సాధారణంగా ప్రతీ ఒక్కరు రైలు, రోడ్డు, జల మార్గాలను చూసి ఉంటారు. మరికొందరు విమానాలు ఎక్కి వాయు మార్గాల్లోనూ ప్రయాణిస్తుంటారు. అయితే వీటన్నింటిలో కెల్లా సొరంగం మార్గం ఎంతో ప్రత్యేకమైనది. టన్నెల్‌లో ప్రయాణమంటే కొందరు ఎగిరిగంతేస్తారు. మరికొందరు భయంతో ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా సొరంగం గుండా రైలు ప్రయాణమంటే చాాలా మందికి భయమే. చిమ్మచీకట్లతో ఉన్న సొరంగంలోకి రైలు ప్రవేశించగానే ప్రపంచమంతా మాయమైపోయినట్లు అనిపిస్తుంది. ఒకటి, రెండు కిలోమీటర్ల టన్నెల్‌కే ఇలా అనిపిస్తే సొరంగ మార్గం 30, 40 కి.మీ పొడవున ఉంటే ఇంకెలా అనిపిస్తుంది. ఆ ఊహే ఎంతో ఆందోళనకు గురిచేస్తుంది కదా. ప్రపంచంలోనే అత్యంత పొడవైన టన్నెల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
1. గోథార్డ్ బేస్ సొరంగం
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్‌గా ‘గోథార్డ్ బేస్ టన్నెల్’ (Gotthard Base Tunnel) గుర్తింపు పొందింది. స్విట్జర్లాండ్‌లో ఉన్న ఈ సొరంగం పొడవు ఏకంగా 57.1 కిలోమీటర్లు. దీనిని 2016లో ప్రారంభించారు.1996వ సంవత్సరంలో ఈ రైల్వే టన్నెల్ పనులు మెుదలుపెట్టారు. కఠిన శిలలు గల పర్వత ప్రాంతాలలో నిర్మించడం వలన దాదాపు 20 సంవత్సరాలు పట్టింది.
2. సీకాన్ సొరంగం
జపాన్‌లోని ‘సీకాన్ టన్నెల్’ (Seikan Tunnel) కూడా ప్రపంచంలోని రెండో అతి పొడవైన రైల్వే సొరంగంగా రికార్డుకెక్కింది. ఇది 53.9 కిలో మీటర్ల పొడవు కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపొడవైన అండర్ సీ టన్నెల్‌గా గుర్తింపు పొందింది.
3. ఛానెల్ సొరంగం
ఫ్రాన్స్-బ్రిటన్ సరిహద్దులను కలుపుతూ ‘ఛానెల్ టన్నెల్’ (Channel Tunnel)ను నిర్మించారు. ఇది 50.45 కి.మీ పొడవైన అండర్ సీ టన్నెల్. ప్రపంచంలోనే అతిపొడవైన మూడో టన్నెల్‌గానూ రికార్డుకెక్కింది. ఈ టన్నెల్ గుండా సరుకులను రవాణా చేస్తారు.
4. యుల్‌హైయోన్ సొరంగం
దక్షిణ కొరియాలోని యుల్‌హైయోన్ టన్నెల్ (yulhyun tunnel)2016 డిసెంబర్‌లో ప్రారంభించారు. దీని పొడవు 50.3 కిలో మీటర్లుగా ఉంది. ఈ సొరంగంలో రైలు గరిష్ట వేగం గంటకు 300 కి.మీ గా ఉంది.
5. లాష్‌బెర్గ్ సొరంగం
స్విట్జర్లాండ్‌లోని ‘లాష్‌బెర్గ్ బేస్ టన్నెల్’ (Lotschberg Base Tunnel) కూడా అతిపొడవైన సొరంగ మార్గాల్లో ఒకటిగా ఉంది. దీనిని 34.57 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. ఈ టన్నెల్ నిర్మాణాన్ని 1999లో ప్రారంభించి 2007లో పూర్తి చేశారు.
6. న్యూ గ్వాన్జియో సొరంగం
ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద సొరంగమైన ‘న్యూ గ్వాన్జియో’ (New Guanjiao Tunnel) చైనాలో ఉంది. ఈ సొరంగం పొడవు 32.64 కిలోమీటర్లుగా ఉంది. ఇది చైనాలోనే అతి పొడవైన సొరంగ మార్గంగా రికార్డుకెక్కింది. ఈ సొరంగం గ్జినింగ్ – లాసా ప్రాంతాల మధ్య ఈ సొరంగాన్ని నిర్మించారు.
7. గ్వాడర్రామ సొరంగం
స్పెయిన్‌లోని గ్వాడర్రామ సొరంగం (Guadarrama Tunnel) కూడా ప్రపంచంలోనే ఏడో పొడవైన సొరంగంగా ఉంది. దీని పొడవు 28.4 కిలోమీటర్లు. ఈ సొరంగాన్ని 2007 డిసెంబర్‌లో ప్రారంభించారు.