ఆదివారం తెలంగాణలో అమిత్ షా పర్యటనలోని కార్యక్రమాలన్నీ ఒక ఎత్తైతే ఎన్టీఆర్‌తో భేటీ మరో ఒక ఎత్తు. కేవలం సినిమాలో నటనకు అభినందించడానికేనంటూ పిలిచినా రాజకీయంగా ఈ సమావేశం రచ్చ లేపుతోంది. ఎన్టీఆర్‌ను బీజేపీ ప్రచార అస్త్రంగా వాడుకోవడానికేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. భేటీ తర్వాత అనేక మంది స్పందనలు మరింత చర్చకు దారి తీస్తున్నాయి.
వాస్తవానికి అమిత్ షా టూర్ ప్లాన్‌లో తొలుత ఎన్టీఆర్ లేడు. కానీ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం అనేక రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు రేకెత్తించింది. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఈ విషయంపై స్పష్టత కోరగా అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం వారు కేవలం సినిమా గురించే మాట్లాడారని తెలిపారు. కానీ ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ సంచలనం కాబోతోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఏపీలో జనసేనతో టచ్‌లో ఉన్న భాజపా ప్రచార అస్త్రంగా ఎన్టీఆర్‌ను వాడుకుంటుందనే చర్చ సాగుతోంది. ఈ మీటింగ్‌ను ఏర్పాటుచేసింది రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ అని తెలుస్తోంది. ఆయన ఇటీవలే ఆర్‌ఎస్‌ఎస్‌పై సినిమా తీస్తా అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్ర ఉంటుందా? అనే చర్చ కూడా నడుస్తోంది.
అయితే దీనిపై భాజపా వ్యతిరేక పక్షాలు కూడా స్పందిస్తున్నాయి. అమిత్ షా ఉచ్చులో పడొద్దంటూ జూనియర్ ఎన్టీఆర్‌కు సూచనలిస్తున్నాయి. పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ స్పందిస్తూ…‘తారక్, ఎన్టీఆర్ గారి వారసత్వాన్నిసజీవంగా ఉంచండి’ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ స్నేహితుడు, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సైతం ఈ భేటీ కేవలం సినిమా కోసమేనంటే తాను నమ్మబోనని వ్యాఖ్యానించారు. పాన్ ఇండియా స్టార్‌గా దేశమంతా ఖ్యాతి గడించిన ఎన్టీఆర్‌ను రాజకీయంగా వాడుకునేందుకు అమిత్ షా భేటీ అయ్యుంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశమంతా ఎన్టీఆర్ సేవలు వినియోగించుకునే ఆలోచనలో ఉండొచ్చని చెప్పారు.
అయితే 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్టీఆర్, అమిత్ షా 20 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కలిసి భోజనం చేశారు. దీనిపై ఇప్పటిదాకా ఎన్టీఆర్ స్పందించలేదు. అమిత్ షా ట్వీట్లు కూడా కేవలం సినిమాపరంగానే కలిసినట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ భేటీపై ఎలాంటి వార్తలు వచ్చినా అవి కేవలం ఊహాగానాలే. ఎన్టీఆర్ నోరు విప్పితే తప్ప అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?