నటీనటులు : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్ తదితరులు
దర్శకుడు : టీజీ జ్ఞానవేల్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ : ఎస్. ఆర్. ఖదీర్
నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత: సుభాస్కరన్ అల్లిరాజా
విడుదల తేదీ: అక్టోబర్ 10, 2024
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా ‘వేట్టయన్ – ద హంటర్’ (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే తెలుగు టైటిల్‌లోనూ తమిళ పేరే పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి వాటిని తట్టుకొని ఈ సినిమా పాజిటివ్ టాక్ సాధించిందా? ‘జైలర్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రజనీకి మరో సాలిడ్ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
పోలీసు ఆఫీసర్ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పటిలాగే ఇందులో అద్భుతమైన నటన కనబరిచారు. మాస్ మూమెంట్స్, హీరోయిజం, ఎలివేషన్స్‌తో ఆయన పాత్ర కన్నుల పండుగగా అనిపిస్తుంది. ముఖ్యంగా రజనీ డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ ఆడియన్స్‌ను బాగా మెప్పిస్తాయి. ఇక రజనీకి ధీటైన పాత్రలో అమితాబ్ బచ్చన్ అదరగొట్టారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తాయి. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా ఫహాద్ ఫాజిల్ పాత్ర ఆకట్టుకుంటుంది. ఓవైపు నవ్విస్తూనే తన నటనతో ఫహాద్ మెప్పించాడు. అటు దగ్గుబాటి రానా, దుషారా విజయన్‌లకు సైతం మంచి పాత్రలే దక్కాయి. తమ నటనతో వారు ఎంతో సర్‌ప్రైజ్ చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘జై భీమ్’ వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ ‘వేట్టయన్’తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్ కోరుకునే మాస్ మూమెంట్స్, హీరోయిజం ఎలివేషన్స్, కమర్షియల్ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్ అయ్యింది. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్. రజనీకాంత్ ఇంట్రడక్షన్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్, శరణ్య రేప్ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అయితే కథనం నెమ్మదిగా సాగడం, ఊహాకందేలా స్టోరీ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. కానీ, అమితాబ్ బచ్చన్ – రజనీ మధ్య వచ్చే సీన్స్ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్, ఫహాద్ ఫాజిల్, రానా వంటి స్టార్ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథకు కమర్షియల్ లుక్ తీసుకురావడానికి కెమెరా వర్క్ ఉపయోగిపడింది. ఇక అనిరుధ్ నేపథ్య సంగీతం ఎప్పటిలాగే ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఫ్యాన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఎడిటిర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. లైకా ప్రొడక్షన్స్ సినిమా నిర్మాణంలో రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
- రజనీకాంత్ నటన
- సోషల్ మెసేజ్
- సంగీతం
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
- నెమ్మదిగా సాగే కథనం
- ఊహజనీతంగా ఉండటం
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం