పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ ‘రాజదండం (సెంగోల్)’ చర్చనీయాంశమైంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వివాదానికి కారణమైంది.
బ్రిటిషర్ల నుంచి భారత్‌కు బదిలీ అయిన అధికారాలకు ఈ రాజదండం ప్రతీక అని కేంద్రం చెప్తుండగా.. అందుకు లిఖితపూర్వకమైన ఆధారాలు లేవని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో వాద ప్రతివాదనలకు కారణమైన రాజదండం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాజదండానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. అది తెలియాలంటే 1947 సంవత్సరానికి వెళ్లాలి.అధికార బదిలీకి సిద్దమైన బ్రిటిష్ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ నెహ్రూతో మాట్లాడుతూ ‘మేము మీకు స్వాతంత్య్రంతో పాటు అధికారాన్ని బదిలీ చేస్తున్నాం. దీనిని ప్రతిబింబించే కార్యక్రమం ఉంటే బాగుంటుంది’ అని అన్నారు.
అప్పుడు నెహ్రూ దీని గురించి తన సన్నిహితుడైన సి. రాజగోపాలాచారి (రాజాజీ)తో చర్చించారు. బ్రిటీష్ వారి నుండి అధికార మార్పిడికి గుర్తుగా ఏం చేస్తే బాగుంటుందని ప్రశ్నించారు.
రాజాజీ బదులిస్తూ.. ‘పూర్వం రాజులు తమ పట్టాభిషేకానికి గుర్తుగా రాజగురువుల చేత రాజదండం అందుకునేవారు. ఇది మన భారతీయ సంప్రదాయంలోనే ఉంది. మనం కూడా ఆ పద్దతి అనుసరిస్తే బాగుంటుంది’ అని నెహ్రూతో అన్నారు.
రాజదండానికి నెహ్రూ అంగీకరించడంతో రాజాజీ వెంటనే తమిళనాడులోని ‘తిరువడుత్తురై అధినం’ అనే మఠానికి వెళ్లారు. ప్రత్యేక దండం చేయమని అక్కడ ఉన్న స్వామీజీలను కోరారు.
రాజాజీ కోరికను మన్నించిన ‘తిరువడుత్తురై అధినం’ మఠం నిర్వాహకులు మద్రాసులోని ఒక స్వర్ణకారునితో రాజదండం చేయించారు. దానికి ‘సెంగోల్’ అని పేరు పెట్టారు.
‘సెంగోల్’ అనే పదం ‘సెమ్మై’ అనే తమిళ పదం నుండి ఉద్భవించింది. సెమ్మె అంటే ‘ధర్మం’ అని అర్థం. ఇందుకు గుర్తుగా రాజదండం పైభాగంలో ‘నంది’ బొమ్మ కూడా ఏర్పాటు చేశారు. ఈ దండం సుమారు ఐదు అడుగుల వరకూ ఉంటుంది.
అప్పట్లో ఈ రాజదండాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లేందుకు ప్రత్యేక విమానమే పంపారు. స్వాతంత్రానికి కొద్ది నిమిషాల ముందు సెంగోల్ దండమును మఠం ప్రతినిధి నెహ్రూకు అందజేశారు. అలా రాజదండం సమక్షంలో లార్డ్ మౌంట్ బాటన్ నుంచి నెహ్రూకు అధికార బదిలి జరిగింది.
రాజదండానికి ఉన్న విశిష్టత దృష్ట్యా నూతన పార్లమెంటులో దీన్ని అమర్చనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. స్పీకర్ కుర్చీ పక్కన రాజదండాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో వివాదం చెలరేగింది.
తమిళనాడులో రాజకీయ ప్రయోజనాలు ఆశించే ప్రధాని, ఆయన భజన బృందం రాజదండాన్ని ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. వారి లక్ష్యానికి అనుగుణంగా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తోంది.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!