94 ఏళ్ల వయసులో ఏం చేస్తాం.. ఇంకేం సాధిస్తాంలే…అని అనుకోలేదు ఆ బామ్మా. పరుగులో పోటీపడి పసిడి పతకాన్ని ఒడిసిపట్టారు 94 ఏళ్ల భగవానీ దేవి దాగర్. ఫిన్ లాండ్ లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2002లో సంచలనం సృష్టించారు. ఈ ఛాంపియన్ షిప్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి ఓ స్వర్ణం సహా రెండు కాంస్య పతకాలు గెలిచారు. ఆమె సాధించిన విజయం నేటి యువ తరానికి స్ఫూర్తి దాయకం.
ఇంతకు ఎవరీ భగవానీ దేవి?
మనలో ఏదైన సాధించాలనే తపన ఉంటే, వయస్సు ఒక సంఖ్య మాత్రమేనని నిరూపించారు 94 ఏళ్ల భగవానీ దేవి దాగర్. సాధారణంగా 94 ఏళ్ల వయసులో చాలా మంది సరిగ్గా కదలలేని పరిస్థితుల్లో ఉంటారు. కుటుంబ సభ్యుల ఆధారంతో పనులు చేసుకుంటారు. కానీ భగవానీ దేవి ఆ వయసులో కదలడమే కాదు పరుగులు పెట్టారు. ప్రపంచ క్రీడా యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించారు. హర్యానాకు చెందిన భగవానీ దేవి ఎవరో కాదు అంతర్జాతీయ పారా అథ్లెట్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహిత వికాస్ దాగర్ కు నానమ్మ.
రికార్డులు
ఫిన్ లాండ్ లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2002లో భగవానీ దాగర్ ఓ స్వర్ణం సహా రెండు కాంస్య పతకాలు గెలిచారు. 100 మీటర్ల రన్నింగ్ రేసును కేవలం 24.74 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. షాట్ పుట్, జావెలిన్ త్రోలో కాంస్య పతకాలు సాధించారు. భగవానీ దేవి చెన్నైలో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 3 బంగారు పతకాలను గెలుచుకున్న నాన్జెనేరియన్ అథ్లెట్. దీంతో ఆమె ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2022లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హత సాధించారు. అంతకు ముందు ఢిల్లీ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల రేసు, షాట్పుట్, జావెలిన్ త్రోలోనూ ఫస్ట్ ప్లేస్ లో నిలిచి 3 స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు.
యువతకు స్ఫూర్తిగా నిలిచిన భగవానీ దేవి
తమ లక్ష్య సాధనలో చిన్న అడ్డంకి ఎదురైతేనే తమ ఆశయాన్ని వదిలి పెడుతున్నారు నేటి యువత. సాధించాలనే తపన, అంకిత భావం ఉంటే జీవిత ప్రయాణంలో మన లక్ష్యాన్ని ఎప్పటికైనా సాధించవచ్చని భగవానీ దేవి నిరూపించారు. ఆమె జీవితం నేటి యువతకు స్ఫూర్తి దాయకం. ఆమె నుంచి దేశ యువతరం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది.
ప్రశంసలు
భగవానీ దేవి సాధించిన స్ఫూర్తి దాయక విజయం పట్ల కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వశాఖ అభినందిస్తూ ట్వీట్ చేసింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో భగవానీ దేవి చిత్రాన్ని పోస్ట్ చేసింది. భారత దేశానికి చెందిన 94 ఏళ్ల భగవానీ దేవి వయస్సు ఒక సంఖ్య మాత్రమే అని మరోసారి చెప్పారని ప్రశంసించింది. భగవాన్ దేవిని ప్రశంసిస్తూ హీరోయిన్ కంగనా రనౌత్ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. మీరు ప్రేరణ కోసం చూస్తున్నట్లయితే, ‘దాదీ’ భగవానీ దేవి మీలో స్పూర్తిని రగిలించగలరని అభినందించింది.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’