తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు సంబరాల్లో మునిగిపోతుంటే.. తక్కువ వచ్చిన వారు మాత్రం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇక తమకు భవిష్యత్తే లేదన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. క్షణికావేశంలో ఎంతో విలువైన ప్రాణాలను హరించేసుకుంటున్నారు. ఇటీవల ఏపీలో 9 మంది ఇంటర్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చారు. అసలు ఆత్మహత్యకు ముందు విద్యార్థుల ఆలోచన తీరు ఎలా ఉంటుంది? ఎలాంటి ఆలోచనలు ఆత్మహత్యకు పురిగొల్పుతాయి? వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
గుర్తించడం ఎలా
సాధారణంగా సున్నిత మనస్తత్వం, తీవ్ర ఒత్తిడి, డిప్రెషన్‌తో ఉండే విద్యార్థుల్లో ఆత్మహత్య ఆలోచనలు అధికంగా వస్తున్నట్లు నిపుణుల అధ్యయనంలో తేలింది. అలాంటి వారు ప్రతీ విషయాన్ని చాలా డీప్‌గా తీసుకుంటారని మానసిక నిపుణులు సైతం చెబుతున్నారు. ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరి తనాన్ని ఇష్టపడటం, నిరాశా నిస్పృహలు, ప్రతి విషయం గురించీ ప్రతికూలంగా ఆలోచించటం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్లా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం, ఎవరితోనూ మాట్లాడకపోవడం వంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, అతను/ఆమె ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి.
ఎలా బయటపడాలి
పైన చెప్పినటువంటి ఆలోచనలు మీలోనూ కలిగితే వాటి నుంచి త్వరగా బయటపడేందుకు యత్నించాలి. ఒంటరిగా ఉండటం మాని తమ ఆలోచనలను వేరే వాటిపైకి మళ్లించే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో మరింత అప్యాయంగా ఉండాలి. అప్పుడే వారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమై చెడు ఆలోచనలు ఆటోమేటిక్‌గా దూరమవుతాయి. అప్పటికీ అదే ఫీలింగ్ ఉంటే స్నేహితులతో కలిసి సరదాగా ఏదైనా ట్రిప్‌కు వెళ్తే మంచింది. కొత్త ప్రాంతాలు, వ్యక్తులను కలిసినప్పుడు మనసుకు కూడా ప్రశాంతత చేకూరుతుంది. అప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకుంటే మానసిక వైద్యుడ్ని కలిసి తమ సమస్య ఏంటో చెప్పాలి. వారి ఇచ్చే విలువైన సలహాలు, సూచనలు ద్వారా చెడు ఆలోచనల నుంచి త్వరగా బయటపడొచ్చు.
ఇన్స్పైరింగ్ మూవీస్
ఈ రోజుల్లో వ్యక్తులు, సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇన్స్పైరింగ్ సినిమాలు చూడటం వల్ల త్వరగా ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడొచ్చు. ప్రాణం, జీవితం విలువను తెలియజేసే చిత్రాలను చూడటం ద్వారా తమలో చెడు ఆలోచనలు ఎప్పటికీ రాకుండా రూపుమాపే ఛాన్స్ ఉంది. విద్యార్థులు కచ్చితంగా చూడాల్సిన టాప్-5 సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
1. ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్
2006లో రిలీజైన ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ (The Pursuit of Happiness) అనే హాలీవుడ్ చిత్రాన్ని ప్రతీ ఒక్క విద్యార్థి తప్పనిసరిగా చూడాలి. ఈ సినిమా తమ ఆలోచనా విధానంలో కచ్చితంగా మార్పు తీసుకొస్తుంది.
2. 3 ఇడియట్స్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 3 ఇడియట్స్ (3 Idiots) సినిమా కూడా చెడు ఆలోచనల నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది. చదువు జ్ఞానం కోసం మాత్రమేనని అదే జీవితానికి సరస్వం కాదన్న సందేశం ఈ సినిమాలో ఉంది.
3. గుడ్ విల్ హంటింగ్
హాలీవుడ్ చిత్రం గుడ్‌విల్ హంటింగ్ (Good Will Hunting) కూడా ఓ మంచి ఇన్స్పైరింగ్ సినిమా. విద్యార్థుల్లో నిగూడంగా టాలెంట్‌ను ఎలా గుర్తించాలో ఈ చిత్రంలో చూపించాడు. ప్రతీ ఒక్కరికీ ఏదోక టాలెంట్ ఉంటుందని ఈ సినిమా తెలియజేస్తోంది.
4. లైఫ్ ఆఫ్ పై
లైఫ్ ఆఫ్ పై (Life of Pi) సినిమాను కూడా ఓ చక్కటి సందేసం రూపొందించారు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొవాలని ఈ సినిమా చెబుతోంది. సముద్రంలో పులితో చిక్కుకుపోయిన ఓ యువకుడి కథే ఈ సినిమా
5. తారే జమీన్ పర్
అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో చేసిన ‘తారే జమీన్ పర్’ (Taare Zameen Par) కూడా ఓ చక్కటి సందేశం ఉన్న సినిమా. అధ్యాపకుడు, ఓ విద్యార్థి చుట్టూ తిరిగే చిత్రం ఇది. ఈ సినిమా మీ ఆలోచనా ధోరణిని కచ్చితంగా మారుస్తుంది.