సినీ పరిశ్రమలో వారసత్వం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. స్టార్ హీరోల కుమారులు తమ టాలెంట్‌ను నిరూపించుకొని కథానాయకులుగా ఎదుగుతున్నారు. టాలీవుడ్‌లోనూ ఈ తరహా పరిస్థితులే ఉన్నాయి. వారసులుగా వచ్చిన ఈతరం యువ నటులు.. ఇక్కడ స్టార్లుగా గుర్తింపు సంపాదించారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. తద్వారా రానున్న ఐదేళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమను రూల్ చేయగలమన్న నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? వారి ప్రస్థానం ఇకపై ఎలా సాగనుంది? టాలీవుడ్‌ను శాసించేందుకు వారికి కలిసి రానున్న అంశాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
సుహాస్
యువ నటుడు సుహాస్ (Suhas).. వరుస హిట్స్‌తో టాలీవుడ్లో దూసుకెళ్తున్నాడు. కమెడియన్‌గా తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన సుహాస్.. తానొక హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు. ‘కలర్ ఫొటో’, ‘రైటర్’, ‘అంజాబీపేట మ్యారేజ్ బ్యాండ్’ వంటి హిట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. సుహాస్‌తో సినిమా అంటే హిట్ పక్కా అని దర్శక నిర్మాతలు భావించే స్థాయికి ఈ యువ హీరో ఎదిగాడు. కథల ఎంపికలో సుహాస్ అనుసరిస్తున్న వైఖరి చాలా బాగుందని సినీ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. సుహాస్ ఇదే తరహాలో భవిష్యత్‌లో సినిమాలు చేస్తే హీరో నానిలా మరో నేచురల్ స్టార్ అవుతాడని అంటున్నారు.
విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఫ్యూచర్ స్టార్‌గా ఎదుగుతున్నాడు. ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ హీరోగా మారిన విజయ్.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అభిమానించే ఫ్యాన్స్.. విజయ్ సొంతం. ప్రస్తుతం సరైన హిట్ లేక విజయ్ ఇబ్బంది పడుతున్నాడు. అంతమాత్రన అతడి పని అయిపోయినట్లేనని భావిస్తే పొరపాటే. విజయ్ మార్కెట్ ఏంటో 2018లో వచ్చిన ‘గీతా గోవిందం’ కళ్లకు కట్టింది. ఆ సినిమా ద్వారా అప్పట్లోనే విజయ్ రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. ఇక సాలిడ్ హిట్ లభిస్తే విజయ్ను ఆపడం కష్టమేనని చెప్పవచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ
టాలీవుడ్‌ను రూల్ చేయగల సామర్థ్యమున్న మరో హీరో ‘సిద్ధు జొన్నలగడ్డ’. ‘డీజే టిల్లు’కి ముందు వరకు సాధారణ హీరోగా ఉన్న సిద్ధూ.. ఆ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాడు. రీసెంట్గా ‘టిల్లు స్క్వేర్’తో రూ.100 కోట్ల క్లబ్లో వచ్చి చేరాడు. సిద్ధూ మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, రైటింగ్ స్కిల్స్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఎప్పుడైన ఒక సినిమాను సక్సెస్ చేయడంలో యూత్ కీలకంగా ఉంటారు. అటువంటి యూత్‌పై ఈ యంగ్ హీరో చెరగని ముద్ర వేయడం.. అతడి ఫ్యూచర్‌కు కలిసిరానుంది. త్వరలో ‘టిల్లు క్యూబ్’ను పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్లు సమంత, తమన్నాలు నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఆ మూవీ కూడా సక్సెస్ అయితే ఇక ఇండస్ట్రీలో సిద్ధూకు తిరుగుండదని చెప్పవచ్చు.
నవీన్ పొలిశెట్టి
ఒకప్పుడు కామెడీ హీరో అనగానే ముందుగా రాజేంద్ర ప్రసాద్ గుర్తుకు వచ్చేవారు. ఈ జనరేషన్లో కామెడీ స్టార్ అనగానే అందరికీ నవీన్ పొలిశెట్టి గుర్తుకు వస్తున్నాడు. ఈ యంగ్ హీరో కామెడీ టైమింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 2019లో వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‘తో నవీన్ తన టాలెంట్ ఏంటో చూపించాడు. ‘జాతి రత్నాలు’ సినిమాతో తన క్రేజ్ ఒక సినిమాతో పోయేది కాదని నిరూపించాడు. ఫన్ అండ్ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నవీన్ పొలిశెట్టితో సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అని నిర్మాతలు భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ హిట్ లభిస్తే నవీన్ పొలిశెట్టిని ఇక ఎవరూ ఆపలేరని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తేజ సజ్జ
యంగ్ హీరో ‘తేజ సజ్జ’ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ‘హను మాన్’తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాందించిన ఈ యంగ్ హీరో.. టాలీవుడ్ ఫ్యూచర్‌పై గట్టి భరోసా కల్పిస్తున్నాడు. తేజ ఇప్పటివరకూ చేసిన ‘జాంబిరెడ్డి’, ‘ఇష్క్’, ‘అద్భుతం’ చిత్రాలను గమనిస్తే అవన్నీ యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే. ప్రస్తుతం అతడు చేస్తున్న ‘సూపర్ యోధ’ చిత్రం కూడా సాహసోపేతమైన కథతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీ కూడా హనుమాన్ స్థాయిలో సక్సెస్ అయితే తేజ ఇక తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరముండదని సినీ నిపుణుల అభిప్రాయం.
అడవి శేషు
యువ హీరో అడవి శేషు.. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ‘గూఢచారి’ వంటి స్ఫై థ్రిల్లర్ తర్వాత ఈ హీరో కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు లవర్ బాయ్, విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అలాంటి చిత్రాలనే చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘హిట్: సెకండ్ కేసు’, ‘మేజర్’ వంటి బ్లాక్ బాస్టర్స్ వచ్చాయి. ప్రస్తుతం గూఢచారికి సీక్వెల్లో నటిస్తూ అడవి శేషు.. బిజీగా ఉన్నాడు. ఈ వ్యూహాన్నే ఫ్యూచర్లోనూ అనుసరిస్తే.. ఈ కుర్ర హీరో టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా మారే అవకాశముంది.
ప్రియదర్శి
కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మారిన నటుడు ప్రియదర్శి. 2016లో వచ్చిన ‘టెర్రర్‘ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. గ్రామీణ నేపథ్యమున్న చిత్రాల్లో హీరోగా నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాడు. గతేడాది వచ్చిన ‘బలగం’ చిత్రం ప్రియదర్శి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’ సినిమాలో ఓ డిఫరెంట్‌లో రోల్లో కనిపించి తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేశాడు. ప్రియదర్శి.. ఇలాగే తన ఫ్యూచర్ ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటే భవిష్యత్‌లో స్టార్ హీరోగా మారడం ఖాయమని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!