ఈనాడు మీడియా అధినేత, ప్రముఖ సినీ నిర్మాత రామోజీరావు (Ramoji Rao) మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. ఆయన లేని లోటును తలుచుకుంటూ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీని కడసారి చూసేందుకు ఆయన పార్థివ దేహమున్న ఫిలిం సిటీకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం కుటుంబ సమేతంగా ఫిలిం సిటీకి వెళ్లారు. అక్కడ అశ్రు నయనాలతో రామోజీకి అంజలి ఘటించారు.
వెక్కి వెక్కి ఏడ్చిన రాజమౌళి!
రామోజీ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పించడానికి దర్శకధీరుడు రాజమౌళితో పాటు ఆయన భార్య రమా రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) కూడా వెళ్లారు. ఈ సందర్భంలో రామోజీని చూస్తూ రాజమౌళి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. రాజమౌళిని ఇంత బాధలో ఎప్పుడు చూడలేదని ఫ్యాన్స్ అంటున్నారు. రామోజీతో రాజమౌళికి ఉన్న బంధం ఎంత విలువైనదో ఈ దృశ్యాలే కళ్లకు కడుతున్నాయని చెబుతున్నారు.
ఆ కన్నీటికి కారణం ఇదే!
రాజమౌళి సినిమా దర్శకుడు అయ్యే కంటే ముందే శాంతి నివాసం అనే సీరియల్‌తో దర్శకుడిగా మారారు. ఈ శాంతి నివాసం సీరియల్ ఈటీవీలోనే ప్రసారమయ్యేది. అలా అప్పుడు రామోజీరావుతో రాజమౌళికి ఏర్పడిన పరిచయం తర్వాత సాన్నిహిత్యంగా మారింది. తనకు ఆత్మీయుడైన రామోజీ మరణించడంతో రాజమౌళి తట్టుకోలేకపోయారు. అటు సోషల్ మీడియా వేదికగాను నివాళులు అర్పించారు. ‘ఒక వ్యక్తి తన 50 సంవత్సరాల స్థితిస్థాపకత, కృషి, ఆవిష్కరణలతో లక్షలాది మందికి ఉపాధి, జీవనోపాధి మరియు ఆశలను అందించారు. రామోజీ రావు గారికి మనం నివాళులు అర్పించే ఏకైక మార్గం ‘భారతరత్న’ ప్రదానం చేయడం’ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
స్టార్ హీరోల నివాళులు
పత్రికా రంగం, సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన రామోజీ రావుకి టాలీవుడ్ స్టార్ హీరోలు.. సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. రామోజీ రావు గారి మరణం అత్యంత బాధాకరమని రామ్ చరణ్ అన్నారు. ఈ మేరకు ‘గేమ్ ఛేంజర్’ చిత్ర యూనిట్‌తో కలిసి నివాళులు అర్పించారు. అక్షర యోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు పవన్ కల్యాణ్ అన్నారు. రామోజీ రావు పేరు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని కళ్యాణ్ రామ్ పోస్టు చేశారు. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. తాను గౌరవించే స్ఫూర్తిదాయ వ్యక్తుల్లో రామోజీ ఒకరని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు. రామోజీ మరణం తీరని లోటని సినీ నటుడు రవితేజ కామెంట్ చేశారు.
ఆదివారం అంత్యక్రియలు
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్