నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్ తదితరులు
రచన, దర్శకత్వం: రామ్ భీమన
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: పీజీ విందా
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్
నిర్మాత: డాక్టర్ రమేశ్ తేజవత్, ప్రకాశ్ తేజవత్
యంగ్ హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అటు సినీ, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదొడుకులను ఫేస్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు నటించిన లేటేస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu Movie review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ భీమన (Ram Bhimana) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హాసిని (Actress Hasini) హీరోయిన్‌గా చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్ తరుణ్‌కు హిట్‌ను అందించి ఊరట కల్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
రచిత్ రామ్ (రాజ్‌తరుణ్) పుట్టుకతోనే కోటీశ్వరుడు. పీఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్య రామ్ (మురళీ శర్మ) ఏకైక తనయుడు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చిన కుమారుడికి సీఈవో బాధ్యతలు అప్పగించాలని ఆదిత్య నిర్ణయించుకుంటాడు. అయితే రచిత్ పెద్దమ్మ వసుంధర దానికి (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్ ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది. దీనికి రచిత్ అంగీకరించి బయటకువచ్చేస్తాడు. ఏపీలోని మారుమూల గ్రామమైన రాయపులంకకు వెళ్తాడు. అక్కడికి వెళ్లాక రచిత్ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు అతడు ఎలాంటి సాహసాలు చేశాడు? అమ్ముతో అతడి లవ్ స్టోరీ ఏంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
రచిత్ రామ్ పాత్రలో రాజ్‌తరుణ్ చక్కటి నటన కనబరిచాడు. కోటీశ్వరుడిగా, ఎటువంటి ఐడెంటిలేని సాధారణ వ్యక్తిలా రెండు డైమన్షన్స్‌లో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఇక పల్లెటూరి అమ్మాయి అమ్ము పాత్రలో హాసిని సుధీర్ స్క్రీన్‌పై ఎంతో అందంగా మెరిసింది. రాజ్‌తరణ్ – అమ్ము మధ్య వచ్చే లవ్ సీన్స్ మెప్పిస్తాయి. హీరో ఫ్రెండ్ పాత్రలో ప్రవీణ్ నవ్వులు పూయిస్తాడు. సత్య, బ్రహ్మానందం వంటి కమెడియన్లు సినిమాలో తళుక్కుమని మెరిశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని కారణాల వల్ల ఓ సామాన్యుడిలా గడపటం గతంలో చాలా చిత్రాల్లోనే చూశాం. ‘పురుషోత్తముడు’ చిత్రాన్ని కూడా దర్శకుడు రామ్ భీమన ఈ కోవలోనే రూపొందించారు. ధనవంతుడైన హీరో రాయపులంక గ్రామం చేరాక అసలు కథ మెుదలవుతుంది. హీరోయిన్‌తో పరిచయం, లవ్ సీన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్టాఫ్ మెుత్తం విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీతో ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఊర్లో జరిగే అన్యాయాలపై హీరో తిరగబడటం, ఇంటర్వెల్ బ్యాంగ్ మెప్పిస్తాయి. అయితే ద్వితీయార్థం నుంచి కథ గాడి తప్పినట్లు కనిపిస్తుంది. ఎలాంటి మలుపు లేకుండా ఊహకు తగ్గట్లు సాఫీగా, బోరింగ్‌గా సాగిపోతుంది. క్లైమాక్స్ సైతం అంచనాలకు తగ్గట్లు ఉన్నా ప్రకాశ్ రాజ్ ఎంట్రీ, అతడు చెప్పే డైలాగ్స్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కథ, కథనంలో వైవిధ్యం చూపడంలో దర్శకుడు రామ్ భీమన పూర్తిగా విఫలమయ్యాడు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే గోపి సుందర్ అందించిన సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పీజీ విందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరా పనితనంతో చక్కగా చూపించారు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- రాజ్‌తరుణ్ నటన
- ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్స్
- హీరో-హీరోయిన్ కెమెస్ట్రీ
మైనస్ పాయింట్స్
- రొటిన్ స్టోరీ
- ఊహకందేలా సాగే కథనం
- ట్విస్టులు లేకపోవడం
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్