నేడు కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరీ కలిసి నటించిన సమ్మతమే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గోపినాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. కనకాల ప్రవీణ చిత్రాన్ని నిర్మించింది. ట్రైలర్, పాటలతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పాడ్డాయి. మరి మూవీ ఎలా ఉంది? స్టోరీ ఎంటో తెలుసుకుందాం.
కథేంటంటే..
కృష్ణ (కిరణ్ అబ్బవరం) చిన్న తనంలోనే తల్లిని కోల్పోతాడు. దీంతో తాను చేసుకోబోయే అమ్మాయి ఇంటికి మళ్లీ ఆ వెలుగును తీసుకురావాలని కోరుకుంటాడు. తన జీవితంలో నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా తిరుగుతుంటాడు. అప్పుడు శాన్వి(చాందిని చౌదరి) పరిచయం అవుతుంది. శాన్వీ ఆలోచనలు, కృష్ణ ఆలోచనలకు విరుద్ధంగా ఉంటాయి. ఆమె ఒక మోడ్రన్ సిటీ గర్ల్. కానీ కృష్ణ పల్లెటూరి నుంచి వచ్చిన అబ్బాయి. తాను చేసుకోబోయే అమ్మాయి ఇలానే ఉండాలని కొన్ని పరిమితులు పెట్టుకుంటాడు. కానీ అనుకోకుండా శాన్వీని చూసి ఇష్టపడతాడు. పెళ్లి తర్వాత ఎలాగైనా ఆమెను మార్చుకోవచ్చు అనుకుంటాడు. అప్పుడు వాళ్ల రిలేషన్‌షిప్‌లో గొడవలు ప్రారంభమవుతాయి. చివరికి ఏమైంది? ఎవరు మారారు? పెళ్లి చేసుకున్నారా లేదా అన్నదే కథాంశం.
విశ్లేషణ:
ఈ స్టోరీలైన్ చాలా చిన్నది. ఇద్దరు బిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తుల వాళ్ల రిలేషన్‌షిప్ ఎలా కొనసాగింది. వారికి ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి. చివరికి కలుసుకున్నారా లేక విడిపోయారా చెప్పే కథ. అయితే ఈ సినిమా చూస్తుంటే ఇది వరకు ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో కొత్త దనం లేదు, తెలిసిన కథే. అయితే హీరో, హీరోయిన్‌ల పాత్రలు చాలా బాగున్నాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. సినిమాలో అక్కడక్కడా కొన్ని సీన్లు మెప్పిస్తాయి. మొదటి బాగం కథ కాస్త బాగానే సాగినప్పటికీ, రెండో భాగంలో మొత్తం అదుపు తప్పుతుంది. కథను సాగదీసినట్లుగా అనిపించడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
పల్లెటూరి అబ్బాయిలా కిరణ్, సిటీ అమ్మాయిలా చాందినీ వారి పాత్రల్లో మెప్పించారు. ఎమోషనల్ సన్నివేశాల్లో కిరణ్ నటన ఆకట్టుకుంటుంది. హీరో సామర్ధ్యాన్ని డైరెక్టర్ పూర్తిగా వాడుకోలేదనిపిస్తుంది. చాందిని ఆమె పాత్ర మేరకు చక్కగా నటించింది. సిటీ గర్ల్‌లా సహజంగా కనిపించింది. సప్తగిరితో సహా ఇతర నటీనటులు వారి పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విషాయాలు:
డైరెక్టర్ గోపీనాథ్ రాసుకున్న స్టోరీ లైన్ మంచిదే అయినప్పటికీ దాన్ని తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. రెండో భాగంలో సినిమా మరీ సాగదీసినట్లు కనిపిస్తుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటర్ విప్లవ్ నైషాడం రెండో భాగంలో కత్తెరకు కాస్త పదును పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్లుగా ఉన్నాయి.
బలాలు:
కిరణ్ అబ్బవరం, చాందీనీ చౌదరి నటన
స్టోరీలైన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
బలహీనతలు:
రెండో భాగం సాగదీసినట్లుగా ఉండటం
స్క్రీన్‌ప్లే