‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహార శైలిపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ప్రముఖ నటి అంజలి (Actress Anjali)ని బాలకృష్ణ నెట్టివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంజలి పట్ల బాలయ్య అనుచితంగా ప్రవర్తించారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను రెండ్రోజులుగా వైరల్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా హీరోయిన్ అంజలి కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ట్రోలర్స్‌కు ఇండైరెక్ట్‌గా గట్టి కౌంటర్ ఇచ్చింది.
‘మేము గొప్ప స్నేహితులం’
స్టార్ హీరోయిన్ అంజలి (Anjali).. బాలకృష్ణపై వస్తోన్న విమర్శలపై పరోక్షంగా స్పందించింది. ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక పోస్టు పెట్టింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా బాలయ్యతో పాటు ఉన్న ఓ మెమోరబుల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీంతో అంజలి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అంజలి పోస్టును షేర్ చేస్తూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
నెటిజన్లు భిన్నాభిప్రాయాలు
అంజలి పోస్టుపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటని ఆమెపై మండిపతున్నారు. బాలకృష్ణ తోసేసిన వ్యవహారం రెండ్రోజులుగా సోషల్ మీడియాను ఊదరకొడుతున్న క్రమంలో కాస్త త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటి స్పందించే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని బాలయ్య ఫ్యాన్స్ వాపోతున్నారు. మరోవైపు బాలయ్య యాంటి ఫ్యాన్స్ నటి అంజలిపై సానుభూతి చూపిస్తున్నారు. కొందరి ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఈ పోస్టు చేయాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.
నిర్మాత ఏమన్నారంటే..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిర్మాత నాగవంశీ కూడా బాలయ్య వైరల్ వీడియోపై ఇటీవలే స్పందించారు. ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని చెప్పారు. ఆ చర్యకు ముందూ.. వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని చెప్పారు. పూర్తి వీడియోను ఓ సారి చూసేయండి.
నేషనల్ వైడ్‌గా వైరల్
నటుడు బాలకృష్ణ.. నటి అంజలిని ఏ ఉద్దేశ్యంతో తోసిన అది.. నేషనల్ వైడ్‌గా మాత్రం ట్రెండ్ అయింది. ప్రముఖ జాతీయ మీడియాలు సైతం ఆ వీడియోను ప్రసారం చేశాయి. ఎంత చనువు ఉన్నా ఒక నటితో అలా ప్రవర్తిస్తారా అంటూ జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం పక్కకు వెళ్లింది. అంతా బాలయ్య-అంజిలి గురించే చర్చించుకున్నారు.