ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న క్రీడల్లో క్రికెట్ (Cricket) ఒకటి. ఫుట్‌బాల్ (Football) తర్వాత అత్యధిక మంది ఇష్టపడే క్రీడగా క్రికెట్‌కు పేరుంది. అందుకే క్రికెట్లో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. కోట్లాది మందిని ప్రభావితం చేయగల సామర్థ్యం వారికి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు తమ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కోసం వారిని బ్రాండ్ అంబాసీడర్లకు నియమించుకొని కోట్లాది రూపాయలను ముట్టచెబుతుంటాయి. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లు అత్యంత సంపన్నులుగా మారారు. ప్రపంచంలోని టాప్-10 రిచెస్ట్ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
1. ఆడం గిల్‌క్రిస్ట్
ఈ ఏడాదిలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన క్రికెటర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడం గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) నిలిచారు. ఆయన నిఖర సంపద 380 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ.3,157 వేల కోట్లకు సమానం. గిల్‌క్రిస్ట్ సారథ్యంలోనే ఆసీస్ జట్టు 1999, 2003, 2007 ప్రపంచకప్ టైటిళ్లను గెలిచింది.
2. సచిన్ టెండూల్కర్
ప్రపంచంలోనే రెండో సంపన్న క్రికెటర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిలిచారు. ఆయన నిఖర సంపద 170 మిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.1,413 కోట్లు. అటు సచిన్‌కు క్రికెట్ గాడ్‌గా పేరుంది. క్రికెట్లో అత్యధిక పరుగులు, సెంచరీ చేసిన బ్యాటర్‌గా సచిన్ రికార్డు నెలకొల్పాడు.
3. ఎం.ఎస్ ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ఆయన 115 మిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నాడు. అంటే సుమారు రూ.957 కోట్లు అన్నమాట. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని.. అత్యధిక ప్యాకేజ్ తీసుకుంటున్న ఆటగాళ్లలో ఒకరిగా ఉన్నారు.
4. విరాట్ కోహ్లీ
112 మిలియన్ డాలర్ల సంపదతో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రపంచంలోనే సంపన్నమైన నాల్గో క్రికెటర్‌గా ఉన్నాడు. భారత కరెన్సీ ప్రకారం అతడి ఆస్తుల విలువ సుమారు రూ.932 కోట్లు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో అదరగొడుతున్న కోహ్లీ.. వన్డేల్లో 49 సెంచరీల మార్క్‌ను అందుకున్నాడు. ఇంకో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును చెరిపేసి వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్‌గా విరాట్ నిలుస్తాడు.
5. రిక్కీ పాంటింగ్
ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ (Ricky Ponting) కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు. అతడి మెుత్తం సంపద 75 మిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.617 కోట్లు. ఇదిలా ఉంటే పాంటింగ్ నేతృత్వంలోని ఆసీస్ మూడు ప్రపంచకప్‌లను అందుకుంది.
6. జాక్వెస్ కలిస్
దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ (Jacques Kallis) సంపదలోనూ ముందున్నాడు. సుమారు రూ.582 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జనరేషన్ ఆల్రౌండర్లకు కలిస్ ఎంతో ప్రేరణ. టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్య.. కలిస్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు పలు ఇంటర్యూలలో చెప్పాడు.
7. బ్రెయిన్ లారా
వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రెయిన్ లారా (Brian Lara) రూ.499 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (400) రికార్డు నెలకొల్పాడు.
8. వీరేంద్ర సెహ్వాగ్
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఆయన రూ.333.12 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ అయిన సెహ్వాగ్ ధనాధన్ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. అతడు వెస్టిండీస్‌పై కొట్టి 219 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికీ చాలా మందికి గుర్తుంది.
9. యువరాజ్ సింగ్
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కూడా సంపదలో మెరుగైన స్థితిలోనే ఉన్నాడు. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.291 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే 2011 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకోవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయానికి కృషి చేశాడు.
10. స్టీవ్ స్మిత్
ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) కూడా ఈ జాబితాలో పదో స్థానంలో ఉన్నాడు. మన కరెన్సీ ప్రకారం అతడి ఆస్తుల విలువ సుమారు రూ.249 కోట్లు.