మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఎవరూ ఊహించని రీతిలో వాట్సప్ ఛానల్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీకు ఇష్టమైన సెలబ్రిటీలను, వ్యక్తులను, వార్తా చానళ్లను మీ వాట్సప్ ద్వారానే అనసరించవచ్చు. వారు అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సప్‌లో పొందవచ్చు. అయితే సెలబ్రిటీలు, ప్రముఖులే కాకుండా వాట్సప్ యూజర్లు సైతం తమ సొంత వాట్సప్ ఛానల్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. మరి వాట్సాప్ ఛానల్‌ను ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా?
వాట్సాప్ ఛానెల్స్ వల్ల ఏంటి యూజ్?
పెద్ద సమూహాలతో వన్-వే కమ్యూనికేషన్ కలిగి ఉండేందుకు వాట్సప్ ఛానెల్స్ ఉపయోగపడతాయి. ఈ ఛానెల్‌లు అడ్మిన్‌లచే సృష్టించబడతాయి. ఏ సభ్యుడైనా చేరవచ్చు. ఛానెల్‌లో, నిర్వాహకులు టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు, ఆడియోలు, పత్రాలను పోస్ట్ చేయవచ్చు. తమకు సంబంధించిన వివరాలను యూజర్లతో పంచుకోవచ్చు.
ఫోన్లో వాట్సాప్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి?
- మీ ఫోన్లో వాట్సాప్‌ను ఓపెన్ చేసి ‘Updates’ ఫీచర్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీకు (+) ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- తర్వాత ‘New Channel’పై ట్యాప్ చేయాలి.
- అనంతరం ఆన్‌స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ ‘Get Started’పై క్లిక్ చేయాలి.
- క్రియేట్ చేసిన ఛానల్‌కు ఒక పేరు ఇవ్వాలి.
- ఇక్కడ మీ ఛానల్‌కు మీకు నచ్చిన డిస్క్రిప్షన్, ఐకాన్ లేదా ప్రొఫైల్ పిక్‌ను యాడ్ చేసుకునే వీలుంది.
- దీని తర్వాత ‘Create Channel’ను సెలెక్ట్ చేసుకోవాలి. అంతే మీ ఛానల్ రెడీ.
కంప్యూటర్‌లో వాట్సాప్ ఛానల్ క్రియేట్ ఇలా!
- ముందుగా మీ పీసీలోని వాట్సాప్ వెబ్‌లోకి లాగిన్ అవ్వాలి.
- అక్కడ ‘Channels’ ఐకాన్ సెలక్ట్ చేసుకోవాలి.
- తర్వాత ‘Create Channel’ పై క్లిక్ చేసి ‘Continue’పై ట్యాప్ చేయాలి.
- అనంతరం అప్లికేషన్ అడిగే ఆన్‌స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి.
- పూర్తిగా ఛానల్ క్రియేట్ అవ్వడానికి మీ ఛానల్‌కు ఓ పేరును ఇవ్వాలి. దీనిని మీరు ఆ తర్వాత కూడా మార్చుకోవచ్చు.
- అయితే ఛానల్ డిస్క్రిప్షన్లో మీరు ఛానల్ ఎందుకు పెట్టారు? దాని ఉద్దేశం ఏమిటి? మొదలైన వివరాలను సవివరంగా తెలియజేస్తే మంచిది. దీనితో మిమ్మల్ని అనుసరించే ఫాలోవర్స్‌కు మీ ఛానల్ ఉద్దేశ్యం ఏమిటో సులువుగా తెలుస్తుంది.
- మీ ఛానల్‌కు ఓ లోగోను ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఏదైనా మంచి ఫొటోను మీ గ్యాలరీ లేదా వెబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోని లోగో పెట్టుకోవచ్చు.
- చివరగా “Create Channel”పై క్లిక్ చేయాలి. అంతే ల్యాప్‌టాప్ లేదా పీసీలో మీ ఛానల్ రెడీ.
వాట్సప్ ఛానల్ ప్రత్యేకత
వాట్సప్ యాజమాన్యం భారత్ సహా 150కిపైగా దేశాల్లో ఈ ‘వాట్సాప్ ఛానల్స్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ వాట్సప్ ఛానల్స్ ప్రత్యేకత ఏమిటంటే.. మిగతా సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్, వారు చేసే కామెంట్స్ కనబడుతూ ఉంటాయి. కానీ వాట్సాప్ ఛానల్‌కు సంబంధించిన ఫాలోవర్స్ వ్యక్తిగత వివరాలు లేదా వారు చేసే కామెంట్లు ఇతర ఫాలోవర్లకు కనబడవు. కేవలం ఛానల్ నిర్వహకులు ఇచ్చే అప్‌డేట్స్ మాత్రమే కనిపిస్తాయి. వాటిపై రియాక్ట్ అయ్యే అవకాశం ఫాలోవర్లకు ఉండదు.
వాట్సప్‌లోకి వరల్డ్‌కప్ అప్‌డేట్స్!
వాట్సాప్ ఛానల్ ఫీచర్‌పై బీసీసీఐ ఆసక్తి కనరబరుస్తోంది. అక్టోబర్‌లో ప్రారంభంకానున్న ICC పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2023 కోసం ఛానల్‌ను క్రియేట్ చేసేందుకు తాము ఇప్పటికే మెటాతో చర్చలు జరిపామని BCCI ఓ ప్రకటనలో తెలిపింది. ఇద్దరి భాగస్వామ్యంతో క్రికెట్ అప్డేట్స్ సహా ఇతర ముఖ్యమైన వివరాలను ఎప్పటికప్పుడు యూజర్స్‌కు తెలియజేస్తామని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
ప్రధాని వాట్సప్ ఛానల్ షురూ
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు చురుగ్గా ఉండే ప్రధాని మోదీ కొత్తగా వాట్సప్ ఛానల్లోకి అడుగు పెట్టారు. ఆయన కొత్తగా వాట్సప్ ఛానల్ క్రియేట్ చేసినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రధానితో అనుసంధానం అయ్యేందుకు వాట్సప్‌లో ఆయన ఖాతాను ఫాలో కావాలని యూజర్లకు పిలుపునిచ్చింది.
సెలబ్రిటీలు వచ్చేశారు..!
సోషల్ మీడియాలో సామాన్యుల కంటే సెలబ్రిటీల హవానే ఎక్కువ. ఈ నేపథ్యంలో మెటా తీసుకొచ్చిన వాట్సప్ ఛానల్ ఫీచర్ అందుబాటులోకి రాగానే పలువురు సెలబ్రిటీలు తమ ఖాతాలను తెరిచేశారు. కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్, విజయ్ దేవరకొండ, సన్నీ లియోన్, ఇండియన్ క్రికెట్ టీమ్, దిల్‌జిత్ దొసాంజ్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ తదితరులు వాట్సప్ ఛానల్‌లో తమ పేజ్‌లను క్రియేట్ చేశారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!