మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల గారాలపట్టి క్లింకార (Klin Kaara) నేడు (జూన్ 20) తన తొలిపుట్టిన రోజు జరుపుకుంటోంది. క్లింకారా పుట్టి అప్పుడే ఏడాది గడిచిపోవడంతో మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. దశాబ్దకాలం నిరీక్షణ తర్వాత రామ్‌చరణ్ తండ్రి కావడంతో పాటు.. మెగా ఫ్యామిలీకి ఎన్నో ఆనందాలు తీసుకొచ్చిన క్లింకారా గురించి తల్లి ఉపాసన ఎమోషనల్ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీలో చోటుచేసుకున్న అద్భుతాలు ఏంటి? తండ్రి రామ్‌చరణ్‌తో పాటు తాతలు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లు సాధించిన ఘనతలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
క్లింకారా.. స్పెషల్ వీడియో!
నేడు (జూన్ 20 ) క్లింకారా మొదటి పుట్టినరోజు సందర్భంగా తల్లి ఉపాసన స్పెషల్ వీడియోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఉపాసన ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి క్లింకారా పుట్టెంత వరకు మెగా కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అయ్యారో వీడియోలో కనిపించింది. పెళ్లి అయిన చాలా కాలానికి రాంచరణ్, ఉపాసన దంపతులకు క్లింకారా జన్మించడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషించింది. తన ముద్దుల కూతురుని తనివితీరా ఎత్తుకొని రాంచరణ్ ఎంతో ఎమోషనల్ అవ్వడం వీడియోలో చూడవచ్చు. ఉపాసన షేర్ చేసిన వీడియోలో క్లింకారా బారసాల విజువల్స్ కూడా ఉన్నాయి. అలాగే తన మనవరాలి గురించి చిరు మాట్లాడిన అమూల్యమైన మాటలు కూడా ఉపాసన ఈ వీడియోలో యాడ్ చేసింది. క్లింకారా స్పెషల్ వీడియోను చూసిన మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు. క్లింకారా మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన క్షణం తమకు ఎంతో అపురూపమైనదని కామెంట్స్ చేస్తున్నారు.
క్లీంకారా రాకతో గ్లోబల్ స్థాయి క్రేజ్
క్లింకారా పుట్టకముందు వరకూ రామ్‌చరణ్ క్రేజ్ టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైంది. క్లింకార ఉపాసన కడుపులో పడినప్పటి నుంచి చరణ్ దశ తిరగడం మెుదలైంది. అతడు నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ వరల్డ్ వైడ్‌గా ఆదరణ పొంది.. చరణ్‌ను గ్లోబల్ స్టార్‌ను చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కడం విశేషం. రామ్‌చరణ్ లాంటి నటుడు కావాలంటూ ఓ హాలీవుడ్ క్యాస్టింగ్ సంస్థ తమ కరపత్రంలో చరణ్ ఫొటోలు వేసే స్థాయికి అతడు ఎదిగాడు. అయితే ఇదంతా క్లింకారా అడుగుపెట్టిన వేళా విశేషమేనని మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
చిరంజీవికి పద్మవిభూషణ్
క్లీంకారా రాక తాత చిరంజీవి (Chiranjeevi)కి కూడా బాగా కలిసొచ్చిందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన ‘పద్మ విభూషణ్’.. క్లింకారా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన తర్వాతనే చిరుకు వచ్చింది. వాస్తవానికి ‘పద్మ విభూషణ్’ను చిరుకు ఇవ్వాలని ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. సినిమాకు, సమాజానికి ఆయన చేస్తున్న సేవ అమోఘమని.. వాటిని భారత ప్రభుత్వం గుర్తించి మెగాస్టార్‌ను గౌరవించాలని సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో క్లింకారా జననం తర్వాతే.. చిరును పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
పవన్ పొలిటికల్ సక్సెస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. సుమారు దశాబ్దకాలంగా ప్రజల పక్షాన పోరాటం చేశారు. 2019 ఏపీ ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసిన పవన్.. పోటీ చేసిన రెండు చోట్లా ఘోర ఓటమిని చవిచూశారు. పార్టీ తరపున గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా అప్పటి అధికార వైకాపాలోకిన జంప్ అయ్యారు. కట్ చేస్తే.. 2024లో పవన్ కల్యాణ్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఏపీ ఎన్నికల్లో నిలిచారు. టీడీపీ, భాజాపాతో కూటమి కట్టి.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో (21/21 ఎమ్మెల్యేలు, 2/2 ఎంపీలు) 100 స్ట్రైక్‌రేట్‌తో ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఏకంగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పవన్.. ఈ స్థాయిలో పొలిటికల్‌గా సక్సెస్ కావడం క్లింకారా పుట్టిన తర్వాతనే జరగడం గమనార్హం. క్లింకారా పుట్టిన తర్వాతే మెగా ఫ్యామిలీలో ఈ అద్భుతాలు జరిగాయని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.