెట్టడం ఖాయమే.
సాంకేతిక పనితీరు
సినిమాకు హైలెట్‌గా నిలిచింది సినిమాటోగ్రఫీ. రవి వర్మన్ తన పనితీరుతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. దర్శకుడి ఊహా చిత్రాన్ని అచ్చుగుద్దినట్లుగా ప్రేక్షకులకు చూపించిన గొప్పతనం ఆయనకే దక్కుతుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సినిమాకు సంగీతం ప్లస్ పాయింట్. ఈ చిత్రంలో ఏ. ఆర్.రెహమాన్ తన ప్రతిభ చూపించినప్పటికీ కొన్ని చోట్ల మరింత బాగుండాలి అనిపిస్తుంది. మెుత్తంగా ఫర్వాలేదనే చెప్పాలి. కానీ, రెహమాన్ నుంచి ఆశించినంత స్థాయిలో లేదు.
బలాలు
కథ, కథనం
నటీనటులు
సినిమాటోగ్రఫీ
బలహీనతలు
స్లో నరేషన్
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!