• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బతుకమ్మ స్పెషల్: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బతుకమ్మ పాటలు ఇవే!

    బతుకమ్మ అంటేనే పూల పండుగ. ఏ ఆడబిడ్డ చేతిలో చూసినా బతుకమ్మే. ఏ గాత్రం నుంచి వచ్చినా బతుకమ్మ పాటే. ఏ కంట చూసినా బతుకమ్మ ఆటే. తెలంగాణ వచ్చినంక బతుకమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఈ పండుగపై రూపొందిన ప్రత్యేక పాటలు అశేష ఆదరణ పొందాయి. యూట్యూబ్‌లో సినిమా పాటలను తలదన్ని రికార్డులు సృష్టించాయి. మిలయన్లలో వ్యూస్‌ని సొంతం చేసుకుని.. బతుకమ్మకు అంకితం చేశాయి. మరి, ఆ పాటలేంటో ఓసారి చూసేద్దామా..!

    ఆల్ టైం ఫేవరేట్..

    బతుకమ్మ వచ్చిందంటే చాలు.. ఈ పాట తప్పకుండా యాదికొస్తుంది. అదే.. మంగ్లీ పాడిన.. ‘తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి.. లోకమంతా తిరిగేవటే..’ సాంగ్. తెలంగాణ కీర్తికి అద్దం పట్టేలా ఈ పాటను రూపొందించారు. చాలా కలర్‌ఫుల్‌గా ఈ గేయం సాగుతుంది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో చిత్రీకరించడంతో ప్రతి పౌరుడికి కనెక్ట్ అయింది. మిట్టపల్లి సురేందర్ లిరిక్స్‌కి మంగ్లీ వాయిస్ తోడవడంతో మ్యాజిక్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఏకంగా 9.4కోట్ల వ్యూస్‌ని కొల్లగొట్టి.. బతుకమ్మ పాటల్లో ఆల్‌టైమ్ ఫేవరేట్‌గా నిలిచింది. 2017లో విడుదలైన ఈ పాట.. ఇప్పటికీ మార్మోగుతోంది.

    Latest Bathukamma Song by Mangli | Saketh | Presented by MicTv

    తీన్మార్ బతుకమ్మ..

    తనదైన శైలిలో ఏటా ప్రత్యేక పాటలను రూపొందిస్తూ.. ప్రజలకు చేరువైంది వీ6 ఛానల్. బతుకమ్మపై ప్రత్యేక శ్రద్ధ వహించి తీసిన పాటలు ఇప్పటికీ ఫోన్లలో మోగుతున్నాయి. అందులో మొదటగా నిలిచేది.. 2015లో విడుదలైన బతుకమ్మ పాట. చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్కా బతుకమ్మా అంటూ సాగే ఈ పాట అప్పట్లో ఉర్రూతలూగించింది. ఊరూవాడా అంతా మారుమోగిపోయింది. బొబ్బిలి సురేష్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. తేలు విజయ గాత్రం అందరినీ మైమరిపించింది. ఇప్పటివరకు ఈ పాటకు యూట్యూబ్‌లో 7కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయంటే.. ఎంతలా ఫేమస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. 

    తెలంగాణ జాగృతి సమర్పణలో..

    బతుకమ్మ పండుగను ప్రపంచమంతటా జరపుకునేలా ప్రోత్సహిస్తూ వచ్చిన స్వచ్ఛంద సంస్థ తెలంగాణ జాగృతి. ఈ సంస్థ సమర్పణలో వచ్చిన పాట ఎంతో మంది మెప్పు పొందింది. డా.నందిని సిధారెడ్డి సాహిత్యానికి.. మంగ్లీ గానం తోడై మరపురాని పాటగా రూపుదిద్దుకుంది. 2018లో విడుదలైన ఈ సాంగ్ ఇప్పటివరకు 4కోట్లకు పైగా వ్యూస్‌ని దక్కించుకుంది. ‘కురిసే వానలతో.. వాగులన్నీ పారినయీ.. సిరుల చెరువులతో.. బావులన్నీ నిండినయీ’ అంటూ ఈ పాట సాగుతుంది.

    #BathukammaSong2018 by Mangli | Latest Bathukamma Song | MicTv.in

    పచ్చిపాల వెన్నెల..

    మిట్టపల్లి సురేందర్ లిరిక్స్‌కి మరోసారి ప్రాణం పోస్తూ మంగ్లీ ఆడిపాడిన పాట.. ‘పచ్చిపాల వెన్నెలా.. నేలన పారబోసినట్టు పూసెనే.. గునుగు పూల తోటలు’ సాంగ్. 2019లో మంగ్లీ పాడిన రెండో బతుకమ్మ పాట ఇది. సినిమా స్థాయికి ఏ మాత్రం తీసిపోకుండా ఈ పాటను చిత్రీకరించారు డైరెక్టర్ దాము రెడ్డి. ఇప్పటివరకు యూట్యూబ్‌లో 4కోట్ల వీక్షణలకు చేరువైంది. బతుకమ్మ పండుగను గుర్తు చేస్తూ సాగే ఈ పాట చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

    బతుకమ్మ వచ్చింది కోల్..

    వీ6 ఛానల్ రూపొందించిన ‘బతుకమ్మ వచ్చింది కోల్.. బాధల్ని బాపుద్ది కోల్.. గుండెలతో దండోరేయండోయ్’ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2016లో విడుదలైన ఈ పాట అంచనాలకు మించి రాణించింది. బతుకమ్మ అంటేనే బంధాల నిచ్చెన అని రుజువు చేసింది. భోలే శావలి స్వరాలు సమకూర్చి.. ఆలపించిన ఈ పాటకు సంగీత అభిమానులు ఫిదా అయ్యారు. యూట్యూబ్‌లో 3.45కోట్ల వ్యూస్‌ని సంపాదించిందీ సాంగ్.

    V6 Bathukamma Song 2016 || V6 Special

    ఘల్లుఘల్లున అంటూ..

    వీ6 ఛానల్ రూపొందించిన పాటతో పోటీగా యూట్యూబ్‌లో ప్లే అయిన పాట.. ‘ఘల్లు ఘల్లున’. 6టీవీ ఛానల్ ఈ పాటను రూపొందించింది. వెన్నల శ్రీనాధ్ రచించిన ఈ గేయానికి.. యశో కృష్ణ సంగీతం అందించారు. వాణి కిశోర్‌తో కలిసి యశో పాటను ఆలపించారు. ఈ వీడియో జనాలకు చేరువయింది. దీంతో 2.8కోట్ల వీక్షణలను సొంతం చేసుకుంది. 2016లో ఎక్కువగా సందడి చేసిన బతుకమ్మ పాటల్లో ఒకటిగా నిలిచింది.

    6tv Bathukamma Song | Vani Vollala | Yasho Krishna | Chandu Thooti | 6tv

    ప్రక‌ృతి అంటే బతుకమ్మ..

    ‘తెలంగాణ జాతి ఆత్మ బతుకమ్మ.. మా పిడికిట్ల వరిబువ్వ మెతుకు గౌరమ్మా’ అంటూ సాగే పాట కూడా యూట్యూబ్‌లో మంచి పేరు సంపాదించింది. కైలాష్ ఖైర్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను వీ6 రూపొందించింది. 2.3కోట్ల వ్యూస్‌ని సంపాదించుకుని ప్రజలకు చేరువైంది. 2017లో విడుదలైన ఈ పాటను విడుదల చేశారు.

    V6 Bathukamma Song 2017 || V6 Special

    ఇవే కాకుండా.. ఇంకా చాలా పాటలు బతుకమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ రూపుదిద్దుకున్నాయి. ఇంకా మన ముందుకు రాబోతున్నాయి. మరి ఈ పాటల్లో మీకు నచ్చిన పాటేంటో మాతో పంచుకోండి. మీకు తెలిసిన దోస్తులకు షేర్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv