తమిళంలో సూపర్‌హిట్ సాధించిన ‘ఓ మై కడవులే’ రీమేక్‌గా తెరకెక్కిన సినిమా “ఓరి దేవుడా” తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగులోనూ దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ లీడ్ రోల్స్‌లో నటించారు. తొలుత సినిమాకు “హే భగవాన్” అనే టైటిల్ అనుకున్నా, విశ్వక్ సేన్ గత సినిమాలు పాగల్, హిట్ ఇలా ఇంగ్లీష్ హిందీ పేర్లు ఉండటంతో ఈ సినిమా టైటిల్ పక్కా తెలుగులో ఉండాలని మేకర్స్ ఈ పేరు పెట్టారు. అయితే తమిళ సూపర్‌హిట్‌గా నిలిచిన “ఓ మై కడవులే” మ్యాజిక్ తెలుగులోనూ క్రియేట్ అయ్యిందా? రివ్యూలో చూద్దాం
కథేంటంటే
అర్జున్ ( విశ్వక్), అను ( మిథిలా పాల్కర్) చిన్నప్పటినుంచి స్నేహితులు. వీరిలో “ఈ నగరానికి ఏమైంది” వెంకటేశ్ కూడా ఒకడు. ఒకరోజు సడన్‌గా అను, అర్జున్‌కు ప్రపోజ్ చేస్తుంది. అయోమయంలోనే అర్జున్ ఓకే చెప్పేస్తాడు. చకచకా వారి పెళ్లయిపోతుంది. ఏడాది తిరగకుండానే విడాకులకు సిద్ధమవుతారు. అప్పుడే కథలో ట్విస్ట్. విక్టరీ వెంకటేశ్ ఎంట్రీతో విశ్వక్ లైఫ్ మారిపోతుంది. కథ మళ్లీ మొదట్నుంచి మొదలవుతుంది. అసలు అంత మంచి స్నేహితులు అంత త్వరగా విడిపోవడానికి కారణం ఏంటి? వీరి మధ్య వచ్చిన ఆ “మీరా” ఎవరు? దేవుడిగా వెంకటేశ్ విశ్వక్‌కి ఏం అవకాశమిచ్చాడు?. చివరికి ఏం జరుగుతుంది? ఇదంతా కథ. కామెడీ, రొమాన్స్, ఫీల్‌గుడ్ మూమెంట్స్‌తో కథ మొత్తం సాగుతుంది.
ఎలా ఉంది?
జీవితంలో ఏదైనా సంఘటన అలా కాకుండా ఇలా జరిగితే ఎలా ఉంటుంది? అని మనకు చాలాసార్లు అనిపిస్తుంది. అలాంటి కథాంశంతో తెరకెక్కినదే ఈ సినిమా. దానికి స్నేహం, ప్రేమ, ఆ రెండింటి మధ్య ఉన్న చిన్న గీతను ఎమోషనల్‌గా చూపించే ప్రయత్నమే “ఓరి దేవుడా”. ఫస్టాఫ్ చాలా సాఫీగా సాగుతుంది. కామెడీ అంత గొప్పగా లేకపోయినా ఆకట్టుకుంటుంది. అను, అర్జున్ పెళ్లి తర్వాత జరిగే సీన్లు ఫన్నీగా రాసుకున్నాడు. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది. అను, అర్జున్ మధ్య సీన్లు ఎమోషనల్‌గా బాగా పండాయి. మురళీ శర్మ, అర్జున్ మధ్య జరిగే ఓ సీన్ ఆకట్టుకుంటుంది. గతంలో పూరీ ‘దేవుడు చేసిన మనుషులు’ కూడా ఇలాంటి కాన్సెప్టే కానీ అందులో కథ లేకపోవడం వల్ల అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. కానీ ఇందులో అశ్వత్ మారిముత్తు…కథ చిన్నదే అయినా కథనంతో ఆకట్టుకున్నాడు. అర్జున్, మీరా మధ్య లవ్ ట్రాక్ కాస్త బోర్ కొట్టినట్టు అనిపించినా దానిని ఎక్కువ సేపు సాగదీయకుండా అశ్వత్ జాగ్రత్తపడ్డాడు.
నటీ నటుల పెర్ఫార్మెన్స్
సినిమాకు క్రేజీ సర్‌ప్రైజ్ విక్టరీ వెంకటేశ్. దేవుడిగా, స్టైలిష్ లాయర్‌గా ఆయన ఆకట్టుకున్నాడు. అలాగే రాహుల్ రామకృష్ణ కూడా మెప్పిస్తాడు. ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ వెంకటేశ్ కూడా తన పాత్ర మేరకు బాగా నటించాడు. మురళీ శర్మ ఎప్పటిలాగే తన పాత్రకు న్యాయం చేేశాడు. విశ్వక్ మాత్రం తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. సినిమా మొత్తం తన భుజాలపై మోసుకెళ్లాడు. అనుగా చేసిన మరాఠీ భామ మిథిలా పాల్కర్ కూడా చాలా బాగా చేసింది. తమిళంలో రితికా సింగ్ అంత కాకపోయినా తొలి సినిమా లాగా అనిపించలేదు. మిగతా పాత్రలు కూడా పరిధి మేరకు నటించారు.
సాంకేతిక బృందం
లియోన్ జేమ్స్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్. పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ బాగుంది. కేరళ అందాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు. విజయ్ ఎడిటింగ్ బాగుంది. సినిమా నేటివిటీకి తగ్గట్టుగా రావడంలో తరుణ్ భాస్కర్ సంభాషణలు బాగా ఉపయోగపడ్డాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరిగా
కామెడీ, ఎమోషన్స్‌తో భారీ కమర్షియల్ ఫైట్లు, డైలాగులు లేకుండా సాఫీగా సాగే సినిమా ‘ఓరి దేవుడా’. B,C సెంటర్ల ఆడియన్స్‌కు పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ యువత, ఫ్యామిలీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!