నటీనటులు : హర్ష చెముడు, దివ్య సరిపడ, చైతు బాబు
రచన & దర్శకత్వం : కళ్యాణ్ సంతోష్
సంగీతం : సాయి చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : దీపక్ ఎరగేరా
ఎడిటర్ : కార్తిక్ ఉన్నవ
నిర్మాతలు : రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు
విడుదల తేదీ : 23-02-2024
హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో (Sundaram Master Review) నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (Ravi Teja), సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా హర్ష మెప్పించాడా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సుందరం మాస్టర్ (వైవా హర్ష) గవర్నమెంట్ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఏరియా ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) ఇంగ్లీష్ నేర్పడం కోసం అతడిని మిర్యాలమెట్ట అనే గ్రామానికి పంపుతాడు. 90 ఏళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఆ ఊరిలో ఓ విలువైన వస్తువు ఉందని.. దాన్ని తీసుకురావాలని సూచిస్తాడు. ఆ మిస్టరీ గ్రామానికి వెళ్లిన సుందరం మాస్టర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఊరికి బ్రిటిష్ వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి? అక్కడి మనుషులు ఎలా ఉన్నారు? తను వెళ్లిన పనిని సుందరం పూర్తి చేశాడా? లేదా? అసలు దివ్య శ్రీపాద పాత్ర ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే?
కామెడీతో ఇన్నాళ్లు మెప్పించిన వైవా హర్ష (Sundaram Master Review).. ఈ సినిమాలో కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌ని బాగా పండించాడు. హర్ష మాత్రమే ఈ పాత్రకి బాగా సూట్ అవుతాడు అనేలా చేసాడు. దివ్య శ్రీపాద ఆ ఊర్లో ఓ అనాధ పిల్లగా బాగా నటించింది. ఇక ఆ ఊర్లో ఉన్న జనాలుగా నటించిన ఆర్టిస్టులు అంతా అదరగొట్టేశారనే చెప్పొచ్చు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ ఎంచుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. కథనం కూడా ఆయన ఆసక్తికరంగా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు. ముఖ్యంగా అడవులు, జలపాతం మధ్యలో ఉన్న చిన్న ఊరును ఆయన చాలా అందంగా చూపించాడు. గ్రామస్తులకు ఇంగ్లీష్ నేర్పే క్రమంలో సుందరం మాస్టర్ పడ్డ కష్టాలు ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ముందు వరకు నవ్వించిన సుందరం మాస్టర్‌ను తర్వాత డైరెక్టర్ సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్లాడు డైరెక్టర్. సెకండాఫ్ అంతా ఫిలాసఫీ చూట్టూ తిప్పారు. ఆ సన్నివేశాలను డీల్ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్ అంతా సరదా సరదా సన్నివేశాలతో నడిపించి.. సెకండాఫ్‌లో మాత్రం డైరెక్టర్ నిరాశపరిచాడు.
టెక్నికల్‌గా
ఈ సినిమా సాంకేతిక విభాగం అద్భుత పనితీరు కనబరిచింది. ఊరిని అద్భుతంగా డిజైన్ చేసిన ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. సాయి చరణ్ పాకాల ఇచ్చిన సంగీతం, దీపక్ ఎరగేరా కెమెరా వర్క్ ఆకట్టుకుంటాయి. ఇక నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు. నిర్మాణ విషయంలో కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచిగా తీసినట్టు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
- హర్ష నటన
- కామెడీ
- సంగీతం
మైనస్ పాయింట్స్
- పసలేని క్లైమాక్స్
- లాజిక్‌కు అందని సీన్లు