“కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో…!” అంటూ ఘంటసాల గారు ఏనాడో ప్రియురాలి సాంగత్యంలోని మాధుర్యాన్ని చెప్పారు. మరి అలాంటి ప్రేయసి కోసం ప్రత్యేకమైన ఓ రోజు వస్తే ఊరకనే ఊరుకుంటారా?.దానిని మరింత ప్రత్యేకం చేయాలి కదా! వలచిన చినదానికి వాలంటైన్స్డేను మరింత ప్రత్యేకంగా చూపాలి కదా! అవును, కానీ, ఏంచేయాలో తోచట్లేదు అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే!
ప్రేమగా మొదలు
ప్రేమికుల రోజు కదా అని రోజులో 24 గంటలకు మించిన సమయమైతే ఉండదు కదా! అది మనసులో పెట్టుకుని మీ రోజును చక్కగా ప్లాన్ చేసుకోవాలి. మీరిద్దరూ ఒకేచోట ఉండేవారైతే గదిని ప్రేమకు ప్రతిరూపంలా అలంకరించండి. ఉదయం నుంచే మీ మనసులు ఉప్పొంగేలా గులాబీలతో ప్రేయసి/ ప్రియుడికి శుభోదయం చెప్పండి.
బెడ్‌పైనే బ్రేక్‌ఫాస్ట్
రోజూ డైనింగ్ టేబుల్ మీదనే తింటారు కదా కలిసి బెడ్‌పైనే కూర్చుని తింటుంటే కొంచెం కొత్తగా ఉంటుంది. ఇద్దరూ వేర్వేరుగా కాకుండా కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేయండి. భోజనంలో ప్రేమ కూడా కలుస్తుంది. కాదంటారా మీరుండే సిటీలోనే బెస్ట్ స్పాట్‌కు తీసుకెళ్లి కొత్త రుచులతో బ్రేక్‌ఫాస్ట్ చేసినా అదిరిపోతుంది.
సర్ప్రైజ్ మిస్ కావొద్దు
మీరు వేర్వేరు చోట్ల ఉండేవారైతే సర్ప్రైజ్ తప్పనిసరి. వారు అనుకున్నదానికంటే ముందే వారి దరి చేరండి. ఒట్టి చేతులతో అస్సలు వెళ్లొద్దు. పూలతో పలకరించి..చాకొలెట్‌తో హాయ్ చెప్పండి ఎంత సంబంరంగా రోజు మొదలవుతుందో మీరు ఊహించనలేరు. ముందే పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని అడుగడుగూ ఆమెను సర్ప్రైజ్ చేస్తూనే ఉండండి.
రోజంతా ఏమేం చేయొచ్చు
ప్రేమలో ప్రతిక్షణం పరవశమే. కలిసి ఏం చేసినా బాగుంటుంది. కానీ ఇది ప్రత్యేకమైన రోజు కదా..! అంతే ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోండి.
కలిసి టూరింగ్
ఒక్క రోజులో దూర ప్రాంతాలకు టూర్‌కు వెళ్లలేరు. అందుకే మీరున్న సిటీలోనే బెస్ట్ ప్లేసేస్ను సెలెక్ట్ చేసుకుని రోజంతా టూరింగ్ చేయొచ్చు. హైదరాబాద్‌లో అయితే మ్యూజియం, గోల్కొండ, చార్మినార్, దుర్గం చెరువు బ్రిడ్జ్, చౌమహల్లా ప్యాలస్ ఇలా చాలా ప్రాంతాలు చుట్టేయొచ్చు. చేతిలో చేయి వేసుకుని అలా తిరుగుతుంటే ఎంత బాగుటుందో కదా!
డ్రైవ్‌కు వెళ్లండి
“మనిద్దరం ఓసారి అక్కడికి వెళ్లాలి” ఇలా ఎన్నాళ్లుగానో అనుకుంటున్న ఓ ప్లేస్‌కు వెళ్లిపోండి. మరీ దూరంగా కాకుండా మీకు దగ్గర్లో ఉండే ప్రాంతాలైతే బాగుంటుంది. మీరు హైదరాబాద్‌లో ఉంటే మాత్రం అనంతగిరి హిల్స్, పోచారం రిజర్వ్ ఫారెస్ట్, సిద్దిపేట కోమటి చెరువు, పాకాల ఇలా చాలా ప్రాంతాలే అందుబాటులో ఉన్నాయి. ఈజీగా బైక్‌పై కబుర్లు చెప్పుకుంటూ వెళ్లిపోవచ్చు.
ప్రేమ పాటలతో
కలిసి కాసేపు అలా సరాదాగా పాటలు వినండి. చెరొక ప్లేలిస్ట్ ప్రత్యేకంగా క్యూరేట్ చేసుకుని..ఒక్కొక్కరి ప్లే లిస్ట్ నుంచి ఒక్కో పాట వింటూ ఉండండి. పాటలు ఎంచుకునేటప్పుడు అందులో మీ మనసులోని భావాలు పలికించేలా లిరిక్స్ ఉండేవి చూసుకోండి. చెరో ఇయర్‌ఫోన్ పెట్టుకుని ఒకరి భుజంపై ఒకరు వాలి పాటలు వింటుంటే ఈ లోకంలో ఉండరు. పాటలో హీరో హీరోయిన్ ఎవరైనా మీ మనసులో మాత్రం మీరిద్దరే ఉంటారు.
ప్రేమ సినిమాలతో
పాటలే కాదు సినిమాలతోనూ టైంపాస్ చేయవచ్చు. రొమాంటిక్ సినిమాలు పెట్టుకుని ఒకరినొకరు ఊహించుకుంటూ పాప్‌కార్న్ తింటూ, తినిపించుకుంటూ గడిపిస్తే భలేగా ఉంటుంది. మీకోసం కొన్ని సినిమాల జాబితా
పాకశాలలో ప్రేమ
కలిసి తినడంలోనే కాదు కలిసి వంట చేసుకోవడంలోనూ ఎంతో ప్రేమ దాగుంటుంది. ఒకరికొకరు సాయం చేసుకుంటూ వంట చేసుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఒకేచోట నివసించేవారైతే ఇది సులభమే కానీ వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవారైతే ఎలా? అందుకూ ఇప్పుడు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. మీరు అక్కడికి వెళ్తే సొంతింట్లో మాదిరిగా కలిసి వంట చేసుకోవచ్చు.
ప్రేమను కుండలో పొంగించేలా
పాటరీ..ఇప్పుడు అర్బన్ కల్చర్‌లో చాలా పెరిగిపోతున్న సంస్కృతి. నిత్యం ఉద్యోగాల్లో బిజిగా గడిపేవారు పాటరీ క్లబ్‌లకు వెళ్లి కుండలు చేస్తూ మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. వాలెంటైన్స్ డే రోజు మీరూ మీ ప్రేయసితో కలిసి వెళ్లవచ్చు. ఒక్కసారి ఊహించుకోండి. కుండలు చేస్తూ చేతికి అంటుకున్న పచ్చి బంక మట్టిని ఒకరికొకరు పూసుకుంటూ ఆడుకుంటూ ఎంత సరదాగా గడపొచ్చో. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న కొన్న పాటరీ స్టూడియోలు
Potter Class PushpaLatha – పంజాగుట్ట- 081434 48621
Claysutra Pottery Studio- సికింద్రాబాద్- 090008 03395
MK Pottery Studeo- గచ్చిబౌలి
MSN Pottery Studio- 92463 31145
సేవాకార్యక్రమాలు
సెయింట్ వాలంటైన్ ప్రేమికులను కలిపినందుకు మరణశిక్షతో చనిపోయాడు. ఆయన స్మరించుకుంటూ వచ్చిన ఈ ప్రత్యేక రోజున జంటగా సేవా కార్యక్రమాలు చేయడమంటే వాలైంటైన్స్ డేకు అసలైన అర్థం తీసుకురావడమే. అనాథ పిల్లలకు మీ ప్రేమను పంచాలనుకుంటే ఇక్కడ ఉన్న కొన్ని శరణాలయాలను సంప్రదించవచ్చు.
Care and Love Orphanage- 96521 21221
BASS ORPHAN HOME-93966 01234
Radha Kishan Balika Bhavan- 040 2351 3186
Prerana Children’s Home- 079978 11018
వాటర్ గేమ్స్
రొమాంటిక్ సాంగ్స్‌లో వర్షం పాటలకు ఉన్న క్రేజ్ తెలిసిందే. వానలో తడుస్తూ ప్రేయసితో ఆడటం ఎంత సరదాగా ఉంటుంది. జులాయిలో అల్లు అర్జున్‌లా మీరు మరీ కష్టపడి వాన కురిపించాల్సిన పనిలేదు గానీ.. రామోజీ ఫిల్మ్ సిటీ, వండర్ లా ఇలాంటి చోట్లకు వెళ్తే వానలో చిందులేయొచ్చు.
నక్షత్ర దీవిలో
చుక్కల్ని లెక్కబెడుతూ కబుర్లు చెప్పుకుంటుంటే…. ‘రాజా రాణి’ సినిమాలో నజ్రియా, ఆర్య గుర్తొస్తున్నారా? నిజంగానే అది చాలా బాగుంటుంది. దాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకున్నా చాలు. కానీ ప్రత్యేకమైన ప్లేస్ అయితే ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. హైదరాబాద్‌లో మౌలాలి దర్గా దగ్గర నిలబడి చూస్తే సిటీ మొత్తం వెలుగులీనుతూ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూడండి.
రిసార్ట్స్/ టెంట్స్
సిటీ చుట్టుపక్కల ఉన్న ఏదైనా రిసార్ట్‌కు వెళ్లి ఈ రోజును ప్రత్యేకంగా గడపండి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రగతి, లియోనియా, లహరి, గోల్కొండ ఇలా చాలా అద్భుతమైన రిసార్ట్స్ ఉన్నాయి.
గేమ్స్ ఆడుకోండి
ఆన్లైన్లో చాలా లవ్ గేమ్స్ అందుబాటులో ఉంటాయి. వాటితో టైంపాస్ చేయొచ్చు. అలా కాదనుకుంటే ఆఫ్లైన్లోనూ ఎన్నో గేమ్స్ ఆడుకోవచ్చు.
లూడో– ఇద్దరు కలిసి ఆడుకునే బోర్డ్ గేమ్. ఇందులో గెలవాలని కాకుండా గెలిపించాలని ఆడండి. ఆటలో ఓడినా వారి మనసులో గెలుస్తారు.
ట్రెజర్ హంట్– మీ ప్రియుడు/ ప్రియురాలికి బహుమతులు కొని వాటిని గదిలో ఒక్కో చోట దాచిపెట్టి క్లూస్ ఇస్తూ వాటిని వెతకమని చెప్పండి. ఇద్దరికీ ఫన్‌గా ఉంటుంది.
ట్రూత్ ఆర్ డేర్: అందరికీ తెలిసిన గేమ్ అయినా కాస్త్ రొమాంటిక్‌గా ఆడండి. సీరియస్ అయ్యే అంశాలు కాకుండా రొమాంటిక్ అంశాలతో ఆడితో భలే సరదాగా ఉంటుంది.
పిల్లో ఫైట్ : చెరో పిల్లో తీసుకుని సరదాగా ఫైట్ చేసుకోండి. చిన్నపిల్లల్లా అనిపించినా అందులో ఉండే ఆనందమే వేరు!