భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు ఊపందుకుంది. పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటీలు/ బైక్స్ తక్కువ ధరలో ఉండటం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం ఉండటంతో ఈవీ స్కూటర్ల కొనుగోళ్లు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. దీంతో ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థలు అధునాతన ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని EV బైక్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. త్వరలో రానున్న టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
Kinetic e-Luna
ద్విచక్ర వాహన ప్రియులకు, ముఖ్యంగా చిరువ్యాపారులకు ఎంతో ఇష్టమైన ‘లూనా’ త్వరలోనే ఎలక్ట్రిక్ లూనాగా (Kinetic E Luna) మార్కెట్లోకి రాబోతోంది. ఈ నెల 30న ఈ స్కూటీ రిలీజ్ కానుంది. దీని ధర రూ.80,000 వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బైక్ ఫీచర్లు, ప్రత్యేకతలను రిలీజ్ రోజే కంపెనీ రివీల్ చేయనుంది.
Lectrix EV LXS G 3.0
లెక్ట్రిక్స్ (Lectrix) కంపెనీ సైతం ఈ నెలాఖరున (సెప్టెంబర్ 30) ఈవీ స్కూటర్‌ను రిలీజ్ చేయనుంది. Lectrix EV LXS G 3.0 పేరుతో దీన్ని తీసుకురానుంది. 3 Kwh బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ స్కూటీకి అందించారు. దీని టాప్ స్పీడ్ 60 km/hr కాగా, Motor Power 2200గా ఉండనున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 80-105 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. దీని ధర రూ. 1.21 లక్షలు (Ex-showroom) ఉండొచ్చని సమాచారం.
Hero Electric AE-47 E-Bike
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో (Hero) నుంచి అక్టోబర్‌లో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ రిలీజ్ కానుంది. ‘Hero Electric AE-47 E-Bike’ పేరుతో వాహన ప్రియులకు పరిచయం కానుంది. Motor Power(w) 4000, డిజిటల్ కన్‌సోల్‌ను ఈ బైక్ కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ బైక్ రూ. లక్ష వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Trouve Motors Electric Bike
అక్టోబర్‌లో ట్రౌవ్ మోటర్స్ నుంచి పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ విడుదల కానుంది. Trouve Motors Electric Bike పేరుతో ఈ స్పోర్ట్స్ లుక్ బైక్ మార్కెట్‌ను పలకరించనుంది. దీని ధర రూ.10 లక్షల వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఈ బైక్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 350-500 కిలో మీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 200 కిలోమీటర్లు. ఇది కేవలం 3 సెకన్లలోనే 0 నుంచి 100 Kmph వేగాన్ని అందుకోగలదు.
SVITCH CSR 762
అక్టోబర్‌లో రానున్న మరో పవర్‌ఫుల్ బైక్ ‘SVITCH CSR 762’. ఇది 3.7 Kwh బ్యాటరీ, Motor Power 3000ను కలిగి ఉంది. బైక్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకూ ఎలాంటి ఢోకా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ బైక్ గరిష్ట వేగం 110 km/hrగా ఉంది. దీని ప్రైస్ రూ.1.65 లక్షలు ఉండవచ్చని అంచనా.
Gogoro 2 Series
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అతి త్వరలోనే భారత మార్కెట్‌లో రిలీజ్ కానుంది. దీని బరువు 122 కేజీలు కాగా, Motor Power 7000గా ఉంది. డబల్ డిస్క్ బ్రేక్, ట్యూబ్‌లెస్ టైర్లతో ఇది రానుంది. ఈ బైక్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్లు నిరాటంకంగా ప్రయాణించవచ్చు. దీని వెల రూ.1.5 లక్షలు ఉండొచ్చని సమాచారం.
Revamp Moto RM Mitra
ఈ ఎలక్ట్రిక్ బైక్ కూడా భారతీయ మార్కెట్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ బైక్ ఫీచర్లకు సంబంధించి పూర్తి సమాచారం లేనప్పటికి పవర్‌ఫుల్ బ్యాటరీతో ఇది రానున్నట్లు తెలుస్తోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని లీకైన సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది. ఇక దీని గరిష్ట వేగం 65 km/hrగా ఉండనుంది. ట్యూబ్‌లెస్ టైర్లతో ఇది రానుంది. Revamp Moto RM Mitra ప్రైస్ రూ. 1.06 లక్షలు ఉండొచ్చని అంచనా.