భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి దేవభూమి అని పేరు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలైన చార్‌ధమ్‌తో(chardham yatra)పాటు ఎన్నో వింతలు, మహిమలకు అక్కడ ఉన్న హిమాలయసానువులు ఆలవాలం. పర్యత శ్రేణుల మధ్యలో ఉన్న రూప్‌కుండ్(Roopkund) సరస్సు అంతు చిక్కని రహస్యాలకు నిలయంగా ఉంది. ఆ సరస్సులో వందలాది మానవ ఆస్థిపంజరాలు ఉండటం మిస్టరీగా ఉంది. ఈ ఆస్థిపంజరాలు దాదాపు వెయ్యి ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మరణాలు సైతం ఒకేసారి కాకుండా వివిధ కాలల మధ్య జరిగినట్లు చెబుతున్నారు. అసలు సముద్ర మట్టానికి 5 వేల అడుగుల ఎత్తులో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు ఎందుకు సంభవించాయి? ఏ కారణం వల్ల వీరంతా మృతి చెందారు? అనే ప్రశ్నలు శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్నాయి.
ఆస్థిపంజరాల సరస్సు(Skeleton Lake)
హిమాలయాల్లో ఎత్తైన శిఖరాల్లో ఒకటైన నందాదేవి పర్వాతానికి సమీపంలో ఉన్న రూప్‌కుండ్ సరస్సును ఆస్థిపంజరాల సరస్సు అని పరిశోధకులు పిలుస్తున్నారు. ఏడాదిలో ఎక్కువభాగం ఈ సరస్సు గడ్డకట్టుకుని ఉంటుంది. వాతావరణ పరిస్థితుల ఆధారంగా కొన్నిసార్లు విస్తరిస్తూ మరికొన్నిసార్లు కుచించుకుపోతూ ఉంటుంది.మంచు కరిగినప్పుడు ఈ సరస్సులోని అస్థిపంజరాలు (human skeletal remains) కనిపిస్తుంటాయి. దాదాపు ఈ సరస్సులో 800 వరకు అస్థిపంజరాలు ఉన్నట్లు ఆంథ్రోపాలజిస్టులు చెబుతున్నారు.
అంతు చిక్కని రహస్యాలు
రూప్‌కుండ్ (Roopkund) సరస్సు శాస్త్రవేత్తలకు ఓ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. 50 ఏళ్ల నుంచి వీటిపై పరిశోధన చేస్తున్నారు. ఈ సరస్సులో ఉన్న ఆస్థిపంజరాలు ఎవరివి? అనే విషయాన్ని తెలుసుకోనేందుకు పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఈ సరస్సుపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. 800 ఏళ్ల క్రితం ఓ భారతీయ రాజు తన పరివారంతో కలిసి వెళ్తుండగా.. మంచు తుపాను వచ్చి అంతా చనిపోయారనే కథ ప్రచారంలో ఉంది. అయితే ఈ కథను పరిశోధకులు కొట్టిపారేశారు. ఆ కథే నిజమైతే సరస్సులో ఎలాంటి మారణాయుధాలు లభ్యం కాలేదని చెబుతున్నారు. స్థానికంగా మరో కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఉన్న నందా దేవి పర్వాతాన్ని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పూజించేవారట. ఏటా జాతర నిర్వహించే వారట. ఓసారి పూజలో లోపం జరగడంతో నందా దేవి అగ్రహంతో వడగళ్ల వర్షం కురిపించిందనీ… ఆ వడగళ్ల దాటికి చాలా మంది మరణించారని చెప్పుకుంటూ వస్తున్నారు. భయంకరమైన అంటువ్యాధి సోకి సామూహిక మరణాలు సంభవించాయనే మరోవాదన కూడా ప్రచారంలో ఉంది.
శాస్త్రవేత్తల పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
అస్థిపంజరాలపై పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం.. ఇక్కడ మృతి చెందిన వారు చాలా పొడుగు మనుషులు.సగటు వయసు 35-45 ఏళ్ల మధ్య ఉంది.కొన్ని ఆస్థిపంజరాలు వృద్ధ మహిళలకు చెందినవి. ఈ సామూహిక మరణాలు 9 వ శతాబ్దంలో జరిగినవని అంచనా. యూరప్, అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన పత్రాలు.. వీరందరూ ఒకే విపత్తులో చనిపోయారనే వాదనను తిరస్కరించింది. అమెరికా, యూరప్ శాస్త్రవేత్తలు ఈ అస్థిపంజరాల గుట్ట నుంచి 38 అస్థిపంజరాలు తీసుకుని జన్యు విశ్లేషణ చేశారు. వీటిలో 15 ఆస్థిపంజరాలు మహిళలవని తేలింది. వీరిలో కొంత మంది దక్షిణాసియాకు చెందిన వారని, మరికొందరు యూరప్ దేశాలకు చెందినవారని స్పష్టం చేశారు. దక్షిణాసియా నుంచి వచ్చినా, వీరంతా ఒకే దేశానికి చెందినవారు కాదని తెలిపారు. వీటన్నింటి ఆధారంగా శాస్త్రవేత్తలు ఓ ప్రతిపాదన చేశారు. గతంలో ఇక్కడ ఓ తీర్థయాత్ర జరిగి ఉండొచ్చని, ఆ సమయంలో జరిగిన విపత్తు కారణంగా మరణించి ఉండొచ్చని చాలా మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
యురోపియన్లు ఇంత దూరం ఎందుకు వచ్చారు?
రూప్‌కుండ్‌లో నిజంగా తీర్థయాత్ర జరిగి ఉంటే ఎన్నో వేల మైళ్ల దూరం నుంచి యూరోపియన్లు ఎక్కడో భారత్‌లో ఉన్నా ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న సరస్సు వద్దకు ఎందుకు వచ్చినట్టు? ఆ కాలంలో ఈ సరస్సు గురించి వారికెలా తెలుసు? అనే ప్రశ్నలు మళ్లీ ఉదయిస్తున్నాయి? అసలు ఏకకాలంలో కాకుండా వివిధ కాలల వ్యవధిలో ఓ మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద మరణాలు ఎందుకు సంభవించాయనే ప్రశ్నలు చిక్కుముళ్లుగానే ఉన్నాయి. వీటిపై ఇంకా లోతుగా పరిశోధించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.