• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • MLC Kavitha: ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. అసలు ఈ కేసు సంగతేంటి?

    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. దిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఈడీ కార్యాలయానికి కవిత తన భర్త అనిల్‌కుమార్‌తో కలిసి వచ్చారు. ఓ మహిళా అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. తొలుత కవితను ఆమె వ్యక్తిగత విషయాల గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అయితే, కవిత ఈడీ విచారణకు హాజరు కావడం ఇది రెండో సారి. గతంలో హైదరాబాద్‌లో ఈడీ అధికారులు కవితను విచారణ చేశారు. తాజా విచారణ అనంతం కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేయనుంది. 

    మంత్రులతో భేటీ

    ఈడీ విచారణకు వెళ్లడానికి ముందు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో కవిత భేటీ అయ్యారు. ఆమెకు నైతికంగా మద్దతు తెలుపుతూ ధైర్యం చెప్పారు. కవిత విచారణ ఉన్నందున ఇతర కేసుల విచారణను ఈడీ అధికారులు వాయిదా వేశారు. రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్న దృష్ట్యా ఈడీ కార్యాలయం చుట్టూ 144 సెక్షన్‌ని పోలీసులు అమలు చేస్తున్నారు. తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి కవిత ఈడీ విచారణకు వచ్చింది. అయితే, అనిల్ కుమార్‌ను పోలీసులు బయటే ఆపేశారు. 

    పిళ్లై అఫిడవిట్..

    అరుణ్ రామచంద్రన్ పిళ్లై పేర్కొన్న అఫిడవిట్ ఆధారంగా ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. తాను కవిత ప్రతినిధినంటూ పిళ్లై ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. దీంతో మార్చి 9న విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే, ముందుగా ఖరారైన షెడ్యూల్ కారణంగా ఆ తేదీన హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు రిప్లై ఇచ్చారు. దీంతో 11న హాజరు కావాలని ఈడీ అధికారులు కవితకు సూచించారు. 

    ట్విస్టు.. 

    ఈడీ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటూ దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను కవిత బినామీని అంటూ చేసిన వ్యాఖ్యలను పిళ్లై ఉప సంహరించుకున్నారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తొలుత పిళ్లైతో కలిపి కవితను విచారణ చేస్తే కేసు తుది దశకు చేరుకుంటుందని ఈడీ అధికారులు భావించారు. కానీ, సీన్ రివర్స్ అయింది. 

    ఏమీటీ కేసు..?

    దిల్లీ ఎక్సైజ్ పాలసీలో భాగంగా మద్యం టెండర్లు దక్కించుకోవడానికి ఆప్ ప్రభుత్వానికి ‘సౌత్ గ్రూప్’ ముడుపులు చెల్లించిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. దీంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసును ఈడీ టేకప్ చేసింది. సౌత్ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్, అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ కుమార్ ఇందులో ప్రధాన సభ్యులుగా ఉన్నారని ఈడీ పేర్కొంది. ఈ ‘సౌత్ గ్రూప్’ని బిజినెస్‌మెన్ అరుణ్ రామచంద్రన్ పిళ్లై ముందుండి నడిపించినట్లు ఆరోపణ. ఆప్ ప్రభుత్వానికి ప్రతినిధిగా విజయ్ నాయర్ వ్యవహరించారని ఈడీ తెలిపింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితతో నాయర్ భేటీ అయినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. నాయర్ ద్వారా ఆప్ ప్రభుత్వానికి భారీ మొత్తంలో ముట్ట జెప్పి లిక్కర్ షాపుల లైసెన్సులను సౌత్ గ్రూప్ పొందినట్లు ఈడీ పేర్కొంది.

    12 మంది అరెస్టు..

    ఇప్పటివరకు ఈ దిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి 12 మందిని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఇందులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఉన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv