క్రికెట్ విషయంలో ఇండియాను తక్కువ అంచనా వేసిన కాలంలో దేశాన్ని గర్వపడేలా చేసిన కాలం 1983. యావత్ దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడిస్తూ కపిల్‌దేవ్ సారథ్యంలో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. అంచనాలు లేని దేశాన్ని ఒక కెప్టెన్ అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లగలిగాడో తెలిపే స్ఫూర్తిదాయకమైన కథే ఈ సినిమా.
ఇండియాకు ప్రపంచకప్ వస్తుందని అప్పట్లో ఎవరికి నమ్మకం లేదనే విషయాన్ని డైరెక్టర్ కబీర్‌ఖాన్ చాలా స్పష్టంగా మొదట కొన్ని నిమిషాల్లో చూపించాడు. ఒక్కొ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ మెల్లిగా ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేయడంలో విజయం సాధించాడు. ప్రపంచకప్ గెలవడమే ముఖ్యం కాదు.. ఇండియాను తక్కువ అంచనా వేస్తున్నవారికి మనమేంటో నిరూపించాలనే ఉద్దేశంతో కపిల్‌దేవ్ పోరాడినట్లు చూపించాడు.
సినిమాలో ప్రతి దశలో కబీర్ ఖాన్ 1983 కాలాన్ని రీక్రియేట్ చేయగలిగాడు. దీనికోసం అతడు చేసిన రీసెర్చ్, పడ్డకష్టం అర్థమవుతోంది. చిన్న చిన్న అంశాలను కూడా జాగ్రత్తగా ప్రజెంట్ చేయగలిగాడు. ఇది ఒక సినిమా చూస్తున్నట్లుగానో లేదా క్రికెట్ చూస్తున్నట్లుగానో అనిపించకుండా రెండింటిని కలిపి కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
భారతదేశంలో ఎన్ని మతాలు, కులాలు ఉన్నా సినిమా, క్రికెట్ విషయానికొచ్చేసరికి అవేమి కనిపించవు. ఈ విషయం 83 సినిమా ద్వారా స్పష్టంగా చూపించారు. 1983లో ఇండియా క్రికెట్ మీద అంచనాలు తక్కువ ఉన్న సమయంలో కపిల్‌దేవ్ వెస్టిండీస్‌పై గెలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించాడు.
ఉద్వేగభరితంగా భారత జట్టు వరల్డ్ కప్‌ని ఆకాశానికెత్తిన ఒక్క సీన్ చాలు సినిమా ఎలా ఉందో చెప్పడానికి. కపిల్ దేవ్ ఇన్నింగ్స్ భారతదేశానికి గుర్తుండిపోయేలా చేయడమే కాకుండా ఇండియా జట్టుకు పెద్ద మొత్తంలో గౌరవాన్ని సంపాదించి పెట్టారు. క్రికెట్ నియంత్రణ బోర్డుతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులకు, మీడియాకు క్రికెట్ గురించి భారతదేశంపై ఉన్న ఒక ముద్రను చెరిపేసింది. ప్రపంచ కప్‌ను గెలవాలనే కెప్టెన్ ఉద్దేశాన్ని అప్పట్లో ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదనే వాస్తవాన్ని సినిమాలో సందర్భానుసారంగా చూపించారు. కథలో జాతీయవాదాన్ని ఎక్కువగానే చూపించారు.
చిన్న చిన్న సంతోషాలు, దుఃఖాలు, అద్భుతమైన విజయాలు, బాధాకరమైన ఓటములు, ప్రతి ఆటగాడు అనుభవించిన అంతర్గత ఒడిదుడుకులు, వారి వ్యక్తిగత ప్రయాణాలు, శక్తివంతమైన టీమ్స్‌ను ఓడించగలమని తమను తాము విశ్వసించగల జట్టుగా మారే ప్రయాణం వీటిన్నింటినీ కళ్లకు కట్టేలా 83లో చూపించారు.
నటీనటుల పనితీరు…
రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో జీవించాడు. అతడు మాట్లాడే పద్ధతి నుంచి బ్యాటింగ్ చేసే విధానం, బాడీలాంగ్వేజ్ అన్ని సహజంగా ఉన్నాయి. కపిల్‌దేవ్ ఇండియాకు కప్ తెచ్చాడనే విషయం మనకు ఎందుకు అంత గర్వ కారణమో అర్థమయ్యేలా చెప్పారు. ఇక తమిళ హీరో జీవాతో పాటు ఇతర నటులు 1983లో ఉన్న క్రికెటర్ల పాత్రల్లో చాలా చక్కగా నటించారు. ఈ సినిమా కోసం ప్రతి డిపార్ట్‌మెంట్ చేసిన కృషి తెరపై కనిపిస్తుంది.
రేటింగ్ 3.5