కమల్ హాసన్ (Kamal Haasan), శంకర్ (Director Shankar) కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. తొలి ఆట నుంచే ఈ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో దాని ప్రభావం వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తొలిరోజుతో పాటు శని, ఆదివారాల్లోనూ ఈ మూవీకి తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ వీకెండ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ చిత్రం ఈ వీకెండ్ (Bharateeyudu 2 Weekend Collections)లో రూ.59 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తొలిరోజు ఈ చిత్రానికి రూ.25 కోట్లు రాగా, శని, ఆది వారాల్లో అది రూ.18.2 కోట్లు, రూ.15.1 కోట్లకు పడిపోయినట్లు పేర్కొన్నాయి. శనివారం తమిళ వెర్షన్‌కు రూ.13.7 కోట్లు, తెలుగుకు రూ.3.2 కోట్లు, హిందీలో రూ.1.3 కోట్లు వచ్చినట్లు తెలిపాయి. ఇక ఆదివారం కలెక్షన్స్ పెరగాల్సింది పోయి మరింత తగ్గినట్లు చెప్పాయి. ఆదివారం (జులై 14) ఇండియాలో ఈ సినిమాకు రూ.15.1 కోట్లు రాగా అందులో తమిళ వెర్షన్‌కే రూ.11 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తెలుగులో రూ.2.8 కోట్లు, హిందీ వెర్షన్లో రూ.1.3 కోట్లు మాత్రమే ‘భారతీయుడు 2’ రాబట్టగలిగిందని వెల్లడించాయి.
ఇకపై మరింత పతనం!
తొలి వీకెండ్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మెుదటి వారంతంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఏ స్థాయికి దిగిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల తాకిడి లేకపోవడంతో ‘భారతీయుడు 2’ ప్రసారాలను థియేటర్ యజమానులు నిలిపేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సోమవారం నుంచి ‘భారతీయుడు 2’ వసూళ్లు మరింత దారుణంగా ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి. కేవలం తమిళ మార్కెట్ ఒక్కటే ‘భారతీయుడు 2’కు ఆశా కిరణంగా ప్రస్తుతం కనిపిస్తోందని పేర్కొన్నాయి.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
‘భారతీయుడు 2’ (Bharateeyudu 2 Day 1 Collections)పై వచ్చిన నెగిటివ్ రివ్యూస్ తొలిరోజు కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.25.6 కోట్ల వసూళ్లను (GROSS) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తమిళ వెర్షన్లోనే అత్యధికంగా రూ.16.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. తెలుగులో రూ.7.9 కోట్లు, హిందీలో కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ప్రకటించాయి. హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకే నార్త్‌లో ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని చెప్పాయి. అటు తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీపై ఆసక్తి కనబరచడం లేదని తెలియజేశాయి.
ఆ చిత్రాలతో పోలిస్తే భారీ కోత!
కమల్ హాసన్ గత చిత్రం ‘విక్రమ్’ (Vikram)తో పోలిస్తే ‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. విక్రమ్ తొలి రోజున ఏకంగా రూ.60 కోట్ల వసూళ్లను సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. రీసెంట్గా కమల్ హాసన్ విలన్‌గా చేసిన ‘కల్కి 2898 ఏడీ’ తొలిరోజున రూ.190 కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కించుకొని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు డైరెక్టర్ శంకర్ గత చిత్రం ‘రోబో 2.0’ సైతం తొలిరోజు రూ.93 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే శుక్రవారం విడుదలైన ‘భారతీయుడు 2’ (Indian 2) మాత్రం ఆ చిత్రాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆయా మూవీల డే1 కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి.
అందుకే వసూళ్లు తగ్గాయా?
‘భారతీయుడు 2’ డే 1 కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఆ మూవీ అంచనాలను అందులేకపోవడమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. ఔట్ డేటెడ్ స్టోరీతో రావడం, స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉండటం ఈ సినిమాను దెబ్బతీసింది. సోషల్ మెసేజ్ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చినా, ‘భారతీయుడు’లో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్ లేకపోవడం మైనస్‌గా మారింది. పాటలు కూడా వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపించింది. అన్ని విధాలుగా ఈ సీక్వెల్లో సేనాపతి (కమల్ హాసన్) తమను నిరాశకు గురిచేశారని నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ కారణాల వల్ల ‘భారతీయుడు 2’ వసూళ్లు పడిపోయి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కథేంటి
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ.