బాక్సింగ్ ప్రపంచంలో భారత్ సత్తా చాటి తెలుగువారికి గర్వకారణంగా నిలిచిన ‘నిఖత్ జరీన్’ నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా యూసే నిఖత్‌కు శుభాకాంక్షలు చెబుతోంది. 1996లో తెలంగాణలోని నిజామాబాద్‌లో జన్మించిన నిఖత్ జరీన్ చిన్నప్పటి నుంచే ఆటలపై మక్కువ పెంచుకుంది. మొదట్లో ‘ఆడపిల్లవు బాక్సింగ్ చేస్తావా? మగాళ్లలా ఆటలాడతావా?’ అంటూ చాలా హేళన చేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా తండ్రి ప్రోత్సాహంతో ధైర్యంగా అడుగేసి నేడు ప్రపంచ చాంపియన్ గా ఎదిగింది.
బాక్సింగ్ ప్రయాణంలో తొలి అడుగులు
చిన్నప్పుడు నిఖత్ రోజూ ఉదయాన్నే నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్స్ కు వెళ్లి సాధన చేసేది. ఓ సారి నిఖత్ వాళ్ల నాన్న స్నేహితుడు ఆమె ఆటను దగ్గరగా చూసి ‘నిఖత్‌ను బాక్సింగ్ శిక్షణలో చేర్పించు ఏడాదిలోగా జాతీయ క్రీడాకారిణిని చేస్తా’ అనడంతో 2009లో ఆమె బాక్సింగ్ ప్రయాణం మొదలైంది. జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆడుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బల్గేరియాలో జరిగిన 73వ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో 52 కేజీల విభాగంలోనే స్వర్ణ పతకం గెలుచుకుంది. జూనియర్ స్థాయిలో ఆమెకి రెండో స్ట్రాంజా టోర్నమెంట్ పతకం వచ్చింది. 2019లోనూ బంగారు పతకం కైవసం చేసుకుంది. 2011 జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ లోనూ స్వర్ణం గెలుచుకుంది.
ప్రపంచ చాంపియన్‌గా ఆవతరణ
ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడం ద్వారా నిఖత్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. 52కేజీల విభాగంలో బంగారు పతకం సాధించి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగమ్మాయిగా రికార్డు నమోదు చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఐదో బాక్సర్‌గా చరిత్రకెక్కింది. అంతకుముందు మేరీ కొమ్, సరితా దేవి, జెన్నీ, లేఖ కేసీ మాత్రమే బంగారు పతకాలు సాధించారు.
మేరీ కొమ్, నిఖత్ మధ్య వివాదం
2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు నిఖత్, మేరీ కోమ్ మధ్య వివాదం చెలరేగింది. ట్రయల్స్ నిర్వహించకుండా నేరుగా ఒలింపిక్స్‌కు ఎలా పంపిస్తారని నిఖత్ ప్రశ్నించడంతో మేరీకొమ్ ఆగ్రహానికి గురైంది. పరస్పర ఆరోపణల మధ్య ఎట్టకేలకు వీరికి ట్రయల్స్ నిర్వహించారు. మేరీ కొమ్ గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం నిఖత్‌తో చేయి కలపడానికి కూడా మేరీ కొమ్ ఇష్టపడలేదు. ‘నీ సత్తా ఏంటో రింగ్‌లో నిరూపించుకో..అంతేకానీ బయట కాదు’’ అని మేరీ కోమ్ అప్పుడు వ్యాఖ్యానించింది. అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపింది. నిఖత్ కూడా మేరీ కోమ్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది.
ఒలింపిక్ పతకమే తరువాయి
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్… కామన్వెల్త్ క్రీడల బెర్తు కూడా ఖాయం చేసుకుంది. 50 కేజీల విభాగంలో ఆమె అదరగొట్టింది. ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని నిఖత్ చెబుతోంది. నిఖత్ జరీన్ లక్ష్యం నెరవేరాలని ఆశిస్తూ… మరోసారి రింగ్ సింవగికి జన్మదిన శుభాకాంక్షలు..