నటీనటులు : శ్రీవిష్ణు, రితూ శర్మ, దక్ష నగర్కర్, మీరా జాస్మిన్, సునీల్, గెటప్ శ్రీను, రవి బాబు, గోపిరాజు రమణ, శరణ్య ప్రదీప్ తదితరులు
రచన, దర్శకత్వం : హసిత్ గోలి
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్
ఎడిటింగ్: విప్లవ్
నిర్మాత : టి. జి. విశ్వప్రసాద్
విడుదల తేదీ: 04-10-2024
వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ (Swag Movie) ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) వంటి సూపర్ హిట్ తర్వాత హసిత్ గోలి (Hasith Goli) దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇందులో రీతూవర్మ (Ritu Varma), మీరా జాస్మిన్ (Meera Jasmine), దక్ష నగర్కర్ (Daksha Nagarkar) కథానాయికలుగా చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? శ్రీవిష్ణు-హసిత్ గోలి కాంబోకు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
శ్వాగనిక వంశానికి సంబంధించి కథ సాగుతుంది. 1550 ప్రాంతంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగ, ఆడవారి మధ్య ఆధిపత్య తగాదాలు ఉండేవి. భవభూతి మహారాజు (శ్రీవిష్ణు) తన సతీమణి(రీతువర్మ)ని గుప్పెట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేసి అందులో విజయం సాధిస్తాడు. అప్పటి నుండి రాజ్యంలోని మహిళలు అంతా అతని ఆధీనంలో ఉంటారు. ఇక అతని తర్వాతి సంతతిలో యభూతి (శ్రీవిష్ణు)కి వరుసగా ఆడపిల్లలు పుడతారు. తర్వాత మగపిల్లలు కవలలుగా పుడతారు. కానీ, తన స్నేహితుడు(సునీల్)కి మగపిల్లలు లేరని తన ఇద్దరి పిల్లల్లో ఒకరిని దానం చేసేస్తాడు. కాలక్రమేణా శ్వాగనిక వంశానికి చెందిన వారు చెల్లాచెదురు అవుతారు. కట్ చేస్తే శ్వాగనిక వంశానికి చెందిన సంపద ఓ చోట భద్రంగా ఉంటుంది. ఆ వంశానికి చెందిన వారసుడికి అది ఇవ్వాలని నిర్ణయిస్తారు. ఈ క్రమంలో తామే శ్వాగనిక వంశానికి చెందినవారమంటూ కొందరు వస్తారు. ఇంతకీ వారు ఎవరు? సంపద వారికి దక్కిందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
యువ నటుడు శ్రీవిష్ణు తన నటనతో అదరగొట్టాడు. భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగ వంటి ఐదు పాత్రల్లో అతడు కనిపించాడు. యభూతి పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడు. భవభూతి పాత్రతో నవ్విస్తూ ఆకట్టుకున్నాడు. రీతూవర్మ కూడా తన పర్ఫామెన్స్‌తో మెప్పించింది. 11 ఏళ్ల తర్వాత తెలుగు తెరపై రీఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ తన నటనతో పర్వాలేదనిపించింది. దక్షా నగర్కర్ తన గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టేసింది. నటనకు పెద్దగా స్కోప్ లభించలేదు. రవి బాబు, సునీల్, గెటప్ శ్రీను వంటి నటులు ఉన్నప్పటికీ సినిమా మెుత్తం శ్రీవిష్ణు మీదనే తిరగడంతో వారి పాత్రలు హైలేట్ కాలేదు. మిగిలిన పాత్రదారులు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు హసిత్ గోలి ఎంపిక చేసుకున్న పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ చాలా గందరగోళంగా అనిపిస్తుంది. తొలి అర్ధభాగంలో దాదాపు 40 నిమిషాల వరకు కథేంటో తెలీదు. ఆ టైంలో వచ్చే కామెడీ కాస్త ఊరటనిస్తుంది. భవభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆసక్తిగా చూపించి కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్. ఇంటర్వెల్ బ్లాక్ గజిబిజిగా అనిపించినా ఓకే అనిపిస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ విషయానికి వస్తే యభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నవ్వించేలా ఉన్నాయి. కానీ క్లైమాక్స్ మళ్ళీ గందరగోళంగానే ముగుస్తుంది. ‘లింగ వివక్ష అనేది సమాజానికి చీడ’ అన్నట్టు ఓ లైన్‌తో ముగించారు దర్శకుడు. అయితే అర్దాంతరంగానే సినిమా ముగిసిన భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యుజింగ్‌గా అనిపిస్తుంది. సినిమా మెుత్తం పూర్తి ఏకాగ్రతతో చూస్తే తప్ప అర్ధమయ్యేలా లేదు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే వివేక్ సాగర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌గా మారాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్డెట్ తక్కువే అయినా మంచి రిచ్ ఔట్‌పుట్‌ను అందించారు.
ప్లస్ పాయింట్స్
- కథ
- శ్రీవిష్ణు నటన
- కామెడీ
మైనస్ పాయింట్స్
- కన్ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే
- స్లో నేరేషన్