నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు.
దర్శకత్వం: అనిల్ కన్నెగంటి
సంగీతం: వికాస్ బాడిస
ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్
నిర్మాత: గంగపట్నం శ్రీధర్
విడుదల తేదీ: 20-07-2023
టాలీవుడ్ యువదర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆసక్తిరేపే కథాంశాన్ని సినిమాగా ఎంచుకొని బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన విరూపాక్ష, బలగం, బేబి సినిమాలే ఇందుకు ఉదాహరణ. కాగా, తాజాగా విడుదలైన ‘హిడింబ’ సైతం ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే ఉద్దేశంతో తెరకెక్కింది. అశ్విన్‌బాబు హీరోగా అనిల్ కన్నెగంటి తెరకెక్కించిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం, ఏకే ఎంటర్టైన్మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ దీన్ని సమర్పిస్తుండటంతో ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. మరి ఈ ‘హిడింబ’ కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
కథేంటి
అభయ్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత) పోలీస్ శిక్షణలో ఉండగా ఒకరినొకరు ఇష్టపడతారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. వీళ్లిద్దరూ ఓ కేసు విషయమై మళ్లీ కలిసి పని చేయాల్సి వస్తుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాప్‌లకు సంబంధించిన కేసది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో బోయ అనే కరుడుగట్టిన ముఠాను పట్టుకుంటారు. అయినప్పటికీ కిడ్నాప్‌లు ఆగవు. ఈ నేపథ్యంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసును ఆద్య, అభయ్ ఎలా ఛేదించారు? అసలు ఈ కిడ్నాప్‌లు చేస్తున్న నేరస్థుడెవరు? అండమాన్ దీవుల్లో ఉన్న ఓ ఆదిమ తెగకు ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే..
ఎవరెలా చేశారంటే
నటుడిగా అశ్విన్‌ను మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రమిది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి దీటైన పాత్రలో నందితా నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక మకరంద్ దేశ్ పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రను దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, షిజ్జు, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ పిళ్లై తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
ఎలా సాగిందంటే
టైటిల్స్ కార్డ్స్‌తోనే దర్శకుడు అనిల్ కన్నెగంటి నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నగరంలో అమ్మాయిలు వరుసగా కిడ్నాప్ అవ్వడం, ఆ కేసును ఛేదించేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఆద్యను రంగంలోకి దింపడం.. ఇలా చకచకా కథ పరుగులు తీస్తుంది. కానీ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆరంభమైనప్పటి నుంచి సినిమా ఒక్కసారిగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా మారిపోతుంది. పెద్దగా కష్టపడకుండానే కేసుకు సంబంధించిన క్లూలు తెలిసిపోతుంటాయి. ఇది ప్రేక్షకులకు అంతగా రుచించదు. మధ్యలో ఓ పాటతో నాయకానాయికల ప్రేమకథను చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. దాంట్లో పెద్దగా ఫీల్ కనిపించదు. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం సర్ప్రైజ్. హీరోలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ఎపిసోడ్ అది. పతాక సన్నివేశాలు ఊహలకు అందని రీతిలో ఉన్నా ముగింపు సంతృప్తికరంగా అనిపించదు.
డైరెక్షన్ & టెక్నికల్ అంశాలు
దర్శకుడు అనిల్ కన్నెగంటి ఎంచుకున్న కథలో కొత్తదనమున్నా, దాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరపై చూపించడంలో తడబడ్డాడు. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నా, మొత్తంగా చూసినప్పుడు దీంట్లో ఏదో వెలితి కనిపిస్తుంది. చాలా సన్నివేశాలు లాజిక్కుకు దూరంగా ఉన్నాయి. ప్రథమార్ధంలో మానవ అవయవాల అక్రమ రవాణా ఎపిసోడ్‌ను టచ్ చేశారు. దానికి ముగింపు ఇవ్వలేదు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- కథా నేపథ్యం
- ట్విస్ట్‌లు
- పోరాట ఘట్టాలు,
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
- స్క్రీన్‌ప్లే
- పాటలు
- లవ్‌ట్రాక్
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!