సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన ‘గార్గి’ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ, కన్నడలో ఈ మూవీ విడుదలైంది. కథ నచ్చడంతో తెలుగులో రానా, తమిళ్‌లో సూర్య దంపతులు, కన్నడలో రక్షిత్ శెట్టి ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. విడుదలకు ముందే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. గోవింద్ వసంత్ సంగీతం అందించాడు. మరి స్టోరీ ఎంటీ? మూవీ ఎలా ఉంది? తెలుసుకుందాం..
కథేంటంటే..
గార్గి (సాయిపల్లవి) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఒక స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగం చేస్తుంటుంది. ఆమె తండ్రి బ్రహ్మానందం(ఆర్ఎస్ శివాజి) ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటాడు. అయితే ఒకరోజు అపార్ట్‌మెంట్‌లో ఒక 9 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరుగుతుంది. దీంతో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న 60 ఏళ్ల వయసు ఉన్న బ్రహ్మానందంను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తన తండ్రి ఆ తప్పు చేయలేదని గట్టిగా నమ్మిన గార్గి ఎలాగైనా విడిపించాలని న్యాయ పోరాటానికి దిగుతుంది. మరి ఆమె పోరాటం ఫలించిందా? తండ్రిని బయటకు తీసుకొచ్చిందా? అత్యాచారం కేసులో అసలు దోషులు ఎవరో తెలియాలంటే సినిమా చూడాల్సిందే
విశ్లేషణ:
గార్గి ట్రైలర్‌లోనే తండ్రి కోసం కూతురు చేసే పోరాటం అని అర్థమైపోయింది. కానీ దాన్ని తెరపై ఎంత ఆసక్తిగా చూపించారన్నదే అసలు విషయం.రాసుకున్న కథన అంతే ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు రామచంద్రన్ విజయం సాధించాడు. ఎమోషనల్ కోర్టు డ్రామాగా సాగే ఈ కథలో సాయిపల్లవి సినిమాను తన భుజాలపై మోసింది. ఇటీవల ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, నిందితులతో పాటు బాధిత కటుంబాల్లో జరుగుతున్న సంఘర్షణ, మీడియా వారితో హద్దులు దాటి ఎలా ప్రవర్తిస్తుంది? ఇవన్నీ కళ్లకు కట్టినట్లుగా చూపించారు. దోషిగా ముద్రపడిన వ్యక్తి కుటుంబంపై సమాజం ఎలా వివక్ష చూపుతుంది? బాధిత కుటుంబసభ్యుల మనోవేదన ఎలా ఉంటుందో చెప్పారు. సినిమా ప్రారంభం నుంచే ఆసక్తికరంగా ఉంటుంది. గార్గి నేపథ్యాన్ని చూపించడం, ఆమె తండ్రిపై దోషి అని ముద్రపడటం ఇవన్నీ వేగంగా సాయిపతాయి. కాని గార్గి తండ్రి అరెస్ట్ తర్వాత కథ కాస్త నెమ్మదించినట్లుగా అనిపిస్తుంది. కోర్టురూమ్‌లో వాద ప్రతివాదాలు కాకుండా అక్కడ జరిగే సన్నివేశాలు చాలా సహజంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఊహించని విదంగా ఉంటుంది. ఒక ట్రాన్స్‌జెండర్‌ను జడ్జిగా పెట్టి ఈ కేసులో న్యాయం చెప్పించడం హైలెట్‌గా నిలుస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ఇటీవలే ‘విరాటపర్వం’ సినిమాలో తన నటనతో మెప్పించిన సాయిపల్లవి. ‘హీరోయిన్’కు కొత్త అర్థాన్ని చెప్పిన సాయిపల్లవి. గార్గిలో మరో బరువైన పాత్రలో ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. ఎమోషన్స్ చక్కగా పండించింది. ఇది ఆమె కెరీర్‌లో మరో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. ఇక లాయర్‌గా కాళివెంకట్, గార్గి తండ్రిగా ఆర్ఎస్ శివాజీ మంచి నటనను కనబరిచారు. ఇతర నటీనటుల పాత్రలు కూడా మెప్పించాయి
సాంకేతిక విషయాలు:
దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ చిన్న స్టోరీ లైన్‌ను సామాజిక అంశాలతో ముడిపెట్టి చెప్పడం చాలా బాగుంది. గోవింద్ వసంత్ మ్యూజిక్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. స్ట్రెయంతి, ప్రేమకృష్ణ సినిమాటోగ్రఫీ వాతావరణాన్ని చూపించింది. ఫఫీక్ మహ్మద్ అలీ ఎడిటింగ్ బాగుంది.
బలాలు:
- సాయిపల్లవి
- బీజీఎం
- క్లైమాక్స్
బలహీనతలు:
- నెమ్మదిగా సాగే కథనం