నటీనటులు: అభివన్ గోమఠం, ప్రియదర్శి, చైతన్యకృష్ణ, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి, సీరత్ కపూర్, దర్శనా బానిక్, వేణు ఎల్డండి..
దర్శకత్వం: అరుణ్ కొత్తపల్లి
సంగీతం: అజయ్ అరసద
రచన & నిర్మాత: మహి వి రాఘవ్
స్ట్రీమింగ్ వేదిక : డిస్నీ + హాట్‌స్టార్
విడుదల తేదీ: 15-03-2024
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ హీరోలుగా నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers). అరుణ్ కొత్తపల్లి దర్శకత్వంలో గతేడాది విడుదలైన ఈ సిరీస్.. ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ కూడా వచ్చింది. ‘సేవ్ ద టైగర్స్ 2’ (Save The Tigers 2) పేరుతో డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ప్రీక్వెల్ లాగానే అందర్నీ నవ్వించిందా? అనేది ఈ (Save The Tigers 2 OTT Review) రివ్యూలో తెలుసుకుందాం.
కథ
‘సేవ్ ద టైగర్స్’ ఫస్ట్ సీజన్ ముగిసిన చోటు నుంచి సీజన్ 2 మొదలైంది. హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్ ) కనిపించకుండా పోతుంది? ఆమె కిడ్నాప్ వెనకాల గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ) రాహుల్ (అభినవ్ గోమఠం) ఉన్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తారు. కనిపించకుండా పోయిన హంసలేఖను వీళ్లే మర్డర్ చేసారంటూ పలు న్యూస్ ఛానెల్స్ సైతం అనుమానం వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది? హంసలేఖతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి? విక్రమ్, రవి, రాహుల్ భార్యలు తమ భర్తలను ఎందుకు అనుమానించారు? వారు స్పందన (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకు వెళ్లారు? ఆ మూడు జంటల మధ్య గొడవకు కారణం ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ… ముగ్గురి నటన బాగుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ప్రియదర్శి అద్భుతంగా నటించాడు. హావభావాలను చక్కగా వ్యక్తపరిచాడు. అటు అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఎప్పటిలాగే ఇందులోనూ ఆకట్టుకుంటుంది. ఇక రాహుల్ పాత్రలో చైతన్యకృష్ణ జీవించాడు. మరోవైపు ఫీమేల్ లీడ్ పాత్రల్లో జోర్దార్ సుజాత, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి అదరగొట్టారు. తమ క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. హంసలేఖగా సీరత్ కపూర్ చక్కగా చేసింది. భార్యాభర్తలుగా సత్యకృష్ణ, వేణు ఎల్దండి సన్నివేశాలు నవ్విస్తాయి. దర్శనా బానిక్ పాత్ర నిడివి తక్కువే అని సిరీస్‌పై ఆమె ప్రభావం కనిపిస్తుంది. గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి తదితరులు తమ పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘సేవ్ ద టైగర్స్ 2’లో మహి వి రాఘవ్ రచన.. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం ఆకట్టుకుంటుంది. కళ్లతో చూసేది ప్రతీది నిజం కాదన్న అంతర్లీన సందేశంతో ఈ సిరీస్ సాగుతుంది. టీవీ ఛానెళ్లలో మనం రెగ్యులర్‌గా చూసే వైరల్ న్యూస్.. దానికి ప్రతిగా ప్రజల నుంచి వచ్చే స్పందనను డైరెక్టర్ ఎంతో సెటైరికల్‌గా చూపించాడు. సిరీస్‌లోని మెుదటి మూడు ఎపిసోడ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్ చక్కగా కుదిరాయి. నాలుగో ఎపిసోడ్‌లో 10000 BC ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. వివాహ వ్యవస్థ పుట్టుక వెనుక చెప్పిన కథ ఆకట్టుకుంది. ప్రియదర్శి – సుజాత, చైతన్యకృష్ణ – దేవియాని శర్మ మధ్య సన్నివేశాలు చాలా జంటలకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఓవరాల్‌గా ‘సేవ్ ద టైగర్స్ 2’… సిరీస్ నవ్విస్తుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయవద్దని డైరెక్టర్ ఈ సిరీస్ ద్వారా మంచి సందేశం ఇచ్చారు.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Save The Tigers 2 OTT Review).. అజయ్ అరసద అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్లు సరిగ్గా సరిపోయింది. కెమెరా విభాగం చక్కటి పనితీరు కనబరిచింది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిపెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఖర్చు దగ్గర వెనకాడినట్లు ఎక్కడా కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
- ప్రధాన తారాగణం నటన
- కామెడీ
- సమకాలిన అంశాలను ప్రతిబింబించే సీన్లు
మైనస్ పాయింట్స్
- కొన్ని సాగదీత సన్నివేశాలు
- ఎడిటింగ్
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!